Corn cutlet: మొక్కజొన్నతో క్రిస్పీగా కార్న్ కట్లెట్ చేయండి, చల్లని సాయంత్రానికి బెస్ట్ స్నాక్-how to make corn potato cutlet snack recipe in monsoon ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Corn Cutlet: మొక్కజొన్నతో క్రిస్పీగా కార్న్ కట్లెట్ చేయండి, చల్లని సాయంత్రానికి బెస్ట్ స్నాక్

Corn cutlet: మొక్కజొన్నతో క్రిస్పీగా కార్న్ కట్లెట్ చేయండి, చల్లని సాయంత్రానికి బెస్ట్ స్నాక్

Koutik Pranaya Sree HT Telugu
Aug 20, 2024 03:30 PM IST

Corn cutlet: మొక్కజొన్న, బంగాళదుంపలు కలిపి చేసే కార్న్ కట్లెట్ ఒకసారి ప్రయత్నించండి. చాలా రుచిగా ఉండే ఈ కట్లెట్ రుచి మక్క వడల కన్నా బాగుంటుంది. వీటి తయారీ విధానం, కావాల్సిన పదార్థాలేంటో చూసేయండి.

కార్న్ కట్లెట్
కార్న్ కట్లెట్

ఇప్పుడు మొక్కజొన్నల సీజన్. మొక్కజొన్నలతో ఎక్కువగా వడలు చేసుకుంటాం అంతే. కానీ ఊరికే అవే తినడం బోర్ కొడితే ఒకసారి ఇలా కార్న్ కట్లెట్ చేసి చూడండి. బంగాళదుంప ముద్ద కలిపి వీటిని తయారు చేస్తాం. ఒకసారి వీటి తయారీ కోసం కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసేయండి.

కార్న్ కట్‌లెట్ తయారీకి కావాల్సిన పదార్థాలు:

1 కప్పు స్వీట్ కార్న్ లేదా మామూలు మొక్కజొన్న గింజలు

2 ఉడికించిన బంగాళదుంపలు, మీడియం సైజ్

2 చెంచాల క్యారట్ తురుము

2 చెంచాల క్యాప్సికం ముక్కలు

1 ఉల్లిపాయ, సన్నటి ముక్కల తరుగు

గుప్పెడు కొత్తిమీర తరుగు

పావు టీస్పూన్ పసుపు

సగం చెంచా కారం

సగం చెంచా ధనియాల పొడి

సగం చెంచా జీలకర్ర పొడి

సగం చెంచా ఉప్పు

పావు కప్పు బ్రెడ్ క్రంబ్స్

2 చెంచాల కార్న్ ఫ్లోర్

డీప్ ఫ్రైకి సరిపడా నూనె

కార్న్ కట్‌లెట్ తయారీ విధానం:

  1. ముందుగా మొక్కజొన్న గింజల్ని మిక్సీలో వేసి బరకగా పట్టుకోవాలి. కొన్ని గింజల్లా అలాగే కనిపించినా పరవాలేదు. వాటితో కూడా తినేటప్పుడు రుచి బాగుంటుంది. 
  2. ఈ ముద్దను పెద్ద బౌల్ లోకి తీసుకోవాలి.
  3. అందులో క్యారట్ తురుము, క్యాప్సికం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర తరుగు వేసుకుని బాగా కలుపుకోవాలి.
  4. పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు వేసి అన్నీ కలిసేలా కలపాలి.
  5. అందులోనే ఉడికించిన బంగాళదుంపలను బాగా మెదిపి వేసుకోవాలి. చివరగా కార్న్ ఫ్లోర్, బ్రెడ్ క్రంబ్స్ కూడా వేసి గట్టిగా ముద్దలా కలుపుకోవాలి.
  6. ఇప్పుడు చేతులకు నూనె రాసుకుని కొంచెం ముద్ద తీసుకుని కట్లెట్ ఆకారంలో ఒత్తుకోవాలి.
  7. కడాయి పెట్టుకుని నూనె పోసుకుని ఈ కట్లెట్లు వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా రంగు మారేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. క్రిస్పీగా అయిపోతాయి.
  8. వీటిని నూనెలో నుంచి బయటకు తీసుకుంటే చాలు. అదనంగా నూనె వదిలేయడానికి టిష్యూల మీద తీసుకుంటే సరిపోతుంది. వీటిని ఏదైనా చట్నీ లేదా టమాటా సాస్‌తో కలిపి సర్వ్ చేయండి.

Whats_app_banner