RawMango Rasam: పచ్చిమామిడి అల్లం రసం ఇలా చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది-raw mango ginger rasam is very good for health telugu recipe here ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Rawmango Rasam: పచ్చిమామిడి అల్లం రసం ఇలా చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది

RawMango Rasam: పచ్చిమామిడి అల్లం రసం ఇలా చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది

Haritha Chappa HT Telugu
Jun 20, 2024 11:50 AM IST

RawMango Rasam: వేసవిలో పచ్చి మామిడికాయలు దొరుకుతాయి. వాటితో ఒకసారి చారు పెట్టి చూడండి. ఇది టేస్టీగా ఉండటమే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.

పచ్చి మామిడి రసం
పచ్చి మామిడి రసం

RawMango Rasam: అల్లం చారు ఎంతోమంది తినే ఉంటారు. ఇది ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. పచ్చిమామిడి తురుమును కూడా అల్లం చారులో వేసి చేస్తే అదిరిపోతుంది. ముఖ్యంగా వేసవిలోనే పచ్చిమామిడికాయలు దొరుకుతాయి. వాటితో చేసే రసం తినడం వల్ల ఆరోగ్యానికి రెట్టింపు పోషకాలు అందుతాయి. ఈ రసాన్ని చిన్న మంట మీద ఎక్కువ సేపు మరిగించి చేయాల్సి వస్తుంది. వేడి వేడి అన్నంలో ఈ రసం కలుపుకొని మీకు నచ్చిన కర్రీని పక్కన జతగా తింటే రుచి అదిరిపోతుంది. దీని రెసిపీ ఎలాగో ఇప్పుడు తెలుసుకోండి.

పచ్చిమామిడి అల్లం చారు రెసిపీకి కావలసిన పదార్థాలు

అల్లం తరుగు - ఒక స్పూను

మామిడి తురుము - అయిదు స్పూన్లు

ఎండుమిర్చి - పది

జీలకర్ర - ఒక స్పూను

ధనియాలు - రెండు స్పూన్లు

మిరియాలు - ఒక స్పూను

చింత పండు - చిన్న నిమ్మకాయ సైజులో

ఉప్పు - రుచికి సరిపడా

కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు

టమాటోలు - మూడు

బెల్లం తురుము - ఒక స్పూన్

పసుపు - పావు స్పూను

పచ్చిమిర్చి - రెండు

నీళ్లు - సరిపడినంత

ఆవాలు - ఒక స్పూన్

కరివేపాకులు - గుప్పెడు

పచ్చికొబ్బరి తురుము - మూడు స్పూన్లు

ఇంగువ - చిటికెడు

వెల్లుల్లి రెబ్బలు - ఐదు

పచ్చిమామిడి అల్లం రసం రెసిపీ

1. అల్లాన్ని సన్నగా తరిగి మిక్సీలో వేయాలి.

2. అల్లంతో పాటు ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, మిరియాలు, పచ్చి మామిడి తురుము కూడా వేసి మెత్తని పేస్టులా చేసుకోవాలి.

3. ఇప్పుడు ఒక గిన్నెలో చింతపండును వేసి ఒక గ్లాసు నీళ్లు వేసి నానబెట్టాలి.

4. ఇప్పుడు లోతైన కళాయిలో కొత్తిమీర తరుగును, టమోటా ప్యూరీని వేసి ఉంచాలి.

5. అందులోనే చింతపండు పులుసును కూడా వేసి బాగా కలపాలి.

6. ఉప్పు, పచ్చిమిర్చి, ముందుగా చేసుకున్న అల్లం మామిడి పేస్టు, నీళ్లు వేసి స్టవ్ మీద పెట్టి పావుగంట సేపు మరిగించాలి.

7. చారు మరుగుతున్నప్పుడు బెల్లం తురుమును వేసుకోవాలి.

8. అలాగే కొత్తిమీర తురుము కూడా మళ్లీ చల్లుకోవాలి.

9. ఇప్పుడు మరొక స్టవ్ మీద కళాయి పెట్టి తాలింపు కోసం నూనె వేయాలి.

10. నూనెలో కొబ్బరి తురుము, ఎండుమిర్చి, వెల్లుల్లి, ఇంగువ, కరివేపాకులు, జీలకర్ర, ఆవాలు వేసి వేయించి తీసి చారులో వేసుకోవాలి.

11. అంతే టేస్టీ పచ్చి మామిడి అల్లం రసం రెడీ అయినట్టే. ఇది అద్భుతంగా ఉంటుంది. పుల్లమామిడిని తీసుకుంటే చారు కాస్త పులుపుగా అనిపిస్తుంది. అల్లాన్ని ఎక్కువ వేసుకోకూడదు. అల్లం తురుమును ఒకటిన్నర స్పూను వేస్తే సరిపోతుంది.

పచ్చి మామిడికాయతో చేసే రెసిపీలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. పచ్చి మామిడి సీజనల్ గా దొరికేవి, కాబట్టి ఆయా సీజన్లలో కచ్చితంగా తినాలి. వేసవి దాటితే పచ్చి మామిడికాయ దొరకడం కష్టంగా మారుతుంది. ఇక అల్లం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. అల్లాన్ని ఎక్కువగా వేసుకుంటే చారు రుచి మారిపోతుంది. కాబట్టి అల్లం ఒక స్పూను లేదా ఒకటిన్నర స్పూను తురుముగా మాత్రమే వేయాలి. ఇది చాలా రుచిగా ఉంటుంది. ఈ చారుతో అన్నం తింటూ చికెన్ ఫ్రై వంటి కర్రీలు పక్కన పెట్టుకుంటే కాంపిటీషన్ అదిరిపోతుంది.

Whats_app_banner