folic acid for pregnancy : ప్రెగ్నెన్సీకి ఫోలిక్ యాసిడ్ ఎందుకు అవసరం? నిపుణుల మాట ఇదీ..
Folic Acid Deficiency : ప్రెగ్నెన్సీ కోసం చూస్తున్న వారు, గర్భం దాల్చిన వారికి ఫోలిక్ యాసిడ్ చాలా ముఖ్యమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రత్యుత్పత్తి సామర్థ్యం గల వయస్సులో ప్రతి మహిళకు కనీసం 400 మైక్రోగ్రాముల ఫోలిక్ యాసిడ్ అవసరం. అసలు ఇది గర్భిణీలకు ఎందుకు అవసరమో.. నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
Folic Acid Deficiency : ఫోలిక్ యాసిడ్ అనేది బీ విటమిన్‌లో ఒక రకం. విటమిన్ బీ9లోని ఒక రకాన్నే ఫోలెట్ అంటారు. మన శరీరంలో కొత్త కణాలు ఉత్పత్తి చేసేందుకు ఈ ఫోలిక్ యాసిడ్ పనిచేస్తుంది. ముఖ్యంగా ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి ఇది దోహదం చేస్తుంది. అలాగే చర్మం, శిరోజాలు, గోళ్లు.. ఇలాంటి వాటి నిర్మాణంలో కూడా ప్రతిరోజూ సాయపడుతుంది. ఫోలెట్ కలిపిన ఆహారం ద్వారా ఇది ఫార్టిఫైడ్ ఫుడ్ రూపంలో ఇది లభ్యమవుతుంది. ఫోలిక్ యాసిడ్ సింథటిక్ రూపంలో ఉండే ఫోలెట్ అన్నమాట. ఇది సప్లిమెంట్లు, బియ్యం, పాస్తా, బ్రెడ్, తదితర ఆహారాల్లో బలవర్థక (ఫార్టిఫైడ్) ఆహారంగా కూడా కృత్రిమంగా కలుపుతారు.
ఒకసారి న్యూరల్ ట్యూబ్ లోపం ద్వారా ప్రెగ్నెన్సీలో సమస్యలు వచ్చిన మహిళకు మరోసారి ప్రెగ్నెంట్ అవడానికి నెల రోజుల ముందు నుంచే 4,000 మైక్రోగ్రాముల ఫోలిక్ యాసిడ్‌ను వైద్యులు సిఫారసు చేస్తారు. ఎందుకంటే.. ఇది పుట్టబోయే శిశువు ఎలాంటి లోపాలు లేకుండా, ముఖ్యంగా బేబీ బ్రెయిన్‌లో, వెన్నెముకలో ఎలాంటి వైకల్యాలు లేకుండా ఈ ఫోలిక్ యాసిడ్ కాపాడుతుంది. గర్భం దాల్చిన తరువాత ఇది న్యూరల్ ట్యూబ్ ఏర్పడడానికి దోహదపడుతుంది. రక్త హీనత నుంచి కూడా కాపాడుతుంది.
ఆ సమస్యలు 50 శాతం తగ్గాయట
సాధారణంగా ఫోలిక్ యాసిడ్ ముదురు ఆకుపుచ్చ రంగులో ఉండే కూరగాయలు, సిట్రస్ పండ్లలో లభిస్తుంది. సాధారణంగా గర్భం దాల్చిన మొదటి 3 నుంచి 4 వారాల్లోనే పిండం ఎదుగుదలలో లోపాలు ఏర్పడుతుంటాయి. ఇవి కొద్ది వారాల్లోనే బయటపడుతుంటాయి. బ్రెయిన్ ఎదుగుదల, స్పైనల్ కార్డ్ ఆకృతి తదితర విషయాల్లో లోపాలు బయటపడుతుంటాయి. అందువల్ల గర్భం దాల్చకముందే మీ వైద్యుడిని సంప్రదిస్తే ఫోలిక్ యాసిడ్ ఎప్పుడు వాడాలో చెబుతారు. గర్భం దాల్చాలనుకున్న సమయాని కంటే ఒక ఏడాది ముందుగానే ఫోలిక్ యాసిడ్ తీసుకుంటే ముందస్తు గర్భం దాల్చిన తరువాత ముందస్తు డెలివరీ సమస్య 50 శాతానికి తగ్గినట్టు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
అందువల్ల గర్భం దాల్చాలనుకున్న మహిళలకు 400 ఎంసీజీ ఫోలిక్ యాసిడ్ సిఫారసు చేస్తారు. అలాగే తొలి మూడు నెలల ప్రెగ్నెన్సీలో కూడా ఇంతే మోతాదులో ఫోలిక్ యాసిడ్ సిఫారసు చేస్తారు. నాలుగో నెల గర్భం నుంచి తొమ్మిదో నెల గర్భం వరకు 600 ఎంసీజీ ఫోలిక్ యాసిడ్ రాస్తారు. బ్రెస్ట్ ఫీడింగ్ సమయంలో కూడా 500 ఎంసీజీ ఫోలిక్ యాసిడ్ సిఫారసు చేస్తారు.
పిండం ఎదుగుదలలో ముఖ్యపాత్ర
ఫోలిక్ యాసిడ్ తీసుకోవడం వల్ల న్యూరల్ ట్యూబ్ ఎలాంటి లోపాలు ఉండవు. వీటిని స్పైనా బైఫిడా (బిడ్డ వెన్నుముక పూర్తిగా అభివృద్ధి చెందకపోవడం), అనెన్సిఫాలీ (మెదడు పూర్తిగా అభివృద్ధి చెందకపోవడం) వంటి లోపాలు అధిగమించవచ్చు. అంతేకాకుండా ఫోలిక్ యాసిడ్ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల క్లెఫ్ట్ లిప్ (పెదవి చీలిక లేదా గ్రహణం మొర్రి), ప్రిమెచ్యూర్ బర్త్, తక్కువ బరువుతో పుట్టడం, గర్భస్రావం, పిండం ఎదుగుదల లోపం వంటి సమస్యలను నివారించవచ్చు.
గర్భిణి రెండో త్రైమాసికంలో ఫోలిక్ యాసిడ్ తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్, కొన్ని రకాల క్యాన్సర్లు, అల్జీమర్స్ డిసీజ్ వంటి సమస్యలు కూడా ఉత్పన్నం కావని నిపుణులు చెబుతున్నారు.
ఫోలిక్ యాసిడ్‌ను వీటిని పొందవచ్చు..
ఫోలిక్ యాసిడ్ లభించే ఆహారాల్లో బ్రాకొలి, క్యాబేజీ, స్పింగ్ గ్రీన్స్, పాలకూర, లివర్ (మేక, గొర్రె), గింజ ధాన్యాలు, చిక్కుళ్లు, శనగలు, రాజ్మాల్లో లభిస్తుంది. కరివేపాకు, మెంతి, తోటకూర, గోడు చిక్కుడు, బెండ కాయ, మెంతులు, గుడ్డు, ఆవు పాలు వంటి వాటిలో ఫోలిక్ యాసిడ్ లభిస్తుంది. ఆవు పాలతో చేసిన పెరుగులోనూ లభిస్తుంది. కమలా (సంత్రా) పండ్ల రసంలోనూ ఫోలిక్ యాసిడ్ లభిస్తుంది. ఇక వేర్వేరు ఆహార పదార్థాలు, పొడుల రూపంలో ఫార్టిఫైడ్ లేదా ఎన్‌రిచ్‌డ్ పేరుతో ఫోలిక్ యాసిడ్ లభిస్తుంది.
సంబంధిత కథనం
టాపిక్