Vitamins - Minerals। శరీరానికి ఏయే విటమిన్లు, మినరల్స్ అవసరం.. అవి ఎలా లభిస్తాయి?
Foods For Vitamins and Minerals: శరీరంలో రోగనిరోధక శక్తికి , శరీర విధులు సక్రమంగా జరగటానికి విటమిన్లు, ఖనిజాలు వంటి సూక్ష్మపోషకాలు అవసరం. వాటి మూలాలను ఇక్కడ చూడండి.
విటమిన్లు, ఖనిజాలు మన శరీరం తన సాధారణ విధులను నిర్వహించడానికి అవసరమయ్యే సూక్ష్మపోషకాలు. అయితే, ఈ సూక్ష్మపోషకాలు మన శరీరంలో ఉత్పత్తి కావు, వీటిని మనం తినే ఆహారం నుండే పొందాలి. ఇవి మన ఆరోగ్యానికి చాలా కీలకమైనవి. వీటిలో శరీరానికి ఏ విటమిన్, మినరల్ లోపం ఏర్పడినా అది తీవ్రమైన, ప్రాణాంతక పరిస్థితులను కలిగిస్తుంది. శరీరంలో రక్షణ వ్యవస్థకు కూడా వీటి అవసరం ఉంటుంది. రోగనిరోధక వ్యవస్థ అనేది బ్యాక్టీరియా, వైరస్‌లు, శిలీంధ్రాలు వంటి హానికారక సూక్ష్మజీవుల నుండి టాక్సిన్స్ అని పిలిచే రసాయనాల ప్రభావాల నుంచి శరీరాన్ని రక్షించే ఒక వ్యవస్థ. కాబట్టి రోజూవారీగా శరీరానికి విటమిన్లు, ఖనిజాలు అవసరం అవుతాయి.
మీ రోగనిరోధక వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి ఎలాంటి సూక్ష్మపోషకాలు అవసరం అవుతాయి. మీరు వాటిని ఎలా పొందవచ్చు అనే దాని గురించి ఇక్కడ తెలుసుకోండి.
Foods For Vitamins and Minerals - విటమిన్లు, ఖనిజాలు లభించే ఆహారాలు
విటమిన్లు సేంద్రీయ పదార్థాలు, ఇవి సాధారణంగా కొవ్వులో కరిగేవి లేదా నీటిలో కరిగేవిగా ఉంటాయి. వివిధ అధ్యయనాలు, అరోగ్య నిపుణుల ప్రకారం మన రోగనిరోధక వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి శరీరానికి ప్రతిరోజూ విటమిన్లు A, D, C, E, B6, B12లతో పాటు ఫోలేట్, జింక్, ఇనుము, రాగి, సెలీనియం వంటి మినరల్స్ అవసరం. ఈ సూక్ష్మపోషకాలు ఏ విధంగా పొందవచ్చో చూద్దాం.
విటమిన్ ఎ
శరీరానికి ఇన్ఫెక్షన్లు సోకకుండా, ముఖ్యంగా శ్వాసకోశ ఇన్ఫెక్షన్లతో పోరాడడంలో ఈ పోషకం చాలా కీలకం. మన శరీరం స్వయంగా తయారు చేసుకోని సూక్ష్మపోషకాల్లో ఇది ఒకటి. ఆకుకూరలు, క్యారెట్లు, పెరుగు, గుడ్లు వంటి ఉత్పత్తుల నుండి, అలాగే సాల్మన్, ట్యూనా మొదలైన కొవ్వు చేపలను మీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా విటమిన్ ఎ లభిస్తుంది.
విటమిన్ సి
ఇన్ఫెక్షన్‌లను నివారించడంలో లేదా వాటి ప్రభావాన్ని తగ్గించడంలో విటమిన్ సి కీలకం. నారింజ, బత్తాయి వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది, అలాగే బచ్చలికూర, కాలే, క్యాప్సికమ్, మొలకలు వంటి వెజిటెబుల్స్, స్ట్రాబెర్రీ, బొప్పాయి వంటి పండ్ల నుండి కూడా పొందవచ్చు.
విటమిన్ డి
అధ్యయనాల ప్రకారం, వైరస్ ఇన్ఫెక్షన్లు సోకిన చాలా మందిలో విటమిన్ డి లోపం ఉన్నట్లు గుర్తించారు. జలుబు, ఫ్లూ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి విటమిన్ డి అవసరం. ఇది నేరుగా సూర్మరశ్మి నుంచి పొందవచ్చు. అలాగే సాల్మన్ చేప, సార్డినెస్, హెర్రింగ్, మాకేరెల్ వంటి కొవ్వు చేపలు,ఎర్ర మాంసం, కాలేయం, గుడ్డు సొనల నుండి విటమిన్ డి లభిస్తుంది.
విటమిన్ ఇ
విటమిన్ ఇ అనేది ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. శరీరంలో జరిగే సుమారు 200 బయోకెమికల్ ప్రతిచర్యలకు ఈ పోషకం అవసరం. ఇది శరీరానికి అంటువ్యాధుల నుండి పోరాడటానికి కూడా సహాయపడుతుంది. బాదం, వేరుశనగ, పొద్దుతిరుగుడు గింజలు, హాజెల్ నట్స్, అలాగే పొద్దుతిరుగుడు, కుసుమ, సోయాబీన్ నూనె వంటి అధిక కొవ్వు మొక్కల ఆహారాల నుండి విటమిన్ ఇ పొందవచ్చు.
జింక్
జింక్ లోపం వలన తెల్ల రక్తకణాలలోని లింఫోసైట్‌ల నిర్మాణం, వాటి క్రియాశీలత బలహీనడుతుంది. ఇది బలహీనమైన రోగనిరోధక శక్తికి దారితీస్తుంది. నత్త గుల్లలు, పీత, ఎండ్రకాయలు, మటన్, చిక్‌పీస్, జీడిపప్పు, బీన్స్ వంటి ఆహారాల ద్వారా జింక్ లభిస్తుంది.
ఫోలేట్
శరీరం ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాలను ఏర్పరచడంలో సహాయపడటానికి ఈ సూక్ష్మపోషకం కీలకం. న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అనే పుట్టుకతో వచ్చే లోపాల ప్రమాదాన్ని తగ్గించడానికి కూడా ఫోలేట్ అవసరం. మీరు ఈ పోషకాన్ని ఆకుకూరలు, బ్రోకలీ, బ్రస్సెల్స్ మొలకలు, బఠానీలు, చిక్‌పీస్ , కిడ్నీ బీన్స్ , తృణధాన్యాల నుండి పొందవచ్చు.
సెలీనియం
ఈ యాంటీ ఆక్సిడెంట్ బ్యాక్టీరియా, వైరస్‌ల నుంచి రక్షించడానికి, క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడటానికి అవసరం. బ్రెజిల్ గింజలు సెలీనియం పుష్కలంగా ఉంటుంది. ఇంకా ట్యూనా, హాలిబట్, హామ్, టర్కీ , కాటేజ్ చీజ్ వంటి ఆహారాల నుండి కూడా పొందవచ్చు.