Mango Kalakand: మామిడిపండుతో ఇలా కలాకండ్ స్వీట్ చేసి చూడండి, నోట్లో పెడితే కరిగిపోతుంది
Mango Kalakand: మామిడిపండ్ల సీజన్ ముగిసిపోక ముందే దానితో అనేక రెసిపీలను వండుకోండి. ఇక్కడ మేము మ్యాంగో కలాకండ్ రెసిపీ ఇచ్చాను. ఇది చాలా సులువు.
Mango Kalakand: మామిడిపండు వాసనకే నోరూరిపోతుంది. దీంతో స్వీట్ రెసిపీ చేస్తే టేస్ట్ మామూలుగా ఉండదు. మామిడిపండ్లతో కలాకండ్ స్వీట్ ను చేయవచ్చు. దీన్ని నోట్లో పెడితే కరిగిపోయేలా ఉంటుంది. చూస్తేనే నోరూరిపోతుంది. పిల్లలకి ఇది నచ్చడం ఖాయం. దీనిలో పంచదారను వాడాల్సిన అవసరం కూడా లేదు. దీని రుచి ఒక్కసారి అలవాటు పడితే మీకు మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది.
మ్యాంగో కలాకండ్ రెసిపీకి కావలసిన పదార్థాలు
మామిడి పండ్లు - ఒకటి
పనీర్ తురుము - ముప్పావు కప్పు
కోవా - ముప్పావు కప్పు
కండెన్స్‌డ్ మిల్క్ - పావు కప్పు
తరిగిన పిస్తాలు - రెండు స్పూన్లు
కుంకుమపువ్వు రేకులు - నాలుగు
పాలు - ఒక స్పూను
మ్యాంగో కలాకండ్ రెసిపీ
1. ఒక స్పూను పాలను ఒక చిన్న గిన్నెలో వేసి వాటిలో కుంకుమ పువ్వులు వేసి నానబెట్టాలి.
2. ఇప్పుడు కళాయిని స్టవ్ మీద పెట్టి రెండు స్పూన్ల నెయ్యిని వేయాలి.
3. అందులోనే కోవాను, తురిమిన పనీర్‌ను వేసి చిన్న మంట మీద ఉడికించాలి.
4. రెండు మూడు నిమిషాలు ఉడికించాక కంటెంట్ మిల్క్‌ను వేసి కలుపుకోవాలి.
5. అలాగే పాలల్లో నానబెట్టిన కుంకుమ పువ్వులను పాలతో సహా వేసి రెండు మూడు నిమిషాలు పాటు ఉడికించుకోవాలి.
6. ఈ మిశ్రమం అంతా హల్వాలాగా దగ్గరగా వస్తుంది. అప్పుడు స్టవ్ కట్టేయాలి.
7. ఇప్పుడు మామిడిపండు నుంచి గుజ్జును తీసి ఒకసారి మిక్సీలో మెత్తగా చేసుకోవాలి.
8. దాన్ని కళాయిలోని మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి.
9. అలాగే పిస్తా తరుగును కూడా వేసి బాగా కలపాలి.
10. ఇప్పుడు ఒక ప్లేటుకి నెయ్యిని రాసి ఈ మిశ్రమాన్ని ఆ ప్లేట్లో సమానంగా పరచాలి.
11. పైన పిస్తా పప్పులు, గులాబీ రేకులు వంటివి చల్లుకొని వదిలేయాలి.
12. ఓ రెండు మూడు గంటల తర్వాత బాగా వేడి చల్లారాక వాటిని బర్ఫీల్లా కట్ చేసుకోవాలి.
13. అంతే టేస్టీ మ్యాంగో కలాకండ్ రెడీ అయినట్టే. దీన్ని నోట్లో పెడితేనే కరిగిపోతుంది. వాసన ఘుమఘుమలాడిపోతుంది.
ఈ స్వీట్లో పంచదారను వేయలేదు. ఆ మామిడిపండులో ఉన్న తీయదనం, కోవాలో ఉన్న తియ్యదనం ఈ స్వీట్‌కు సరిపోతుంది. కేవలం పావుగంటలో ఈ స్వీట్ రెడీ అయిపోతుంది. ఒక్కసారి చేశారంటే మీ ఇంటిల్లిపాదికి నచ్చడం ఖాయం. నోరూరే ఈ స్వీట్ ను ఒకసారి వండి చూడండి.