Mango and Acne: మామిడి పండ్లు తినడం వల్ల మొటిమల సమస్య మరింతగా పెరుగుతుందా?-does eating mangoes make acne worse ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Mango And Acne: మామిడి పండ్లు తినడం వల్ల మొటిమల సమస్య మరింతగా పెరుగుతుందా?

Mango and Acne: మామిడి పండ్లు తినడం వల్ల మొటిమల సమస్య మరింతగా పెరుగుతుందా?

Haritha Chappa HT Telugu
Jun 15, 2024 07:00 AM IST

Mango and Acne: వేసవి మామిడిపండ్లను ఇష్టంగా తినేవారు ఎంతోమంది. అయితే కొంతమందిలో మామిడి పండ్లు తినడం వల్ల మొటిమల సమస్యలు అధికంగా అవుతూ ఉంటాయి. ఇది ఎంతవరకు నిజమో తెలుసుకుందాం.

మామిడి పండు సైడ్ ఎఫెక్టులు
మామిడి పండు సైడ్ ఎఫెక్టులు (Unsplash)

Mango and Acne: వేసవి వచ్చిందంటే తీయని మామిడి పండ్లను తినాలనిపిస్తుంది. మామిడిపండ్లు ఎక్కువగా తింటే వేడి చేస్తాయి. శరీరంలో ఉష్ణోగ్రతను పెంచేస్తాయి. కాబట్టి వాటిని మితంగానే తినాలి. కొంతమందిలో మామిడి పండ్లు తిన్నాక మొటిమలు అధికం కావడం చూస్తూ ఉంటాము. మామిడి పండ్లకు, మొటిమలకు మధ్య సంబంధాన్ని వివరిస్తున్నారు వైద్యులు.

మొటిమలు రావడానికి అనేక కారణాలు ఉంటాయి. అవి వారసత్వంగా వచ్చే అవకాశం ఉంది. అలాగే చర్మ సంరక్షణ చేయకపోవడం వల్ల రావచ్చు. హార్మోన్లలో మార్పులు, కొన్ని రకాల ఆహారాల వల్ల కూడా మొటిమలు అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. అయితే కొన్ని రకాల ఆహారాలు మొటిమలు సమస్యను తీవ్రతరం చేస్తాయన్నది నిజమే. వాటిల్లో మామిడిపండు కూడా ఉంది. మామిడిపండును అధికంగా తినడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీన్నే మనం వేడి చేయడం అంటాము. అలా చేసినప్పుడు మొటిమలు ఎక్కువగా వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. మామిడిపండు శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. జీర్ణవ్యవస్థ, పేగుల ఆరోగ్యంపై ఇది ప్రభావం చూపిస్తుంది.

మామిడిపండు తినడం వల్లే మొటిమలు వస్తాయని కచ్చితంగా చెప్పలేము. కానీ ఇప్పటికే మొటిమలు ఉన్నవారు మామిడిపండును తినడం వల్ల అవి కాస్త పెరిగే అవకాశం ఉంది. ఇది కూడా ఒక ప్రేరకంగా పనిచేయవచ్చు. కానీ మామిడిపండు తిన్న వారందరికీ మొటిమలు వస్తాయని ఎక్కడా శాస్త్రీయంగా నిరూపణ లేదు. మామిడిపండు వేడి చేసే ఆహారం కాబట్టే ఇలా మొటిమలు తీవ్రంగా మారవచ్.చు

ఇలా తినండి

మామిడిపండును తినే ముందు నీటిలో ఓ గంట పాటు నానబెట్టండి. ఇలా చేయడం వల్ల మామిడిపండులో వేడి చేసే గుణం బయటికి పోతుంది. మామిడి పండులో అదనపు ఫైటిక్ యాసిడ్ ఉంటుంది. దీనికే వేడిని ఉత్పత్తి చేసే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇలా నీటిలో నానబెట్టడం వల్ల ఫైటిక్ యాసిడ్ కంటెంట్ తగ్గుతుంది. ఆ మామిడిపండును తినడం వల్ల శరీరం వేడెక్కదు. జీర్ణం కూడా సులభంగా అవుతుంది.

గంటపాటు మామిడిపండు నీటిలో నానబెడితే ధర్మోజనిక్ లక్షణాలు తగ్గుతాయి. దీని వల్ల శరీరంలో వేడి ఉత్పత్తి కాదు. ఫైబర్, కార్బోహైడ్రేట్లను కూడా కాస్త తగ్గించడానికి సహాయపడుతుంది. అయితే నీటిలో నానబెట్టడం వల్ల అందులోని కొన్ని పోషక పదార్థాలు తగ్గుతూ ఉంటాయి.

మామిడితో పిత్త దోషం

ఆయుర్వేదం చెబుతున్న ప్రకారం మామిడిపండును తినడం వల్ల పిత్త దోషం పెరిగే అవకాశం ఉంది. ఇది శరీరంలో అసమతుల్యత, జీర్ణ సమస్యలు, చర్మ సమస్యలకు కారణం అవుతుంది. కాబట్టి మొటిమల సమస్యలతో బాధపడుతున్న వారు మామిడి పండును తక్కువగా తింటే మంచిది. అలా అని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. మామిడికాయను తినడానికి ముందు చల్లని నీటిలో ఒక గంట నానబెట్టి అప్పుడు హ్యాపీగా తినండి. ఇలాంటి వేడి చేయదు.

మామిడిపండును ఇలా నీటిలో నానబెట్టడం వల్ల జీడి కూడా తగ్గుతుంది. మామిడి నుండి వచ్చే తెల్లటి పాలపదార్థం వంటిది కూడా తగ్గే అవకాశం ఉంది. ఇది ఎలర్జీలకు కారణం అవుతాయి. మామిడి మొటిమల సమస్యను పెంచడానికి కారణం అందులో ఉండే చక్కెర కూడా. మామిడిలో చక్కెర శాతం అధికంగా ఉంటుంది. అందుకే కొన్నిసార్లు మొటిమలు పెరుగుతూ ఉంటాయి. మామిడిపండును తినాల్సి వస్తే తొక్కను తీసి తినడం మంచిది. మొటిమలు ఉన్నవారు ఇలా తొక్కని తీసి తినడం వల్ల వారికి తొక్కపై ఉన్న ఎలాంటి ఎలెర్జీ కారకాలు మొటిమలకు చేరకుండా ఉంటాయి. అయితే సహజంగా పండిన మామిడి పండ్లను మాత్రమే తినడం మంచిది. లేకుంటే మొటిమలు సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది. మీరు మామిడికాయ తిన్న తర్వాత మొటిమలు తీవ్రంగా మారుతున్నట్లయితే ఒకసారి వైద్యులను సంప్రదించడం కూడా ఉత్తమం.

Whats_app_banner