Wheat flour bonda: గోధుమపిండితో బోండాలు.. మైదా లేకుండా ఆరోగ్యకరంగా..-wheat flour bonda with detailed measurements ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Wheat Flour Bonda: గోధుమపిండితో బోండాలు.. మైదా లేకుండా ఆరోగ్యకరంగా..

Wheat flour bonda: గోధుమపిండితో బోండాలు.. మైదా లేకుండా ఆరోగ్యకరంగా..

HT Telugu Desk HT Telugu
Aug 22, 2023 06:30 AM IST

Wheat flour bonda: మైదాతో చేసిన అల్పాహారానికి దూరంగా ఉంటున్నారా? అయితే రుచికరమైన బోండాలు గోదుమపిండితో ఎలా చేయాలో చూసేయండి.

గోదుమపిండితో బోండాలు
గోదుమపిండితో బోండాలు (https://creativecommons.org/licenses/by-sa/4.0)

అల్పాహారంలోకి బోండాలు తినాలనిపించినా మైదాతో చేసినవి తినడం అనారోగ్యకరమని ఆగిపోతాం. అందుకే ఒకసారి గోధుమపిండితో బోండాలు చేసుకుని చూడండి. నూనె ఎక్కువగా పీల్చుకోవు. బయట కరకరలాడుతూ మైదాతో చేయలేదనే విషయం కూడా కనిపెట్టలేనంత రుచిగా ఉంటాయి.

కావలసిన పదార్థాలు:

గోధుమ పిండి - 1 కప్పు

బియ్యం పిండి - ¼ కప్పు

సన్నం రవ్వ - రెండు చెంచాలు

పచ్చిమిర్చి - 3, సన్నగా తరుగుకోవాలి

ఉల్లిపాయ - 1, చిన్న ముక్కలు

అల్లం తరుము - 1 టీస్పూన్

కరివేపాకు - 1 రెమ్మ

కొత్తిమీర తరుగు - 2 చెంచాలు

పుదీనా ఆకులు - 2 చెంచాలు

రుచికి సరిపడా ఉప్పు

బేకింగ్ సోడా / వంట సోడా - ½ tsp

తయారీ విధానం:

  1. ముందుగా వెడల్పాటి గిన్నెలో గోదుమ పిండి, బియ్యం పిండి, సన్నం రవ్వ వేసుకుని బాగా కలుపుకోవాలి.
  2. ఇప్పుడు వంటసోడా, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు నీళ్లు పోసుకుంటూ పిండిని బోండాల పిండిలాగా కలుపుకోవాలి.
  3. బాగా కలుపుకున్నాక కొత్తిమీర తరుగు, పుదీనా ఆకులను చిన్నగా తరుగుకుని కలుపుకోవాలి.
  4. ఇప్పుడు కడాయిలో నూనె పోసుకుని వేడయ్యాక గోదుమ పిండి మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ బోండాలు వేసుకోవాలి. చేతితో వేసుకోవడం జారుడుగా అనిపిస్తే చిన్న చెంచా సాయంతో వేసుకుంటే చక్కగా వస్తాయి.
  5. బోండాలని టమాటా చట్నీ, అల్లం చట్నీ లేదా పల్లి చట్నీతో కలిపి తింటే చాలా బాగుంటాయి.

Whats_app_banner