Corn flour: కార్న్‌ఫ్లోర్ చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుందంటే నమ్ముతారా? ఇలా వాడితే సాధ్యమంటున్న సర్వే-how bad cholesterol is reduced with corn flour see what a new survey says ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Corn Flour: కార్న్‌ఫ్లోర్ చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుందంటే నమ్ముతారా? ఇలా వాడితే సాధ్యమంటున్న సర్వే

Corn flour: కార్న్‌ఫ్లోర్ చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుందంటే నమ్ముతారా? ఇలా వాడితే సాధ్యమంటున్న సర్వే

Koutik Pranaya Sree HT Telugu
Sep 07, 2024 09:30 AM IST

Bad cholesterol: శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయులను నియంత్రించడంలో మొక్కజొన్న పిండి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయమనిఇటీవలి అధ్యయనం చెబుతోంది. దీని ప్రకారం ఊహించని ఫలితాలు బయటపడ్డాయి. దాని ప్రభావం ఎలాగుంటుందో తెల్సుకోండి.

మొక్కజొన్న పిండి కొలెస్ట్రాల్ ఎలా తగ్గిస్తుంది?
మొక్కజొన్న పిండి కొలెస్ట్రాల్ ఎలా తగ్గిస్తుంది? (Unsplash)

మీరు ఊహించని ఆశ్చర్యకరమైన పదార్ధం ఒకటి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో గొప్ప ప్రభావం చూపుతుందని తేలింది. అరిజోనా స్టేట్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు నిర్వహించిన తాజా అధ్యయనంలో మొక్కజొన్న పిండి లేదా కార్న్ ఫ్లోర్ చెడు కొలెస్ట్రాల్ స్థాయులను తగ్గించడానికి సహాయపడే రహస్య పదార్ధాలలో ఒకటి అని పేర్కొంది. అధిక కొలెస్ట్రాల్ స్థాయులతో పోరాడుతున్నవారికి మొక్కజొన్న పిండి గేమ్ ఛేంజర్ అని ఈ పరిశోధన చెబుతోంది.

పరిశోధన ఎలా చేశారు?

ఈ అధ్యయనం మూడు వేర్వేరు రకాల మొక్కజొన్న పిండ్లతో చేశారు. మొక్కజొన్న గింజలను ప్రాసెస్ చేయకుండా చేసిన కార్న్ ఫ్లోర్, రిఫైన్డ్ చేసిన కార్న్ ఫ్లోర్, రిఫైన్డ్ కార్న్ ఫ్లోర్‌లో మొక్కజొన్న ఊక కలిపిన మూడు రకాల పిండ్ల మీద ఈ పరిశోధన చేశారు. ఈ అధ్యయనంలో పాల్గొన్నవారిని వారికున్న అధిక కొలెస్ట్రాల్ స్థాయుల ఆధారంగా ఎంపిక చేశారు. వీళ్లను నాలుగు వారాల పాటూ ఈ కార్న్ ఫ్లోర్ రకాలతో చేసిన మఫిన్లు(కేకుల్లాంటివి), బ్రెడ్స్, వివిధ ఆహారాలు తినమని చెప్పారు.

ఫలితాలు ఏంటి?

నాలుగు వారాల తర్వాత వచ్చిన ఫలితాల ప్రకారం ఈ పరిశోధనలో పాల్గొన్న వారి ఎల్డీఎల్ (చెడు కొలెస్ట్రాల్) స్థాయుల్లో చాలా మార్పు వచ్చిందట. చెడు కొలెస్ట్రాల్ స్థాయులు దాదాపు 5 శాతం దాకా తగ్గాయట. కొందరిలో అయితే 13 శాతం కొలెస్ట్రాల్ కూడా తగ్గిందట. అసలే ప్రాసెస్ చేయని కార్న్ ఫ్లోర్, రిఫైన్డ్ కార్న్ ఫ్లోర్ కాస్త ప్రభావం మాత్రమే చూయించగా, మూడో రకం కార్న్ ఫ్లోర్ (బయటి పొట్టు తీయని మొక్కజొన్న పిండి+ రిఫైన్డ్ కార్న్ ఫ్లోర్ మిశ్రమం) వల్ల మాత్రం ఊహించని ప్రభావాలు కనిపించాయట.

ఈ అధ్యయన ఫలితాలు చిన్న ఆహార మార్పుల ద్వారా గుండె ఆరోగ్యాన్ని పెంచడానికి సాదాసీదా మార్గం తెలియజేస్తాయి. సాధారణంగా కొలెస్ట్రాల్ తగ్గించుకోడానికి కఠినమైన ఆహార నియమాలు పాటించాల్సిందే. ఈ అధ్యయనం ప్రకారం మాత్రం ఆరోగ్యం కోసం ఇతర పిండి రకాలకు బదులుగా మొక్కజొన్న ఆధారిత ప్రత్యామ్నాయాలు వాడితేనే మంచి ఫలితాలు వచ్చాయని తేలింది.

మొక్కజొన్న పిండిలో ఏముంది?

మొక్కజొన్న గింజల పైపొర లేదా బ్రాన్‌లో కరగని పీచు ఉంటుంది. ఇది జీర్ణ ఆరోగ్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది. ఇది కొలెస్ట్రాల్ తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి పూర్తిగా రిఫైన్ చేసిన కార్న్ ఫ్లోర్ బదులు పొట్టున్న మొక్కజొన్న గింజల పిండిని వాడటం ఆరోగ్యానికి మంచిది. ఇది గుండె ఆరోగ్యాన్ని పెంచడంలో సాయపడుతుంది.

ఈ పరిశోధన సాధారణ పిండికి బదులుగా మొక్కజొన్న ఆధారిత ప్రత్యామ్నాయం వాడటం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని తెల్పుతోంది. కఠినమైన ఆహార మార్పులు పాటించకుండా కేవలం చిన్న మార్పుతో చెడు కొలెస్ట్రాల్ ఎలా తగ్గించుకోవచ్చనే విషయంలో ఈ అధ్యయనం కొత్త మార్గాన్ని సూచించింది.