Monsoon Diet | వర్షాకాలంలో నెయ్యి తినడం మంచిదేనా? తెలుసుకోండి!
Eating Ghee in Monsoon: వానాకాలంలో సీజనల్ వ్యాధులను నివారించటానికి, రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి కొన్ని ఆహారాలు తినాలి, ఆహారంలో నెయ్యిని కలుపుకోవడం వలన ప్రయోజనాలు తెలుసుకోండి.
Eating Ghee in Monsoon: సీజన్ మారింది, వర్షాకాలం ప్రారంభమైంది. మీరు కూడా మారిన సీజన్ కు తగినట్లుగా మీరు తినే ఆహారంలో మార్పులు చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ క్రమంలో మీరు ఈ వానాకాలంలో సీజనల్ వ్యాధులను నివారించటానికి, రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి కొన్ని ఆహారాలు తినాలి, మరికొన్నింటికి దూరంగా ఉండాలి. ఈ సీజన్ లో మీ ఆహారంలో నెయ్యిని చేర్చుకోవడం అనేది మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీరు చేయగలిగే ఉత్తమమైన చర్యలలో ఒకటి.
నెయ్యిని నేరుగా ఆహారంలో కలుపుకొని తినవచ్చు లేదా వంట చేయడానికైనా ఉపయోగించవచ్చు. నెయ్యికి ఉండే అధిక స్మోక్ పాయింట్ కారణంగా, దీనిని వేడిచేసినప్పటికీ దీనిలోని పోషకాల నష్టం జరగదు. కాబట్టి నెయ్యిని కూరలు చేయడానికి, స్వీట్లు చేయడానికి కూడా ఉపయోగించవచ్చు. వర్షాకాలంలో మీ ఆహారంలో నెయ్యిని కలుపుకోవడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి, ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో, ఇక్కడ కొన్నింటిని తెలుసుకోండి.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది
నెయ్యిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి, ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికియ్, వర్షాకాలంలో జలుబు, ఫ్లూ మొదలైన సీజనల్ ఇన్ఫెక్షన్ల నుండి దూరంగా ఉంచటానికి సహాయపడుతుంది. నెయ్యిలో విటమిన్ ఎ, డి, ఇ , కె లతో పాటుగా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు కూడా ఉన్నాయి, ఇవి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి.ఈ పోషకాలు వివిధ రకాల వ్యాధులకు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని పెంచడానికి పని చేస్తాయి.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
నెయ్యి జీర్ణక్రియకు ఉత్తమమైన ఆహారాలలో ఒకటిగా పరిగణించవచ్చు. ఎందుకంటే ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరచడానికి, కడుపులో మంటను తగ్గించడానికి సహాయపడుతుంది. నెయ్యి తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరుగుతుంది, ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది, పోషకాల శోషణను పెంచుతుంది. వికారం, ఉబ్బరం, మలబద్ధకం వంటి అజీర్ణ లక్షణాల నుండి ఉపశమనం పొందడంలో కూడా సహాయపడుతుంది.
జీవక్రియను పెంచుతుంది
మితంగా నెయ్యి తీసుకోవడం వల్ల మీ జీవక్రియ పెరుగుతుంది, కొవ్వును మరింత సమర్థవంతంగా కరిగించటానికి సహాయపడుతుంది. ఎందుకంటే నెయ్యిలో మీడియం-చైన్ ఫ్యాటీ యాసిడ్స్ (MCFAs) ఉంటాయి, ఇవి శరీరం సులభంగా గ్రహించి త్వరగా శక్తి వినియోగానికి ఉపయోగపడతాయి. శక్తి స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది, బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.
మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది
కొవ్వు ఆమ్లాల అధిక సాంద్రత కారణంగా నెయ్యి మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, నిర్ణయాత్మక నైపుణ్యాలు వంటి అభిజ్ఞా సామర్థ్యాలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అదనంగా, నెయ్యిలో ఒమేగా 3 వంటి ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు ఉన్నాయి, ఇవి మెరుగైన మానసిక ఆరోగ్యం, మెరుగైన మానసిక స్థితికి దోహదపడతాయి.
పుష్కలమైన పోషకాలు
నెయ్యి మీ ఆరోగ్యానికి అవసరమయ్యే పోషకాలలను అందించే గొప్ప ఆహార పదార్థం. నెయ్యిలో విటమిన్లు A, D, E, K2 లతో పాటు కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, సెలీనియం, జింక్ , ఐరన్ వంటి మినరల్స్ కూడా ఉంటాయి. నెయ్యిలోని ఈ పోషకాలన్నీ మీ కంటి చూపును రక్షించడంలో, ఎముకలను నిర్మించడంలో, శరీరంలో ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి కణాలను రక్షించడంలో, రక్తహీనతను నివారించడానికి తోడ్పడటమే కాకుండా, మీ చర్మం, జుట్టును ఆరోగ్యంగా మార్చడానికి తోడ్పడుతుంది.
ఇలాంటి ప్రయోజనాలన్నీ పొందాలంటే, మీరు ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే, నెయ్యిని సరైన మోతాదులో ఆహారంతో పాటుగా తీసుకోవడం మర్చిపోకండి.
సంబంధిత కథనం