Sesame seeds health benefits: నువ్వులతో ఈ 7 వ్యాధులకు చెక్ పెట్టండి
Sesame seeds health benefits: నువ్వుల వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నందునే పండగలకు చేసుకునే పిండి వంటల్లో వాటికి ప్రముఖ స్థానం ఇచ్చారు మన పెద్దలు. ముఖ్యంగా చలికాలంలో వీటి అవసరం ఎక్కువగా ఉన్నందునే పలు ప్రాంతాల్లో విభిన్నమైన పిండి వంటలు చేస్తారు.
Sesame seeds health benefits: నువ్వుల వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా వీటిలో ఉండే ఫైబర్ కంటెంట్, విటమిన్లు అనేక అనారోగ్య సమస్యలకు చెక్ పెడతాయి.
1. కొలెస్ట్రాల్, ట్రైగ్లైజరిడ్స్‌కు నువ్వులతో చెక్ పెట్టండి
అధిక కొలెస్ట్రాల్, ట్రైగ్లైజరిడ్స్ స్థాయిలతో బాధపడుతున్నట్టయితే రోజూ కొన్ని నువ్వులు మీ ఆహారంలో భాగం చేసుకుంటే సరిపోతుంది. అధిక కొలెస్ట్రాల్, అధిక ట్రైగ్లైజరిడ్స్‌తో ముప్పు ఉండె గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి వాటి నుంచి నువ్వులు మిమ్మల్ని కాపాడుతాయి. వీటిలో మన శరీరానికి కావాల్సిన మంచి కొవ్వులు పాలిఅన్‌శాచ్యురేటెడ్ కొవ్వులు, మోనోఅన్‌శాచ్యురేటెడ్ కొవ్వులు అధికంగా ఉంటాయి. అంతేకాకుండా మొక్కల్లో లభించే సమ్మేళనాలు లిగ్నన్స్, పైటోస్టెరాయిస్ వీటిలో లభ్యమవుతాయి. ఈ రెండూ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. రోజూ 40 గ్రాముల నువ్వులను రెండు నెలల పాటు తినిపిస్తే చెడు కొలెస్ట్రాల్ 10 శాతం తగ్గినట్టు, ట్రైగ్లైజరిడ్స్ 8 శాతం తగ్గినట్టు ఒక అధ్యయనం తేల్చింది.
2. బ్లడ్ ప్రెజర్‌కు నువ్వులు దివ్యమైన ఔషధం
బ్లడ్ ప్రెజర్ ఎక్కువగా ఉంటే గుండెజబ్బులు, ఇతర స్ట్రోక్‌లు ఎదురయ్యే ముప్పు అధికంగా ఉంటుంది. అయితే నువ్వుల్లో ఉండే అధిక మెగ్నీషియం నిల్వలు ఈ బ్లడ్ ప్రెజర్ స్తాయిని తగ్గిస్తుంది. ఇందులో ఉండే లిగ్నన్స్, ఈ విటమిన్, ఇతర యాంటీఆక్సిడంట్లు ధమనుల్లో పలకలు పేరుకుపోకుండా నిరోధిస్తాయి. ఒక అధ్యయనంలో భాగంగా హైబ్లడ్ ప్రెజర్ ఉన్న కొంతమందికి 2.5 గ్రాముల నల్ల నువ్వుల పొడి రోజూ ఇవ్వగా నెల రోజుల తరువాత సిస్టోలిక్ బ్లడ్ ప్రెజర్ 6 శాతం తగ్గినట్టు గమనించారు.
3. ఎముకల బలహీనతలను నివారించే నువ్వులు
మీ ఎముకలు బలంగా ఉండాలంటే నువ్వులు మంచి ఔషధంగా పనిచేస్తాయి. బోన్ హెల్త్ కోసం పనిచేసే కాల్షియం సహా అనేక పోషకాలు ఈ నువ్వుల్లో ఉంటాయి. బాగా పాలిష్ అయిన నువ్వుల్లో కాల్షియం స్థాయి తగ్గుతుంది. కానీ పైపొర పోకుండా ఉన్న నువ్వుల్లో కాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్, జింక్ పుష్కలంగా ఉంటాయి. అయితే వీటిని మన శరీరం శోషించుకోకుండా కొన్ని సహజమైన సమ్మేళనాలు అడ్డుపడుతుంటాయి. వీటిని ఆక్సాలేట్స్, పైలేట్స్, యాంటీన్యూట్రియెంట్స్‌గా పిలుస్తారు. అందువల్ల నువ్వులను నానబెట్టుకుని లేదా రోస్ట్ చేసుకుని, లేదా మొలకలు చేసుకుని తింటే మన శరీరం వీటి నుంచి అన్ని ప్రయోనాలు పొందుతుంది.
4. ఇన్‌ఫ్లమేషన్‌కు నువ్వులే మందు
శరీరంలో చాలా తక్కువ స్థాయిలో ఎక్కడో ఒక చోట మంటలా, నొప్పిలా దీర్ఘకాలం వేధిస్తూ ఉంటుంది. ఈ ఇన్‌ఫ్లమేషన్ దీర్ఘకాలంలో ఒబెసిటి, క్యాన్సర్, గుండె జబ్బులు, కిడ్నీ జబ్బులకు దారితీస్తాయి. ఇన్‌ఫ్లమేషన్‌తో బాధపడుతున్న పేషెంట్లు రోజూ ఒక 20 గ్రాముల అవిసె గింజలు, 6 గ్రాముల నువ్వులు, 6 గ్రాముల గుమ్మడి గింజలు పొడి చేసుకుని 3 నెలల పాటు తీసుకుంటే మీలో ఇన్‌ఫ్లమేషన్ 50 నుంచి 80 శాతం వరకు తగ్గుతుంది.
5. ఆర్థరైటిస్ మోకాలి నొప్పులకు నువ్వులతో మేలు
ఆస్టియోఆర్థరైటిస్ సర్వసాధారణంగా వచ్చే జాయింట్ పెయిన్. ఇవి తరచుగా మోకాలు నొప్పులకు గురిచేస్తుంది. ఇన్‌ఫ్లమేషన్, ఆక్సిడేటివ్ వల్ల మృదులాస్థి కీళ్లు దెబ్బతింటాయి. అయితే నువ్వుల్లో ఉండే సెసామిన్ అనే సమ్మేళనం యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షలు, యాంటీయాక్సిడంట్ ప్రభావాలు కలిగి కార్టిలేజ్‌ను రక్షిస్తాయి. రోజూ ఒక 40 గ్రాముల నువ్వులు తీసుకుంటే 2 నెలల్లో కీళ్ల నొప్పులు 65 శాతం తగ్గినట్టు ఒక అధ్యయనం వెల్లడించింది.
6. థైరాయిడ్ ఆరోగ్యానికి నువ్వులు
నువ్వుల్లో ఉండే సెలీనియం థైరాయిడ్ పేషెంట్లకు మేలు చేస్తుంది. సెలీనియం థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేయడంలో పనిచేస్తుంది. ఐరన్, కాపర్, జింక్, విటమిన్ బీ6 వంటివి థైరాయిడ్ ఆరోగ్యాన్ని కాపాడుతాయి.
7. మెనోపాజ్‌లో హార్మన్ల సమతుల్యతకు..
మహిళల్లో రుతుచక్రం ఆగిపోయినప్పుడు మెనోపాజ్ ఏర్పడుతుంది. ఆ సమయంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. అయితే నువ్వుల్లో ఉండే ఫైటోఈస్ట్రోజెన్లు, ప్లాంట్ కాంపౌండ్లు ఈస్ట్రోజెన్ హార్మోన్ తరహాలో పనిచేస్తాయి. మెనోపాజ్ దశలో ఈస్ట్రోజెన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గడం వల్ల ఎదురయ్యే సమస్యలను నువ్వులు తీసుకోవడం వల్ల పరిష్కరించవచ్చు.