Fake Black Pepper: మీరు వాడుతున్న నల్ల మిరియాలు మంచివో, నకిలీవో... ఇలా తెలుసుకోండి-fake black pepper know whether the black pepper you are using is good or fake ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Fake Black Pepper: మీరు వాడుతున్న నల్ల మిరియాలు మంచివో, నకిలీవో... ఇలా తెలుసుకోండి

Fake Black Pepper: మీరు వాడుతున్న నల్ల మిరియాలు మంచివో, నకిలీవో... ఇలా తెలుసుకోండి

Haritha Chappa HT Telugu
Feb 21, 2024 02:00 PM IST

Fake Black Pepper: నల్ల మిరియాలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. రోజూ ఎన్నో కొన్ని నల్లమిరియాలను ఆహారంలో భాగం చేసుకోమని చెబుతారు పోషకాహార నిపుణులు. అది నిజమైనవో, నకిలీవో ఇంట్లోనే సులువుగా తెలుసుకోవచ్చు.

ఫేక్ మిరియాలు ఇలా కనిపెట్టండి
ఫేక్ మిరియాలు ఇలా కనిపెట్టండి (pexels)

Fake Black Pepper: బ్లాక్ పెప్పర్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వినియోగిస్తున్న సుగంధ ద్రవ్యాలలో ఒకటి. ఈ నల్ల మిరియాలను జోడించడం వల్ల ఆహారానికి రుచి పెరుగుతుంది. ఈ నల్ల మిరియాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఒక వ్యక్తి రోజుకు మూడు నల్ల మిరియాలు తింటే చాలు, ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఇప్పుడు ప్రతి ఆహారము కల్తీ చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. తమ వ్యాపారం కోసం నకిలీ ఆహారాలను అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు.

నకిలీవో కాదో ఇలా తెలుసుకోండి

మీరు వాడుతున్న నల్ల మిరియాలు మంచివో, నకిలీవో ఇంట్లోనే సులభంగా చెక్ చేసుకోవచ్చు. నల్ల మిరియాలను ఒక టేబుల్ పై పెట్టండి. వాటిని వేలితో బలంగా నొక్కండి. అవి నొక్కగానే విరిగిపోతే కల్తీవని అర్థం. నకిలీ నల్లమిరియాలు చేత్తో నొక్కితే చాలు సులభంగా విరిగిపోతాయి. అవే మంచివైతే త్వరగా విరిగిపోవు. చాలా గట్టిగా ఉంటాయి. ఈ విధంగా మీరు వినియోగించే మిరియాలు కల్తీవో, నిజమైనవో తెలుసుకోవచ్చు.

మిరియాలను కొంటున్నప్పుడే దాని రూపాన్ని, వాసనను, రుచిని బట్టి అవి మంచివో కాదో అంచనా వేయాలి. నల్ల మిరియాలపై ఎక్కువ ముడతలు ఉంటే అవి మంచి మిరియాలు కాదు అని అర్థం. అలాగే వాటి రంగు ముదురు బ్రౌన్ రంగు నుంచి నలుపు రంగులో ఉండాలి. ఇది ఘాటైన వాసనను వేయాలి. నిజమైన మిరియాలు మంచి ఘాటైన వాసనను వేస్తాయి. స్పైసీ ఫ్లేవర్ ను ఇస్తాయి.

నల్ల మిరియాలు ఎందుకు వాడాలి?

మిరియాలు ప్రతిరోజు ఆహారంలో వినియోగించడం వల్ల మన శరీరానికి అవసరమైన మాంగనీస్, విటమిన్ కె, ఐరన్, డైటరీ ఫైబర్ వంటివి అందుతాయి. అలాగే ఈ మసాలా దినుసుల్లో పైపెరిన్ వంటి బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి. ఇది మంచి యాంటీ ఆక్సిడెంట్. అలాగే యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలనూ కలిగి ఉంటుంది. ఆయుర్వేద ఔషధాలలో వీటిని వినియోగిస్తారు. ప్రతిరోజూ నల్ల మిరియాలు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే జీర్ణశక్తి పెరిగి, ఆహారం అరగకపోవడం వంటి సమస్యలు రావు. శరీరం పోషకాలను పూర్తిగా శోషించుకునేలా చేస్తుంది.

బ్లాక్ పెప్పర్ ను శాస్త్రీయంగా పైపర్ నిగ్రమ్ అని పిలుస్తారు. ఇది పైప్రేసి కుటుంబానికి చెందిన ఒక తీగ మొక్క. చెట్ల మీదకి ఈ తీగ పాకుతుంది. పచ్చగా ఉండే మిరియాలను సేకరించి ఎండలో ఎండబెడతారు. అప్పుడు అది నల్లగా ఇలా ముడతలు పడేలా మారుతుంది. శక్తివంతమైన ఔషధ లక్షణాలు దీనిలో పుష్కలంగా ఉంటాయి.

నల్ల మిరియాలు తినడం వల్ల జీర్ణ ఎంజైమ్ లు అధికంగా ఉత్పత్తి అవుతాయి. మిరియాలు తినడం వల్ల పొట్ట ఉబ్బరం, గ్యాస్, మలబద్దకం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. మిరియాలను పొడి రూపంలో మార్చుకుని వాడితే సులువుగా ఉంటుంది. ప్రతి కూరలో మిరియాల పొడిని వేసుకోవడం అలవాటు చేసుకోండి. లేదా ఉడుకుతున్న అన్నంలో వేసినా చాలు. ఎలాగోలా మిరియాలను తింటే చాలు.

WhatsApp channel

టాపిక్