Cherakurasam Paramannam: పంచదారకు బదులు చెరుకు రసంతో పరమాన్నాన్ని వండి చూడండి, ఎంతో ఆరోగ్యం-cheraku rasam paramannam recipe in telugu know how to make this sweet recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Cherakurasam Paramannam: పంచదారకు బదులు చెరుకు రసంతో పరమాన్నాన్ని వండి చూడండి, ఎంతో ఆరోగ్యం

Cherakurasam Paramannam: పంచదారకు బదులు చెరుకు రసంతో పరమాన్నాన్ని వండి చూడండి, ఎంతో ఆరోగ్యం

Haritha Chappa HT Telugu
May 16, 2024 03:30 PM IST

Cherakurasam Paramannam: పండగ వస్తే ఇంట్లో పరమాన్నం కచ్చితంగా ఉండాల్సిందే. ఎప్పుడూ పంచదారతోనో, బెల్లంతోనో కాకుండా ఒకసారి చెరుకు రసంతో వండి చూడండి.

చెరుకురసం పాయసాన్నం రెసిపీ
చెరుకురసం పాయసాన్నం రెసిపీ (Youtube)

Cherakurasam Paramannam: పరమాన్నం పేరు చెబితేనే ఎంతోమందికి నోరూరిపోతుంది. ఈ స్వీట్ రెసిపీ ఎప్పుడూ పంచదార లేదా బెల్లంతోనే చేస్తారు. ఈ రెండింటినీ పక్కన పెట్టి ఒకసారి చెరుకు రసంతో చేసి చూడండి. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది కూడా. పూర్వకాలంలో పంచదార, బెల్లం లేనప్పుడు చెరుకు రసంతోనే పరమాన్నాన్ని వండే వారని చెప్పుకుంటారు. దీని వండడం చాలా సులువు.

చెరుకు రసంతో పరమాన్నం రెసిపీకి కావలసిన పదార్థాలు

చెరుకు రసం - అర లీటరు

బియ్యం - ఒక కప్పు

దాల్చిన చెక్క - చిన్న ముక్క

నెయ్యి - రెండు స్పూన్లు

జీడిపప్పు - గుప్పెడు

ఎండు ద్రాక్ష - గుప్పెడు

కొబ్బరి తురుము - రెండు స్పూన్లు

యాలకుల పొడి - అర స్పూను

చెరుకు రసం పరమాన్నం రెసిపీ

1. బియ్యాన్ని శుభ్రంగా కడిగి గంటపాటు నానబెట్టాలి.

2. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాత్రను పెట్టి చెరుకు రసాన్ని వేయాలి.

3. ఆ చెరుకు రసంలోనే దాల్చిన చెక్క ముక్క, యాలకుల పొడి వేసి చిన్న మంట మీద ఉడికించాలి.

4. దానిపైన తేటలా వస్తుంది. దాన్ని తీసి పక్కన పెట్టాలి.

5. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసి చిన్న మంట మీద ఉడికించాలి.

6. బియ్యం మెత్తగా ఉడికే వరకు ఉంచాలి. ఆ తర్వాత స్టవ్ కట్టేయాలి.

7. ఇప్పుడు నెయ్యిలో జీడిపప్పు, ఎండు ద్రాక్షలు, కొబ్బరి తురుము వేసి వేయించి పరమాన్నంలో కలుపుకోవాలి.

8. అంతే తీయని చెరుకు రసం పరమాన్నం రెడీ అయినట్టే.

9. దీనిలో సహజసిద్ధంగా తీసిన చెరుకు రసాన్ని వినియోగించాం.

10. కాబట్టి ఆరోగ్యానికి మంచిదే ప్రాసెస్ చేసిన పంచదారక బదులు ఇలా చెరుకు రసాన్ని వాడుకోవడం మంచిది.

11. చెరుకు రసం కాకపోతే బెల్లాన్ని వినియోగించినా మంచిదే.

12. కానీ పంచదారను కచ్చితంగా పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది.

పంచదారతో పోలిస్తే చెరుకు రసం మనకు ఎంతో ఆరోగ్యాన్ని అందిస్తుంది. చెరుకు రసం చక్కని ఔషధంలా పనిచేస్తుంది. కిడ్నీలో రాళ్లు కరిగించే శక్తి దీనికి ఉంది. చెరుకు రసం తాగడం వల్ల కిడ్నీలో ఉన్న రాళ్లు విచ్ఛిన్నం అయిపోయి మూత్రంతో పాటు బయటికి వెళ్లిపోతాయి. రోగనిరోధక శక్తిని పెంచే సామర్థ్యం చెరుకు రసంలో ఉంది. ఎందుకంటే దీనిలో విటమిన్ సి, ఇనుము, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ అధికంగా ఉంటాయి. అలాగే మూత్ర సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారు చెరుకు రసాన్ని తాగడం మంచిది. పచ్చ కామెర్లు, దంత సమస్యలు రాకుండా చెరుకు రసం కాపాడుతుంది.

టాపిక్