Male hormones: అమ్మాయిల్లో ఈ లక్షణాలుంటే శరీరంలో పురుష హార్మోన్లు పెరిగాయని అర్థం
Male hormones: మహిళల శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే అది హార్మోన్ల అసమతుల్యతకు సంకేతం. వాటిని సహజంగా ఎలా అదుపులో ఉంచుకోవాలో తెల్సుకోండి.
మన శరీరంలో హార్మోన్లకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ హార్మోన్లు రక్తం ద్వారా అవయవాలకు, కండరాలకు ఒకదానితో ఒకటి సరిగ్గా పనిచేయడానికి సందేశాన్ని చేరవేస్తాయి. ఆండ్రోజన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్లు రెండూ మహిళల శరీరంలో ఉత్పత్తి అవుతాయి. వీటిలో ఆండ్రోజన్ హార్మోన్ ను మేల్ హార్మోన్ అంటారు. మహిళల శరీరంలో ఈ హార్మోన్ ఉత్పత్తి పెరగడం ప్రారంభిస్తే పీసీఓఎస్ సమస్య మొదలవుతుంది. అదే సమయంలో కొన్ని అసాధారణ లక్షణాలు శరీరంలో కనిపించడం ప్రారంభమవుతాయి. వాటి మీద అవగాహన ఉంటే వెంటనే వైద్యుల్ని సంప్రదించవచ్చు.
ఆండ్రోజన్ పెరిగిందనడానికి సంకేతాలు:
1. శరీరంలో ఆండ్రోజన్ హార్మోన్లు పెరగడం వల్ల ముఖం మీద గడ్డం, దవడ భాగంలో, పెదవుల మీద వెంట్రుకలు రావడం మొదలవుతుంది.
2. సాధారణంగా ముఖం మీద వెంట్రుకలు ఉండొచ్చు. కానీ ఈ సమస్య వల్ల అబ్బాయిల్లో లాగా ఒత్తుగా పెరుగుతాయి. దీనితో పాటు పొట్ట, ఛాతీ, చేతులపై వెంట్రుకలు కూడా ఎక్కువగా పెరుగుతాయి. ఇవన్నీ శరీరంలో పురుష హార్మోన్లు పెరగడానికి సంకేతాలు.
3. ఉన్నట్లుండి శరీరం నుండి చెమట వాసన గాఢంగా దుర్వాసనలాగా వస్తుంటే కూడా అది శరీరంలో మగ హార్మోన్లు పెరగడానికి సంకేతం కావచ్చు.
4. దవడ, గడ్డం ప్రాంతంలో మొటిమలు వస్తుంటే.. వాటిని అడల్ట్ యాక్నె అంటారు. అవి ఆండ్రోజెన్ హార్మోన్ యొక్క అసమతుల్యతకు సంకేతం.
5. మీకు పీరియడ్స్ సమయంలో తక్కువ బ్లీడింగ్ అవుతున్నా, అలాగే సంవత్సరంలో కేవలం 10 సార్లు పీరియడ్స్ వస్తున్నా ఆండ్రోజన్ ఉత్పత్తి పెరిగిందని అర్థం.
హార్మోన్ల సమతుల్యతను ఎలా కాపాడుకోవాలి?
శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఉంటే పాల ఉత్పత్తులు మరియు గ్లూటెన్ ఆహారాలకు దూరంగా ఉండండి. ఈ ఆహారాలు శరీరంలో హార్మోన్ల ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తాయి.
ముఖంపై, ఇతర భాగాల్లో అవాంఛిత రోమాలు ఎక్కువగా పెరుగుతుంటే, పుదీనా టీ తో రోజును ప్రారంభించండి. నెటల్ టీ తాగండి. పుదీనా టీ యాంటీ ఆండ్రోజన్ ప్రకియను ప్రేరేపిస్తుంది. దీంతో క్రమంగా అవాంచిత రోమాలు పెరగడం తగ్గుతుంది.
ప్రతిసారీ భోజనంలో ప్రొటీన్ ఎక్కువగా ఉండేలా చూస్కోండి. కానీ ఈ ప్రొటీన్ కోసం చికెన్ మీద పూర్తిగా ఆధారపడకూడదు.
మెగ్నీషియం లోపం కూడా దీనికి ఒక కారణమే కాబట్టి ఇది పుష్కలంగా ఉండే గుమ్మడి గింజలు తినండి.
వీటితో పాటు స్నానానికి ముందు చర్మాన్ని పొడిగా రుద్దడం, లేదా తేలికపాటి స్క్రబ్బింగ్ చేయడం, స్నానం చేసిన తర్వాత నూనె లేదా మాయిశ్చరైజర్ రాసుకోవాలి.
పీసీఓఎస్ లక్షణాలను అదుపు చేసే మార్గాలు ఫోలిక్ ఆమ్లానికి ఉంటాయి. అందుకే డాక్టర్లు ఈ మందులను సూచిస్తారు. అది ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. బ్రొకోలీ, క్యాబేజీ, రాజ్మా, శనగలు, ఇతర ఆకుకూరలు తీసుకోవాలి.
మరికొన్ని మార్గాలు:
అవాంచిత రోమాలు తొలగించుకోడానికి తరచూ వ్యాక్సింగ్, షేవింగ్ ఎక్కువగా చేయాల్సి రావచ్చు. అందుకే సమస్య తీవ్రత బట్టి లేజర్ చికిత్స చేయించుకోవచ్చు.
ఒత్తిడి వల్ల శరీరంలో హార్మోన్ల స్థాయుల్లో అసమతుల్యతలు వస్తాయి. అందుకే మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. రోజూవారీ ధ్యానం, యోగా చేయాలి.