Pranaya Godari Review: ప్రణయ గోదారి రివ్యూ - తెలుగులో వ‌చ్చిన‌ రా అండ్ ర‌స్టిక్ ల‌వ్‌స్టోరీ మూవీ ఎలా ఉందంటే?-pranaya godari movie review tollywood latest raw and rustic love drama movie plus nd minus points ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pranaya Godari Review: ప్రణయ గోదారి రివ్యూ - తెలుగులో వ‌చ్చిన‌ రా అండ్ ర‌స్టిక్ ల‌వ్‌స్టోరీ మూవీ ఎలా ఉందంటే?

Pranaya Godari Review: ప్రణయ గోదారి రివ్యూ - తెలుగులో వ‌చ్చిన‌ రా అండ్ ర‌స్టిక్ ల‌వ్‌స్టోరీ మూవీ ఎలా ఉందంటే?

Nelki Naresh Kumar HT Telugu
Dec 14, 2024 08:57 AM IST

Pranaya Godari Review: ప‌ల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కిన ప్రేమ‌క‌థా చిత్రం ప్ర‌ణ‌య గోదారి శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. స‌ద‌న్‌, ప్రియాంక ప్ర‌సాద్ హీరోహీరోయిన్లుగా న‌టించిన ఈ మూవీలో సాయికుమార్ కీల‌క పాత్ర పోషించాడు.

ప్రణయ గోదారి రివ్యూ
ప్రణయ గోదారి రివ్యూ

Pranaya Godari Review: క‌మెడియ‌న్ అలీ మేన‌ల్లుడు స‌ద‌న్ హీరోగా న‌టించిన మూవీ ప్ర‌ణ‌య గోదారి. విలేజ్ ల‌వ్‌స్టోరీగా తెర‌కెక్కిన ఈ మూవీకి పీఎల్ విఘ్నేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ప్రియాంక ప్ర‌సాద్ హీరోయిన్‌గా న‌టించిన ఈ మూవీలో సాయికుమార్ కీల‌క పాత్ర పోషించాడు. శుక్ర‌వారం థియేట‌ర్ల‌లో రిలీజైన ప్ర‌ణ‌య‌గోదారి మూవీ ఎలా ఉందంటే?

గోదారి ప్రేమ‌క‌థ‌...

గోదారి గ‌ట్టున ఉన్న న‌ల‌భై ఊళ్ల‌కు పెద‌కాపు (సాయికుమార్) చెప్పిందే వేదం. అత‌డి మాట‌కు ఎదురే ఉండ‌దు. చెల్లెలు ఇష్టం లేని పెళ్లి చేసుకోవ‌డంతో పెద‌కాపుకు ప్రేమంట‌నే ప‌డ‌దు. భ‌ర్త చ‌నిపోవ‌డంతో పెద‌కాపు చెల్లెలు త‌న కొడుకు శీనుతో (సదన్) క‌లిసి అత‌డి ఇంటికి వ‌స్తుంది. సోద‌రికి పెద‌కాపు త‌న ఇంట్లోనే ఆశ్ర‌యం కల్పిస్తాడు. శీనుకు త‌న కూతురు ల‌లిత‌ను (ఉష‌శ్రీ) ఇచ్చి పెళ్లిచేయాల‌ని పెద‌కాపు అనుకుంటాడు.

కానీ శీను మాత్రం జాల‌రి కూతురు ల‌క్ష్మి(ప్రియాంక ప్ర‌సాద్‌)ని ఇష్ట‌ప‌డ‌తాడు. ఆమెను పెళ్లిచేసుకోవాల‌ని అనుకుంటాడు. పెద‌కాపు అధిప‌త్యానికి అడ్డుక‌ట్ట వేయాల‌ని ఆ ఊరికే చెందిన ద‌త్తుడు ప్ర‌య‌త్నాలు చేస్తుంటాడు. శీను, ల‌క్ష్మి ప్రేమ విష‌యం తెలిసి పెద‌కాపు ఏం చేశాడు? మేన‌మామ‌ను ఎదురించి త‌న ప్రేమ‌ను శీను గెలిపించుకున్నాడా? ద‌త్తుడు, పెద‌కాపు మ‌ధ్య ఉన్న గొడ‌వ‌కు కార‌ణ‌మేమిటి? అన్న‌దే ప్ర‌ణ‌య గోదారి క‌థ‌.

ప‌రువు హ‌త్య‌ల నేప‌థ్యంలో...

టాలీవుడ్‌లో గ‌తంలో ప్రేమ‌క‌థాచిత్రాలు ఎక్కువ‌గా ప‌ల్లెటూరి నేప‌థ్యాల‌తోనే సాగేవి. ఇప్పుడా ట్రెండ్ త‌గ్గిపోయింది. చాలా రోజుల త‌ర్వాత విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో స్వ‌చ్ఛ‌మైన ప్రేమ‌క‌థా చిత్రంగా ప్ర‌ణ‌య‌గోదారి తెలుగు ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఓ యువ జంట ప్రేమ‌కు కుల‌మ‌తాలు ఎలా అడ్డుగోడ‌లుగా నిలిచాయ‌నే కాన్సెప్ట్‌తో ద‌ర్శ‌కుడు పీఎల్ విఘ్నేష్ ఈ మూవీని తెర‌కెక్కించాడు. ప్రేమ‌క‌థ‌కు ప‌రువు హ‌త్య‌లు, పున‌ర్జ‌న్మ‌లు అనే పాయింట్‌ల‌ను ట‌చ్ చేస్తూ ద‌ర్శ‌కుడు ప్ర‌ణ‌య‌గోదారి మూవీ క‌థ‌ను రాసుకున్నాడు.

రా అండ్ ర‌స్టిక్‌...

ప్ర‌ణ‌య గోదారి క‌థ పాత‌దే. ఈ కాన్సెప్ట్‌తో తెలుగులో ఇదివ‌ర‌కు చాలా సినిమాలొచ్చాయి. తెలిసిన క‌థ‌ను కొత్త‌గా చెప్పేందుకు ద‌ర్శ‌కుడు ప్ర‌య‌త్నించాడు. త‌మిళం, మ‌ల‌యాళ సినిమాల స్టైల్‌లో కంప్లీట్‌గా రా అండ్ ర‌స్టిక్‌గా ఈ మూవీని తెర‌కెక్కించాడు. శీను, గోయ్య మ‌ధ్య ప‌రిచ‌యం, వారి రొమాన్స్‌తో ఫ‌స్ట్ హాఫ్ టైమ్‌పాస్ చేశారు ద‌ర్శ‌కుడు.

వారి ప్రేమ గురించి పెద‌కాపుకు తెలియ‌డం, ఆ త‌ర్వాత ప్రేమ‌జంట‌కు ఎదుర‌య్యే అడ్డంకుల‌ను సెకండాఫ్‌లో చూపించారు. ఈ క్ర‌మంలో వ‌చ్చే ట్విస్ట్‌లు కొన్ని బాగున్నాయి. ముఖ్యంగా సాయికుమార్ పాత్ర‌కు సంబంధించి వ‌చ్చే మ‌లుపు, క్లైమాక్స్‌లో అత‌డి డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. నాయ‌కానాయిక‌ల ల‌వ్‌స్టోరీని డెప్త్‌గా రాసుకుంటే బాగుండేది.రిపీటెడ్ సీన్స్‌తో వారి ప్రేమ‌క‌థ సాగిన ఫీలింగ్ క‌లుగుతుంది.

సాయికుమార్ యాక్టింగ్‌...

పెద‌కాపు పాత్ర‌లో సాయికుమార్ యాక్టింగ్ ఈ సినిమాకు ప్ల‌స్ పాయింట్‌గా నిలిచింది. పాజిటివ్‌గా క‌నిపించే నెగెటివ్ పాత్ర‌లో త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నాడు. అలీ మేన‌ల్లుడు స‌ద‌న్‌కు హీరోగా ఇదే తొలి మూవీ. కామెడీ ప‌రంగా ప‌ర్వాలేద‌నిపించాడు. ఎమోష‌న‌ల్ సీన్స్‌లో అనుభ‌వ‌లేమి క‌నిపించింది. హీరోయిన్‌గా ప్రియాంక ప్ర‌సాద్ యాక్టింగ్ ఓకే. గోదారి అందాల‌ను విజువ‌ల్‌గా చూపించిన తీరు బాగుంది.

రియ‌లిస్టిక్ మూవీ...

ప్ర‌ణ‌య గోదారి ప‌ల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో సాగే రా అండ్ ర‌స్టిక్ ల‌వ్‌స్టోరీ. రియ‌లిస్టిక్ సినిమాల్ని ఇష్ట‌ప‌డే ఆడియెన్స్‌ను మెప్పిస్తుంది.

రేటింగ్‌: 2.75/5

Whats_app_banner