Surya Namaskaralu : సూర్య నమస్కారాలు చేసేప్పుడు ఈ ఆరు తప్పులు అస్సలు చేయకండి
Surya Namaskaram : యోగా అనేది పురాతన కాలం నుంచి వస్తున్న పద్ధతి. యోగా చేయడం వలన అనేక ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. అయితే సూర్య నమస్కారాలు చేసేటప్పుడు కొందరు తప్పులు చేస్తుంటారు. వాటిని చేయకూడదు.
జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం. దేశ విదేశాల్లో యోగా ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించేందుకు ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. యోగా చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకోవాలంటే యోగా సాధన చేస్తేనే తెలుస్తుంది. యోగాభ్యాసం ప్రారంభించిన ఒక నెలలోనే మీరు మీ శరీరంలో చాలా సానుకూల మార్పులను చూస్తారు. మీ మానసిక ఆరోగ్యంలో చాలా మార్పు ఉంటుంది. అందుకే యోగా తెలిసినవాడికి రోగం లేదు అంటారు.
శారీరక, మానసిక భావోద్వేగ శ్రేయస్సుకు యోగా అనేది అత్యంత ముఖ్యమైన వ్యాయామం. ఈ యోగాలో వివిధ ఆసనాలు, ప్రాణయామం లాంటి శ్వాసక్రియ అభ్యాసాలు, వివిధ భంగిమలతో కూడిన సూర్యనమస్కారాలు అలాగే ధ్యాన ముద్రలు ఉంటాయి. అయితే ఇందులో సూర్య నమస్కారం చాలా ప్రత్యేకమైనది. మెుత్తం 12 భంగిమలు చేయాలి. సూర్య నమస్కారాల కారణంగా సంపూర్ణ ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక భావన పెరుగుతుంది.
ముఖ్యంగా సూర్య నమస్కారం చాలా బాగుంటుంది. అయితే సూర్య నమస్కారం చేసేటప్పుడు చాలా మంది తప్పులు చేస్తుంటారు. సూర్య నమస్కారం సమయంలో మీరు పొరపాటు చేస్తే మీరు దాని నుండి పూర్తి ప్రయోజనం పొందలేరు. సూర్య నమస్కారం చేసేటప్పుడు ఈ తప్పులు చేయకండి.
శ్వాస నియమాలు
యోగా భంగిమలు చేయడం ద్వారా మీరు సూర్య నమస్కారాల ప్రయోజనాన్ని పొందలేరు. సూర్య నమస్కార భంగిమలను అభ్యసించేటప్పుడు శ్వాస నియమాలను పాటించాలి. ఎప్పుడు పీల్చాలి, ఎప్పుడు వదలాలి అని తెలుసుకోండి.
హస్త ఉత్తానాసనం
సూర్య నమస్కారంలో ప్రతీ భంగిమ చేయాలి, మీరు హస్త ఉత్తానాసనం కూడా చేయాలి. ఈ ఆసనం వెన్నెముకను బలపరుస్తుంది. దీర్ఘ శ్వాస తీసుకోవడానికి సహాయపడుతుంది. ఈ ఆసనం వేయకపోతే శ్వాస వ్యాయామంలో తేడా వస్తుంది. అలాగే ఈ ఆసనం వేయకపోతే వెన్నెముక, మెడ ఒత్తిడికి గురవుతాయి. ఈ ఆసనాన్ని మిస్ చేయకండి.
చతురంగ దండసనం
సూర్య నమస్కారం చేస్తున్నప్పుడు చతురంగ దండసనాన్ని సరిగ్గా చేయకపోతే అది చేతి, వెన్ను ఎముకలకు హాని కలిగిస్తుంది. సూర్య నమస్కారం ప్రయోజనాన్ని పొందడానికి మీరు చతురంగ దండసనాన్ని సరిగ్గా చేయాలి.
భుజంగాసనం సరిగా చేయాలి
సూర్య నమస్కారం చేస్తున్నప్పుడు మీరు సరైన మార్గంలో భుజంగాసనం చేయాలి. ఛాతీని విస్తరించండి, తలను పైకి ఎత్తండి. చాలా మంది ఈ సమయంలో తలను ఎక్కువ భాగం పైకి ఎత్తరు. కేవలం అలా చేసి వదిలేస్తారు. కానీ ఇది మంచి పద్ధతి కాదు.
ఎక్కువ రౌండ్లు చేయకూడదు
సూర్య నమస్కారం కొత్తగా చేసేవారు.. జోష్‌తో ఎక్కువ రౌండ్లు చేస్తారు. 12 భంగిమలు అయిపోయాక మెుదట్లో మళ్లీ మళ్లీ వాటిని రిపీట్ చేయకూడదు. మీరు మీ రౌండ్లను నెమ్మదిగా పెంచాలి. మొదటి రోజు రెండు రౌండ్లు చేస్తే తర్వాత 3, 4 ఇలా పెంచాలి. సూర్య నమస్కారం 12 భంగిమలను చేస్తున్నప్పుడు శ్వాస వ్యాయామాన్ని సరిగ్గా చేయండి.
12 భంగిమలు
సూర్య నమస్కారంలో 12 భంగిమలు ఉండాలి. ఆ 12 భంగిమలు చేస్తేనే ఒక రౌండ్ పూర్తవుతుంది. ఒక్క భంగిమ తప్పిపోయినా, సూర్య నమస్కారం పూర్తి కాదు. కచ్చతంగా మెుత్తం పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ విషయాలను గుర్తుంచుకోవాలి.