Foods For Heart Health: గుండెను ఆరోగ్యంగా ఉంచే ఫైబర్ రిచ్ ఆహారాలు
Foods For Heart Health: గుండె ఆరోగ్యానికి ఫైబర్ రిచ్ ఆహారాలు అవసరం. కొలెస్ట్రాల్ పెరగకుండా చూసుకునే ఆ ఆహారాల జాబితా ఏంటో వివరంగా తెలుసుకోండి.
గుండె ఆరోగ్యం పెంచే ఆహారాలు (pexels)
మనం ఆరోగ్యంగా ఉండటానికి రకరకాల పోషకాహారాలను తింటూ ఉంటాం. నట్స్, పండ్లు, ఆకుకూరలు.. లాంటి వాటిని మన రోజు వారీ భోజనంలో చేర్చుకుంటూ ఉంటాం. అలాగే మన గుండె ఆరోగ్యంగా ఉండేందుకు మనం రోజూ కొన్ని రకాల పదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది. అందుకు ముఖ్యంగా పీచు పదార్థాలు మనకు అవసరం. మనలో పీచు పదార్థాలు సమృద్ధిగా ఉన్నప్పుడు కొలెస్ట్రాల్ పెరగకుండా ఉంటుంది. గుండె జబ్బులకు ప్రధాన కారణాల్లో కొలెస్ట్రాల్ కూడా ఒకటి. కాబట్టి ఇది పెరగకుండా ఉంటే గుండె గట్టిగా ఉంటుందన్నట్టే. మరి గుండెకు దన్నుగా ఉండే ఆ ఫైబర్ రిచ్ ఆహారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫైబర్ రిచ్ ఆహారాలు:
- చిక్కుడు కాయలు, బీన్స్.. లాంటి వాటిలో మొక్కల సంబంధిత పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. పీచు పదార్థాల్లో నీటిలో కరిగేది, కరగనిది అని రెండు రకాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల ఈ రెండు రకాలూ మన శరీరానికి అందుతాయి. నీటిలో కరిగే పీచు పదార్థాలు కొలెస్ట్రాల్‌ని పెరగనీయవు. అలాగే నీటిలో కరగని పీచు పదార్థాల వల్ల తొందరగా కడుపు నిండిపోయిన భావన కలుగుతుంది. దీంతో తక్కువగా తింటాం. కాబట్టి వీటి వల్ల కొలస్ట్రాల్, అధిక బరువు రెండూ నియంత్రణలో ఉంటాయి. ఇవి రెండూ గుండె జబ్బులకు ప్రధాన కారణాలని చెప్పవచ్చు.
- పాలిష్ చేసి తెల్లగా చేసిన ధాన్యాలను తినకండి. బదులుగా పూర్తిగా పొట్టు తీయకుండా, ప్రాసెస్ చేయని బియ్యం, గోధుమల్లాంటి వాటిని తినేందుకు ప్రయత్నించండి. వీటిలో సమృద్ధిగా పీచు పదార్థాలు ఉంటాయి.
- పాలకూర, క్యారెట్లు, బ్రోకలీ లాంటి కూరగాయల్లోనూ గుండెకు మేలు చేసే పీచు పదార్థాలు సమృద్ధిగా లభిస్తాయి.
- పియర్లు, యాపిల్, అరటి పండు.. తదితర పండ్లను రోజు వారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇవి గుండె ఆరోగ్యకరంగా ఉండేందుకు సహకరిస్తాయి.
- కిడ్నీ బీన్స్, ఎండు ద్రాక్ష,వేరుశనగ గింజలు, పాప్‌కార్న్ లాంటి వాటిని ఆహారంలో భాగంగా తింటూ ఉండాలి.
మరికొన్ని జాగ్రత్తలు:
- అయితే ఈ పై ఆహార పదార్థాలను వండుకుని తినేప్పుడు ఎక్కువగా ఉప్పులు, కారాలు, నూనెలు వేసి తినడం వల్ల ప్రయోజనం పెద్దగా ఉండదు. వాటి వల్ల మళ్లీ గుండెకు చేటే జరుగుతుంది. అందుకనే ఈ ఆహారాలను తినేప్పుడు ఉప్పు, కారాలు తక్కువగా వేసుకుని తినడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
- ఏదైనా పదార్థాలు బేక్ చేసి తినాలని అనుకున్నప్పుడు మైదాకి బదులుగా హోల్ గ్రెయిన్ పిండ్లను వాడుకోవాలి. ఇప్పుడు మైదాకు బదులుగా మిల్లెట్స్, గోధుమ పిండి వాడి కూడా కేకులు, పీజ్జాలు, బ్రెడ్స్ చేసే విధానాలు అందుబాటులోకి వచ్చేశాయి.
- ఏ పండ్లనైనా సరే జ్యూస్ రూపంలో కాకుండా పండును పండుగా ముక్కలు చేసుకుని తినేందుకు ప్రయత్నించండి. అందువల్ల పీచు పదార్థాలు ఎక్కువగా శరీరానికి అందుతాయి.