Fertility and diabetes: షుగర్ ఉందా? మీ లైంగిక ఆరోగ్యం బాగుండాలంటే ఇలా చేయండి-follow these tips to improve fertility if you have diabetes ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Fertility And Diabetes: షుగర్ ఉందా? మీ లైంగిక ఆరోగ్యం బాగుండాలంటే ఇలా చేయండి

Fertility and diabetes: షుగర్ ఉందా? మీ లైంగిక ఆరోగ్యం బాగుండాలంటే ఇలా చేయండి

HT Telugu Desk HT Telugu
Nov 22, 2022 01:22 PM IST

Fertility and diabetes: డయాబెటిస్ ఉన్న వారు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వారి లైంగిక జీవనం, సంతానోత్పత్తి మెరుగుపడుతాయి.

లైంగిక ఆరోగ్యాన్ని దెబ్బతీసే డయాబెటిస్
లైంగిక ఆరోగ్యాన్ని దెబ్బతీసే డయాబెటిస్

రక్తంలో చక్కెరస్థాయి అధికంగా ఉండే స్థితినే డయాబెటిస్ అంటారు. ఇది దీర్ఘకాలంలో అనేక సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా నరాలను దెబ్బతీస్తుంది. గుండె జబ్బులకు కారణం అవుతుంది. స్త్రీ, పురుషుల్లో లైంగిక ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది.

బిర్లా ఫెర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ సెంటర్ కన్సల్టెంట్ డాక్టర్ దీపికా మిశ్రా హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయా అంశాలను విశ్లేషించారు. ‘డయాబెటిస్ కారణంగా హార్మోనల్ మార్పులు, న్యూరోవాస్కులర్ మార్పులు కనిపిస్తాయి. ఇది టెస్టోస్టెరాన్‌ స్థాయిని తగ్గిస్తుంది. ఈ కారణంగా లైంగిక వాంఛలు తగ్గుతాయి. శక్తి తగ్గుతుంది. డిప్రెషన్‌, యాంగ్జైటీ వంటి మానసిక అనారోగ్యానికి గురవుతారు. అలసట, బరువు పెరగడం, తరచుగా మూత్రాశయ సంబంధిత ఇబ్బందులకు గురవడం వంటి సమస్యలు మొదలవుతాయి. అలాగే పురుషుల్లో ఎరక్టైల్ డిస్‌ఫంక్షన్ (అంగస్తంభన), సంతానోత్పత్తి సామర్థ్యం సన్నగిల్లడం వంటి సమస్యలు తలెత్తుతాయి..’ అని వివరించారు.

‘స్త్రీ లైంగిక ఆరోగ్యాన్ని కూడా డయాబెటిస్ దెబ్బతీస్తుంది. మానసిక, శారీరక పరిణామాలు లైంగిక వాంఛలను తగ్గిస్తాయి. ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ (పీసీఓఎస్) ఉన్న యువతుల్లో టైప్ 2 డయాబెటిస్ రావడానికి 10 రెట్లు ఆస్కారం ఎక్కువ. పీసీఓఎస్‌తో బాధపడుతున్న వారిలో ఇన్సులిన్ నిరోధకత సంతానోత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. అధిక స్థాయిలో ఆండ్రోజెన్ ఉత్పత్తి, శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌కు దారితీయడం వంటి కారణాలు సంతానోత్పత్తి సామర్థ్యాన్ని తగ్గిస్తాయి..’ అని విశ్లేషించారు.

పురుషులు, స్త్రీలలో లైంగిక ఆరోగ్యంపై డయాబెటిస్ చూపే వ్యతిరేక ప్రభావాలను అధిగమించేందుకు డాక్టర్ కొన్ని సలహాలు ఇచ్చారు. డైట్, రోజువారీ జీవనశైలిలో ఈ కింది మార్పులు చేయాలని సూచించారు.

డయాబెటిస్ నుంచి రక్షణకు ఈ మార్పులు అవసరం

  1. వైద్యుల సిఫారసుతో తగిన ఔషధ చికిత్స తీసుకుంటూ రక్తంలో గ్లూకోజ్ స్థాయిని అదుపులో ఉంచడం
  2. తినే ఆహారంలో అధిక ఫైబర్, లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారం (ఆకు కూరలు, సలాడ్ వెజిటేబుల్స్, క్యారట్స్, బీన్స్, బ్రకోలి, తాజా పండ్లు, గింజలు) తీసుకోవాలి.
  3. రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
  4. యోగా, ధ్యానం క్రమం తప్పకుండా చేయాలి.
  5. సెడెంటరీ(కదలికలు లేని) జీవన శైలికి బ్రేక్ ఇవ్వాలి.
  6. కనీసం 8 నుంచి 10 గంటల నాణ్యమైన నిద్ర
  7. స్మోకింగ్, ఆల్కహాల్, అధిక మొత్తంలో కెఫైన్ తీసుకోవడం వెంటనే ఆపండి.
  8. ఒత్తిడి నుంచి ఉపశమనం ఇచ్చేలా బుక్ రీడింగ్, మ్యూజిక్ వినడం వంటి అలవాట్లు చేసుకోండి.
  9. ఎరక్టైల్ డిస్‌ఫంక్షన్, వజైనిస్మస్ వంటి నిర్ధిష్ట సెక్సువల్ హెల్త్ సమస్యలు ఉంటే వాటికి చికిత్స తీసుకోండి.
  10. అవసరమైతే సెక్సువల్ హెల్త్ అంశాలపై సైకలాజికల్ కౌన్సెలింగ్ తీసుకోండి.

లైంగిక ఆరోగ్యానికి ఈ జాగ్రత్తలు పాటించండి..

లిటిల్ మిరాకిల్స్ ఫెర్టిలిటీ క్లినిక్ డైరెక్టర్ డాక్టర్ శ్రీదేవి ఈ అంశంపై మాట్లాడుతూ ‘డయాబెటిస్ భారతీయుల్లో పెరిగిపోతోంది. అధిక బరువు, అనారోగ్యకరమైన జీవనశైలి డయాబెటిస్‌కు దారితీస్తుంది. డయాబెటిస్‌లో కనిపించే సర్వసాధారణమైన సమస్యలు వజైనల్ ఇన్ఫెక్షన్స్, పొడిబారడం, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, లైంగిక వాంఛ తగ్గడం, అంగస్తంభన లోపించడం, సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గిపోవడం వంటివి ఎదురవుతాయి..’ అని చెప్పారు. లైంగిక ఆరోగ్యం బాగుండడానికి పలు సూచనలు చేశారు.

  1. సురక్షిత కలయిక పద్ధతులు: గర్భ నిరోధక మార్గాల్లో కండోమ్స్ సుఖ వ్యాధుల వ్యాప్తిని అరికడతాయి. అవాంఛిత గర్భాన్ని నిరోధిస్తాయి.
  2. ఒకరి కంటే ఎక్కువ భాగస్వాములు: ఒకరి కంటే ఎక్కువ మందితో లైంగిక కలయికకు దూరంగా ఉండండి.
  3. హెచ్‌పీవీ వాక్సినేషన్: హ్యూమన్ పాపిలోమా వైరస్ జననాంగాల్లో వార్ట్స్, సర్వైకల్ క్యాన్సర్‌లకు దారితీస్తుంది. అందువల్ల హెచ్‌పీవీ వాక్సినేషన్‌తోొ వీటిని నివారించవచ్చు.
  4. వ్యక్తిగత పరిశుభ్రత: వజైనల్ వాష్‌ను ఉపయోగించడం ద్వారా వజైనల్ పీహెచ్‌ను కాపాడుకుంటూ ఇన్ఫెక్షన్లను నివారించవచ్చు.
  5. ప్రోబయోటిక్స్: యోని ఆరోగ్యం కోసం తగిన ప్రొబయాటిక్స్ తీసుకోవాలి.
  6. తరచుగా గైనకాలజిస్ట్‌ను సందర్శించాలి. పాప్‌స్మియర్ టెస్టులు చేయించుకోవాలి.
  7. షుగర్ లెవెల్స్‌ను అదుపులో పెట్టుకునేందుకు డయాబెటాలజిస్ట్‌ను తరచుగా కలవాలి.
  8. అధిక బరువు పెరగడం, అధిక దాహం, తరచుగా మూత్ర విసర్జన చేయాల్సి రావడం, తరచుగా యూరినరీ ఇన్ఫెక్షన్ల బారినపడడం వంటివి ఎదురైనప్పుడు డాక్టర్‌ను సంప్రదించాలి.
  9. క్రమం తప్పకుండా వారంలో 5 రోజులు కనీసం 45 నుంచి 60 నిమిషాలు వ్యాయామం చేయాలి.
  10. న్యూట్రీషనిస్టును సంప్రదించి తగిన డైట్ ఫాలో అవ్వాలి.

Whats_app_banner