Potato Snacks: సాయంత్రం స్నాక్‌గా బంగాళదుంప పునుగులు, క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి
Potato Snacks: ఎప్పుడూ మినప్పిండితోని పునుగులు చేసుకునే వారే ఎక్కువ. ఒకసారి బంగాళదుంపలతో చేసి చూడండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకి నచ్చుతాయి.
Potato Snacks: బంగాళదుంప రెసిపీలను ఇష్టపడే వారి సంఖ్య ఎక్కువే. ముఖ్యంగా పిల్లలకు ఆలుగడ్డలతో చేసిన ఏ ఆహారం అయినా నచ్చుతుంది. అందుకే వారి కోసం ఇక్కడ బంగాళదుంప పునుగుల రెసిపీ ఇచ్చాము. సాయంత్రం పూట వీటిని వేడి వేడిగా తింటే రుచి అదిరిపోతుంది. ఒక్కసారి వీటిని చేసి చూడండి. పిల్లలకే కాదు ఇంట్లోనే పెద్ద వారికి కూడా వీటి టేస్ట్ నచ్చుతుంది. వీటిని చేయడం చాలా సులువు. పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. మినప్పిండితో చేసిన పునుగులలాగే వీటిని కూడా నూనెలో డీప్ ఫ్రై చేసుకోవడమే. ఈ బంగాళదుంప పునుగుల రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
బంగాళదుంప పునుగులు రెసిపీకి కావలసిన పదార్థాలు
బంగాళదుంపలు - నాలుగు
పచ్చిమిర్చి - మూడు
అల్లం - చిన్న ముక్క
జీలకర్ర - ఒక స్పూను
పసుపు - పావు స్పూను
నీళ్లు - తగినన్ని
ఉప్మా రవ్వ - కప్పున్నర
టమోటో - ఒకటి
కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
వంట సోడా - పావు స్పూను
నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడా
కరివేపాకులు - గుప్పెడు
బంగాళదుంప పునుగులు రెసిపీ
1. బంగాళదుంపలను ముందుగా మెత్తగా ఉడకబెట్టుకోవాలి.
2. ఇప్పుడు మిక్సీ జార్లో పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, పసుపు వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
3. అవసరమైతే కాస్త నీళ్లు పోసుకోవాలి.
4. అది మెత్తగా అయ్యాక అందులోనే ఉప్మా రవ్వ, టమోటో ముక్కలు, కొత్తిమీర తరుగు, వంట సోడా, రుచికి సరిపడా, ఉప్పు వేసి బాగా రుబ్బుకోవాలి.
5. ఈ మొత్తం మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేయాలి.
6. ఆ గిన్నెలోనే మెత్తగా ఉడికిన బంగాళదుంపలను చేతితోనే మెదిపి కలిపేయాలి.
7. ఇది గట్టి మిశ్రమంలాగా చేసుకోవాలి. నీళ్లు అవసరమైతే తప్ప వేయకూడదు.
8. అందులోనే కరివేపాకులు, జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి.
9. స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె వేయాలి.
10. నూనె వేడెక్కాక ఈ మిశ్రమాన్ని చిన్నచిన్న పునుగుల్లాగా వేసుకోవాలి.
11. అవి గోల్డెన్ రంగులోకి మారే వరకు వేయించుకోవాలి.
12. వారిని తీసి టిష్యూ పేపర్ పై వేసుకోవాలి. టిష్యూ పేపర్ అదనపు నూనెను పీల్చేస్తుంది.
13. అంతే టేస్టీ క్రంచీ బంగాళదుంప పునుగులు రెడీ అయినట్టే. ఇవి చాలా రుచిగా ఉంటాయి.
14. ముఖ్యంగా పిల్లలకు చాలా నచ్చుతాయి. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది.
సాయంత్రం పూట చల్లని వాతావరణంలో వేడివేడిగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఈ బంగాళదుంప పునుగులు బెస్ట్ స్నాక్స్ అని చెప్పుకోవచ్చు. బంగాళదుంపలను ఉడకబెట్టి వండాము కాబట్టి వాటి గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా వరకు తగ్గుతుంది. కాబట్టి పెద్దలు కూడా దీన్ని తినవచ్చు. టమాటా కెచప్ తో పిల్లలకు ఈ బంగాళదుంప పునుగులను సర్స్ చేసి చూడండి. వారికి చాలా నచ్చుతాయి.