PCOS and relationships: పీసీఓఎస్ ఉంటే మీ భాగస్వామితో ఇలా చేయండి
PCOS and relationships: పీసీఓఎస్ ఉన్న మహిళలు శారీరకంగా, మానసికంగా చాలా పోరాడాల్సి ఉంటుంది. అయితే వీటి నుంచి ఉపశమనానికి వారు తమ భాగస్వామితో ఇలా చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
పాలిసిస్టిక్ ఓవరీస్ సిండ్రోమ్ (పీసీఓఎస్) గుర్తించడానికి చాలా సమయం పడుతుంది. గుర్తించాక మీరు తీవ్రమైన భావోద్వేగాలకు లోనవుతారు. మీ ఆరోగ్య సమస్యలతో సతమతమవుతూనే సామాజికపరమైన ఒత్తిళ్లకు గురవుతారు. అనేక ఉచిత సలహాలు కూడా వచ్చిపడుతుంటాయి. ఇవన్నీ మీ రిలేషన్‌షిప్‌ను ఒత్తిడికి గురిచేస్తాయి. ముఖ్యంగా కొన్ని ఆరోగ్య సమస్యలు మీ లైంగిక జీవితంపై ప్రభావం చూపుతాయి. పీసీఓఎస్ కారణంగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది. అవాంఛిత రోమాలు, జుట్టు రాలిపోవడం, మొటిమలు, ఫర్టిలిటీ సమస్యలు.. ఇలా ఇవన్నీ మీ లైంగిక జీవితంపై ఒత్తిడి తెస్తాయి. అయితే శుభవార్త ఏంటంటే పీసీఓఎస్‌ను మీరు అదుపులో పెట్టుకోవచ్చు. అలాగే దీని లక్షణాలను నియంత్రణలో ఉంచుకోవచ్చు. మీకు నచ్చినట్టు మీరు జీవించవచ్చు.
‘రిలేషన్‌షిప్‌లో దాపరికాలు ఎప్పుడూ పనిచేయవు. ఇద్దరి మధ్య పారదర్శకమైన సంభాషణలు, ఓపిగ్గా వినడం, పరస్పర భావోద్వేగాలు తెలుసుకోవడం, ఒకరికొకరు సాయం చేసుకోవడం, భాగస్వామి కోలుకునేందుకు తగిన చేయూత ఇవ్వడం మీ అనుబంధాన్ని బలోపేతం చేస్తుంది. అలాగే మీ ఆరోగ్య పరిస్థితి విషయంలో నిజాయతీగా ఉండడం మంచిది. మీరు పీసీఓఎస్ నుంచి కోలుకోవడానికి మీ భాగస్వామి, మీ కుటుంబ సభ్యుల తోడ్పాటు కూడా అవసరం అవుతుందని గుర్తించండి. పీసీఓఎస్ ఒంటరిగా పోరాడాల్సిన యుద్ధం కాదు..’ అని వీరా హెల్త్ పీసీఓఎస్ క్లినిక్ సీనియర్ న్యూట్రిషనిస్ట్, కేర్ మేనేజర్ ముగ్ధా జోషి చెప్పారు.
‘పీసీఓఎస్‌తో జీవించడం ఒక సవాలు కావొచ్చు. అందువల్ల నిరాశను అనుభవించాల్సి రావొచ్చు. మీ భాగస్వామి లేదా కుటుంబంతో మీ పీసీఓఎస్ గురించి మాట్లాడడం కొద్దిగా కష్టమైన పనే కావొచ్చు. కానీ మీతో సాన్నిహిత్యం ఉన్న వీరు మీ పరిస్థితి అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. వారు విభిన్నమైన మార్గాల్లో మీకు సహాయపడవచ్చు..’ అని వివరించారు.
పీసీఓఎస్ విషయం చర్చించేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన అంశాలు
- మీకు, మీ భాగస్వామికి వీలున్న సమయాల్లో పీసీఓఎస్ గురించి మాట్లాడండి. అలా అయితే మీరు చెప్పేటప్పుడు ఆటంకాలు ఉండవు. వారు దానిని ఓపికతో విని స్పందించగలుగుతారు.
- మీ శరీరంలో కనిపిస్తున్న కొత్త లక్షణాలు వివరించడంతో ప్రారంభించండి. అది మీరోజు వారీ జీవితంపై ఎలా ప్రభావం చూపిస్తుందో చెప్పండి.
- మీరు పీసీఓఎస్ గురించి చెబుతున్నప్పుడు మీ సంభాషణ సాగుతున్న పరిస్థితులను బట్టి మీరు దీని గురించిన ప్రతి విషయాన్ని చర్చించింది. మీకు సౌకర్యంగా అనిపించిన అన్ని విషయాలు షేర్ చేసుకోండి.
- మొదటిసారే మొత్తం సమాచారంతో గందరగోళ పరచకుండా, వీలైతే వారికి సంబంధిత సమస్య గురించి చెప్పే సోర్సెస్ షేర్ చేయండి. వారు వీలున్నప్పుడు దానిని చదువుతారు.
- మీ డాక్టర్ అపాయింట్‌మెంట్స్ గురించి మీ భాగస్వామికి చెప్పండి. మీరు తీసుకునే చికిత్స ఎలా ఉండబోతోందో చెప్పండి. మీ భాగస్వామి నుంచి ఎలాంటి సహాయం ఆశిస్తున్నారో చెప్పండి.