Sunlight Health Benefits । చలికి ఎండలో ఉంటున్నారా? అయితే ఎంతసేపు ఉండటం శ్రేయస్కరమో తెలుసుకోండి!
Sunlight Health Benefits: చలిని తట్టుకునేందుకు ఎండలో ఉంటున్నారా? అయితే ఎంత సమయం సూర్యరశ్మిని పొందడం ఉత్తమం, దీని వలన కలిగే ప్రయోజనాలు తెలుసుకోండి.

మొక్కలు పెరగటానికైనా, వ్యక్తుల ఆరోగ్యానికైనా స్యూర్యరశ్మి ఎంతో ముఖ్యం. సూర్యుడు ఈ భూమిపై పెరిగే ప్రతి జంతుజాలానికి, వృక్షజాలానికి ఒక నిత్యావసరం. చలికాలంలో చాలా మంది వద్దనకున్నా ఎండలో ఉండేందుకు ఇష్టపడతారు. చల్లని చలి నుంచి ఈ ఎండ వారికి వెచ్చని అనుభూతిని అందిస్తుంది. మీరూ ఇలా ఎండలో గడుపుతారా? అయితే అది మంచి అలవాటే కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ సూర్యరశ్మితో ఆరోగ్య ప్రయోజనాలతో పాటు, కొన్ని దుష్ప్రభావాలు ఉంటాయి. సూర్యుడి నుండి వచ్చే UV రేడియేషన్ చర్మ క్యాన్సర్‌కు కారణమవుతుందని ఇప్పటికే పలు అధ్యయనాలు వెల్లడించాయి. అలాగే కఠినమైన సూర్యకాంతి చర్మంపై నల్లని టానింగ్ కు కారణమవుతుంది, ఎండ వేడిమి ఎక్కువైతే డీహైడ్రేషన్ ప్రమాదం ఉంది.
కాబట్టి సూర్యరశ్మి నుంచి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, తమని తాము రక్షించుకుంటూనే, ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందడం తెలివైన చర్య అనిపించుకుంటుంది.
Sunlight Health Benefits - సూర్యరశ్మితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
సూర్యరశ్మితో శరీరానికి కావలసిన డి- విటమిన్ నేరుగా లభిస్తుంది, ఇంకా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి, ఎంతసేపు సూర్యరశ్మి పొందడం ఉత్తమం, మొదలైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సహజసిద్ధంగా విటమిన్ డి
మన శరీరానికి డి- విటమిన్ చాలా అవసరం. ఇది శరీరంలో అనేక కీలక కార్యకలాపాలను నిర్వహిస్తుంది. ఇది వాపును తగ్గిస్తుంది, కణాల విస్తరణను నియంత్రిస్తుంది. అయితే విటమిన్ డి సప్లిమెంట్ల రూపంలో లభిస్తున్నప్పటికీ అది సరిపోకవచ్చు. కానీ సూర్యరశ్మి నుంచి మీకు నేరుగా సహజసిద్ధంగా డి-విటమిన్ లభిస్తుంది. వారంలో కొన్ని రోజులు కేవలం 5 నుంచి 15 నిమిషాల పాటు ఎండలో ఉంటే చాలు, మీ శరీరానికి సరిపడా మోతాదులో విటమిన్ డి లభ్యమవుతుంది.
ఎముకల పటుత్వాన్ని కాపాడుతుంది
శరీరంలో విటమిన్ డి లోపం వలన ఎముకలు సన్నగా, పెళుసుగా తయారవుతాయి. ఎముకల ఆకృతి కూడా మారవచ్చు. ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఇది రికెట్స్ వ్యాధికి దారితీయవచ్చు. ఈ విటమిన్ డి అనేది శరీరంలో ఎముకల నిర్మాణానికి అవసరమయ్యే కాల్షియం స్థాయిలను నిర్వహించడానికి అవసరం. కాబట్టి ప్రతిరోజూ 15 నిమిషాల పాటు ఎండలో ఉండటం ద్వారా ఈ సమస్య పరిష్కారం అవుతుంది, సూర్యరశ్మి ఎముకల పటుత్వాన్ని కాపాడుతుంది.
డిప్రెషన్‌తో పోరాడుతుంది
వెచ్చని ఎండలో ఉన్నప్పుడు మీ శరీరానికి ఒక రకమైన హాయి లాంటి అనుభూతి కలుగుతుంది. ఈ సమయంలో మీ శరీరంలో మీ మానసిక స్థితిని మెరుగుపరిచే సెరోటోనిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఇది మిమ్మల్ని డిప్రెషన్ నుంచి బయటకు తీసుకువస్తుంది. మిమ్మల్ని ప్రశాంతంగా విశ్రాంతి తీసుకునేలా ప్రోత్సహిస్తుంది.
మధుమేహం నివారణ
రోజూ కొంత సమయం ఎండలో గడపడం మధుమేహాన్ని నివారించడానికి చౌకైన, సులభమైన మార్గంగా చెప్తారు. సూర్యరశ్మి నుంచి లభించే విటమిన్ డి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే హార్మోన్ ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ విషయాన్ని పలు అధ్యయనాలు ధృవీకరించాయి. అంతేకాకుండా బరువు తగ్గడంలో కూడా సూర్యరశ్మి పాత్ర కొంత ఉండవచ్చునని మరికొన్ని అధ్యయనాలు వెల్లడించాయి.
ఎక్కువ కాలం బ్రతకడానికి
జర్నల్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్‌లో ప్రచురించిన ఒక పరిశోధన ప్రకారం, ఎండలో ఎక్కువ సమయం గడిపిన వారు, ఎండలో గడపని వారితో పోలిస్తే ఎక్కువ కాలం జీవిస్తారు, వారి రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా, వారి ఆయుర్ధాయం కూడా ఆరు నెలల నుంచి రెండు సంవత్సరాలు వరకు పెరగవచ్చునని అధ్యయనం పేర్కొంది.
అయితే ఇదివరకు చెప్పినట్లుగా తెలివిగా సూర్యరశ్మి నుంచి ఆరోగ్య ప్రయోజనాలు పొందాలి. రోజూ ఉదయం 8 గంటల లోపు స్వీకరించే తేలికైన సూర్యరశ్మి మంచిది, అది కూడా 15 నిమిషాలు సరిపోతుంది. ఎక్కువ ఉండాల్సి వస్తే సన్ స్క్రీన్ లోషన్ ఉపయోగించాలి. మరీ ముఖ్యంగా ఇది చలికాలం, వర్షాకాలాలకు వర్తిస్తుంది. ఎండాకాలంలో మన దేశంలో విపరీతమైన ఎండలు ఉంటాయి, అప్పుడు ఎండలో ఉండకపోవటమే మంచిది.
సంబంధిత కథనం