Cold Water Bathing: చలికాలంతో చన్నీటి స్నానం.. ఆరోగ్యానికి లాభమా, నష్టమా?-is cold water bathing good or bad for health in winter ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Cold Water Bathing: చలికాలంతో చన్నీటి స్నానం.. ఆరోగ్యానికి లాభమా, నష్టమా?

Cold Water Bathing: చలికాలంతో చన్నీటి స్నానం.. ఆరోగ్యానికి లాభమా, నష్టమా?

Chatakonda Krishna Prakash HT Telugu
Dec 14, 2024 08:30 AM IST

Cold Water Bathing in Winter: చలికాలంలో చన్నీటి స్నానం గురించి చాలా మందికి సందేహాలు ఉంటాయి. శీతల వాతావరణం ఉండే ఈ కాలంలో చల్లటి నీటితో స్నానం చేస్తే ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుందోననే ఆలోచన ఉంటుంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

Cold Water Bathing: చలికాలంతో చన్నీటి స్నానం.. ఆరోగ్యానికి లాభమా.. నష్టమా?
Cold Water Bathing: చలికాలంతో చన్నీటి స్నానం.. ఆరోగ్యానికి లాభమా.. నష్టమా?

వాతావణం చల్లగా ఉండే శీతాకాలంలో చన్నీటితో స్నానాన్ని ఎక్కువ మంది ఇష్టపడరు. చలికాలంలో వేడి నీటితో స్నానం చేస్తే ఉపశమనంగా ఫీల్ అవుతారు. చలి నుంచి రిలీఫ్ కోసం చాలా మంది వేడి నీటికే ఓటేస్తారు. అయితే, చలికాలంలో చన్నీటి స్నానంతోనే ఆరోగ్యానికి ఎక్కువ లాభాలు ఉంటాయి. వేడి నీటితో పోలిస్తే చన్నీటి స్నానమే ప్రయోజనకరంగా ఉంటుంది. ఆ విషయాలు ఇక్కడ తెలుసుకోండి.

జుట్టుకు, చర్మానికి మంచిది

చలికాలంలో వేడి నీటికి బదులుగా చన్నీటి స్నానం చేస్తే జుట్టుకు, చర్మానికి ఎక్కువ మేలు జరుగుతుంది. వేడి నీటి వల్ల చర్మం పొడిబారడం, ర్యాషెస్ రావడం ఎక్కువవుతుంది. చన్నీటితో స్నానం చేస్తే ఈ సమస్యల నుంచి పరిష్కారం దక్కే అవకాశం ఉంటుంది. చర్మం, జుట్టు రంధ్రాలను చల్లటి నీరు సీల్ చేయగలదు. జుట్టుకు కూడా వేడి నీటితో పోలిస్తే చన్నీటి స్నానమే బెస్ట్. జుట్టు పొడిబారడం, రాలడాన్ని చన్నీటి స్నానం తగ్గిస్తుంది.

రక్తప్రసరణ మెరుగ్గా.. లోపల వెచ్చగా..

చన్నీటి స్నానం చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటుంది. అవయవాలకు రక్తం బాగా అందుతుంది. దీనివల్ల శరీరంలో అంతర్గతంగా వెచ్చదనం కలుగుతుంది. వేడి నీటితో స్నానం చేస్తే చర్మంపై వేడిగా అనిపించినా.. లోపల పెద్దగా ఎఫెక్ట్ ఉండదు. అదే చన్నీటితో స్నానం చేస్తే బయటికి చల్లగా ఫీల్ అయినా.. శరీరంలో లోపల వెచ్చదనం ఉంటుంది.

రోగ నిరోధక శక్తి కూడా..

చలికాలంలో చన్నీటితో స్నానం చేస్తే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుందని మీకు తెలుసా? చల్ల నీరు వల్ల శరీరంలో తెల్ల రక్తకణాల శాతం పెరుగుతుంది. జీవక్రియ కూడా మెరుగ్గా ఉంటుంది. దీనివల్ల తెల్ల రక్తకణాల విడుదల ఎక్కువగా ఉంటుంది. ఇవి రోగ నిరోధక వ్యవస్థకు మేలు చేస్తాయి.

మంచి మూడ్

చన్నీటి స్నానం చేయడం వల్ల మూడ్ కూడా మెరుగ్గా మారుతుంది. చలిగా అనిపించినా.. కాసేటికై హాయిగా ఉన్న ఫీలింగ్ కలిగుతుంది. శరీరంలో రిలాక్స్ అవుతుంది.

కండరాల నొప్పికి..

చన్నీరు కండరాల నొప్పి నుంచి కూడా ఉపశమాన్ని కలిగించలదు. కండరాలు బిగుసుకుపోవడాన్ని తగ్గించగలవు. కోల్డ్ కంప్రెసర్‌లా ఉపయోగపడుతుంది.

ఈ విషయాలు గుర్తుంచుకోవాలి

చలికాలంలో చన్నీటి స్నానం చేయడం వల్ల ఆరోగ్యానికి లాభాలు ఉంటాయి. అయితే, కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. జలుబు, దగ్గు, గొంతులో ఇబ్బంది లాంటి సమస్యలు ఉన్నప్పుడు చన్నీటి స్నానం చేయడం అంత మంచిది కాదు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నా చన్నీటి స్నానంతో ఇబ్బందులు ఏర్పడవచ్చు. జలుబు, దగ్గు, జ్వరానికి కారణం కావొచ్చు. అందుకే ఏవైనా సమస్యలు ఉంటే చన్నీటి స్నానం విషయంలో సంబంధిత వైద్యుల సూచనలు తీసుకోవాలి.

Whats_app_banner

సంబంధిత కథనం