Thirst: నీరు తాగినా పదేపదే దాహం అవుతోందా? కారణాలు ఇవే అయిండొచ్చు!-reasons for excessive thirst even after drinking water ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Thirst: నీరు తాగినా పదేపదే దాహం అవుతోందా? కారణాలు ఇవే అయిండొచ్చు!

Thirst: నీరు తాగినా పదేపదే దాహం అవుతోందా? కారణాలు ఇవే అయిండొచ్చు!

Chatakonda Krishna Prakash HT Telugu
Dec 13, 2024 04:30 PM IST

Excessive Thirst reasons: ఒక్కోసారి సరిపడా నీరు తాగినా మళ్లీ వెంటనే దాహం వేస్తుంటుంది. ఇలా పదేపదే అవుతుంటుంది. దీనికి కొన్ని కారణాలు ఉండొచ్చు. అవేంటో ఇక్కడ తెలుసుకోండి.

Thirst: నీరు తాగినా పదేపదే దాహం అవుతోందా? కారణాలు ఇవే అయిండొచ్చు!
Thirst: నీరు తాగినా పదేపదే దాహం అవుతోందా? కారణాలు ఇవే అయిండొచ్చు!

ప్రతీ రోజు అందరూ శరీరానికి సరిపడా నీరు తాగాల్సిందే. తగినంత నీరు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉంటాయి. అయితే, ఒక్కోసారి నీరు తాగినా వెంటనే దాహం వేస్తుంటుంది. పదేపదే నీరు తాగాలని అనిపిస్తుంది. సాధారం కంటే దాహం ఎక్కువగా అవుతుంటుంది. దీనికి కొన్ని కారణాలు ఉంటాయి. అవేంటో ఇక్కడ తెలుసుకోండి.

yearly horoscope entry point

ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారం

ఉప్పు, కారం ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకున్న సమయంలో దాహం తరచుగా అవుతుంటుంది. నీరు తాగిన వెంటనే మళ్లీ దాహం కలిగిన ఫీలింగ్ ఉంటుంది. ఉప్పులో ఉండే సోడియం ఇందుకు కారణం అవుతుంది. ఉప్పు అధికంగా ఉన్న ఫుడ్ తిన్నప్పుడు.. రక్తంలో ఉప్పు కరుగుతుంది. రక్తంలో సోడియం ఎక్కువైతే.. దాన్ని ఫిల్టర్ చేసేందుకు మూత్రపిండాలు ఎక్కువ యూరిన్‍ను క్రియేట్ చేస్తాయి. దీనివల్ల ఫ్లుయిడ్స్ తక్కువవడంతో దాహం వేస్తుంటుంది. ఇలా జరిగినప్పుడు ఉప్పు లేని ఆహారాలు తినాలి.

ఎక్కువ డీహైడ్రేషన్

శరీరం నుంచి ఎక్కువ చెమట బయటికి వెళితే డీహైడ్రేషన్ ఎక్కువగా అవుతుంది. తీవ్రంగా వర్కౌట్స్ చేసినా, ఎక్కువ సేపు ఎండకు ఉన్నా, ఏదైనా టెన్షన్ పడినా ఎక్కువ చెమట వస్తుంటుంది. వాంతులు, విరేచనాలు ఉన్న సమయంలోనూ ఇలా జరుగుతుంటుంది. ఇలా డీహైడ్రేషన్ ఎక్కవగా అయినప్పుడు నీరు తాగినా వెంటనే మళ్లీ దాహంగా అనిపిస్తుంది.

డయాబెటిస్ వల్ల..

డయాబెటిస్ ఉన్న వారికి అతి దాహం సమస్య, అతి మూత్రం సమస్యలు తరచూ ఎదురవుతుంటాయి. రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువైనప్పుడు ఇది జరుగుతుంటుంది. షుగర్ లెవెల్ ఎక్కువైతే మూత్రం ద్వారా గ్లూకోజ్ బయటికి వెళ్లాల్సి ఉంటుంది. యూరిన్‍తో గ్లూకోజ్ వెళ్లే సమయంలో వాటర్ కూడా వెళ్లిపోతుంది. దీనివల్ల మూత్రం ఎక్కువవడమే కాకుండా దాహం కూడా తరచూ వేస్తుంది. మళ్లీమళ్లీ నీరు తాగాలనిపిస్తుంటుంది.

థైరాయిడ్ సమస్య

థైరాయిడ్ సమస్య ఉన్న వారికి కూడా ఎక్కువగా దాహం వేసే అవకాశం ఉంటుంది. థైరాయిడ్ వల్ల చెమట ఎక్కువగా వస్తుంటుంది. దీంతో శరీరంలో వాటర్ కంటెంట్ తగ్గిపోతుంది. అందుకే సరిపడా నీరు తాగినా దాహం తరచూ వేస్తుంటుంది.

మద్యం, తీపి డ్రింక్స్ తాగినప్పుడు..

మద్యం తాగిన సమయంలో మూత్రం అధికంగా వస్తుంటుంది. హార్మోన్లు గతి తప్పుతాయి. అందుకే మద్యం తాగిన సమయాల్లో ఎక్కువగా దాహం వేస్తుంది. తీపిగా ఉండే పానియాలు తీసుకున్నా ఒక్కోసారి ఇలా జరుగుతుంది. ముఖ్యంగా కూల్‍డ్రింక్స్ తాగిప్పుడు కొందరిలో ఈ సమస్య తలెత్తుతుంది.

మందుల వాడకం వల్ల..

కొన్ని మందులు వాడడం వల్ల కూడా దాహం ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. అవి శరీరంలో హైడ్రేషన్‍పై ప్రభావం చూపిస్తాయి. నోరు ఎండిపోతూ ఉంటుంది. ఇలాంటివి ఎదురైనప్పుడు సంబంధిత వైద్య నిపుణులను సంప్రదించి.. మందుల గురించి అడగాలి. తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకోవాలి. ఇబ్బంది ఎక్కువగా ఉంటే మందులు మార్చాల్సిన అవసరం ఉండొచ్చు.

కిడ్నీలు, లివర్ డ్యామేజ్ అయినప్పుడు కూడా దాహం అతిగా వేస్తుంటుంది. ఇలాంటి సందేహాలు ఉంటే వెంటనే వైద్య నిపుణులను సంప్రదించాలి. మీ సమస్యను వివరంగా చెప్పాలి. సూచించిన జాగ్రత్తలు పాటించాలి.

Whats_app_banner