Korra biyyam Sweet: కొర్ర బియ్యంతో టేస్టీ చక్కెర పొంగలి, రుచికి రుచి పైగా ఎంతో ఆరోగ్యం
Korra biyyam Sweet: చక్కెర పొంగలి చాలా రుచిగా ఉంటుంది. దీన్ని తెల్ల అన్నంతో కాకుండా కొర్ర బియ్యంతో చేసి చూడండి. మరింత ఆరోగ్యంగా మారుతుంది.
Korra biyyam Sweet: పండగలు, వేడుకలు వచ్చినప్పుడు ఏదైనా స్వీట్ చేయడం తెలుగిళ్లల్లో సాధారణం. ఇక్కడ మేము కొర్ర బియ్యంతో చేసే స్వీట్ పాయసం రెసిపీ ఇచ్చాము. సాధారణ అన్నం కన్నా కొర్ర బియ్యంతో చేసిన పాయసం ఆరోగ్యానికి ఎంతో మేలు. పైగా ఇందులో పంచదారను వినియోగించలేదు. కాబట్టి దీన్ని మధుమేహులు కూడా తినవచ్చు. ఈ కొర్ర బియ్యం చక్కెర పొంగలి రెసిపీ చాలా సులువు. ఒక్కసారి చేశారంటే మీరే తరచూ సులువుగా చేసుకోగలరు. కొర్ర బియ్యంతో పాటు దీనిలో పెసరపప్పును కూడా వాడతాము. అలాగే డ్రై ఫ్రూట్స్, యాలకులపొడి వంటివి వాడతాం కాబట్టి ఇవన్నీ కూడా ఆరోగ్యానికి మేలు చేసేవే. అన్నింట్లోకి కొర్ర బియ్యం చేసే మేలు ఇంతా అంతా కాదు. ఈ రెసిపీ ప్రత్యేకంగా మధుమేహుల కోసం.
కొర్ర బియ్యంతో చక్కెర పొంగలి రెసిపీకి కావాల్సిన పదార్థాలు
కొర్ర బియ్యం - అరకప్పు
పెసరపప్పు - అరకప్పు
మిల్క్ మెయిడ్ - 200 గ్రాములు
యాలకుల పొడి - అర స్పూను
డ్రై ఫ్రూట్స్ - పావు కప్పు
నెయ్యి - ఐదు స్పూన్లు
కొర్ర బియ్యం చక్కెర పొంగలి రెసిపీ
1. కొర్రబియ్యాన్ని, పెసరపప్పును శుభ్రంగా కడిగి ముందే నానబెట్టుకోవాలి. కనీసం కొర్ర బియ్యం నాలుగైదు గంటలు నానబెట్టుకుంటేనే ఇది మెత్తగా ఉడుకుతుంది.
2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేయాలి.
3. ఆ నెయ్యిలోనే డ్రై ఫ్రూట్స్ వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.
4. ఇప్పుడు అదే నెయ్యిలో ముందుగా నానబెట్టిన పెసరపప్పును నీళ్లు లేకుండా వేయాలి. దాన్ని వేయించుకున్నాక కాస్త నీరుపేసి ఉడికించుకోవాలి.
5. పెసరపప్పు 60 శాతం ఉడికి పోయాక ముందుగా నానబెట్టుకున్న కొర్రబియ్యాన్ని కూడా వేసి కలుపుకోవాలి.
6. ఆ రెండూ ఉడకడానికి సరిపడా నీటిని వేసి అరగంటసేపు ఉడికించాలి.
7. అవి మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవడం చాలా అవసరం.
8. ఆ తరువాత యాలకుల పొడి, ఒక స్పూన్ నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి.
9. ఆ తర్వాత మిల్క్ మెయిడ్ వేయాలి.
10. మిల్క్ మెయిడ్ వాడడం ఇష్టం లేనివారు బెల్లాన్ని వేసుకున్నా మంచిదే.
11. కానీ ప్రాసెస్ చేసిన పంచదారను వాడకపోవడమే మంచిది.
12. ఈ మొత్తం మిశ్రమాన్ని చక్కెర పొంగలిలా దగ్గరగా అయ్యేవరకు స్టవ్ మీదే ఉంచి తర్వాత స్టవ్ కట్టేయాలి.
13. ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ను పైన చల్లుకోవాలి.
14. అంతే టేస్టీ కొర్ర బియ్యం చక్కెర పొంగలి రెడీ అయినట్టే.
15. దీన్ని వండుతున్నప్పుడే సువాసన వచ్చేస్తుంది. తినేయాలన్న కోరిక పుడుతుంది. ఇది ఆరోగ్యానికి కూడా మంచిది. కాబట్టి అప్పుడప్పుడు చేసి పిల్లలకు తినిపించండి.
కొర్ర బియ్యంలో మన శరీరానికి కావలసిన పోషకాలు నిండుగా ఉంటాయి. ముఖ్యంగా ప్రోటీన్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్ ఉంటాయి. అలాగే అత్యధికంగా పీచు కూడా ఉంటుంది. కొర్ర బియ్యం వండడానికి ఎక్కువ సమయం పడుతుంది. అందుకే ఎక్కువమంది వీటిని వండడానికి ఇష్టపడరు. ముందుగానే నానబెట్టుకుంటే త్వరగా వండేసుకోవచ్చు. కొర్ర బియ్యం సన్నగా ఉండవు. లావుగా ఉంటాయి... కాస్త తింటే చాలు పొట్ట నిండిన ఫీలింగ్ వస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి కొర్ర బియ్యం ఉత్తమ ఎంపిక. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ప్రతిరోజూ కొర్ర బియ్యాన్ని తినేవారు బరువు తగ్గుతారు. అలాగే మధుమేహం, అధిక రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులు కూడా అదుపులో ఉంటాయి. వారానికి కనీసం రెండు నుంచి మూడుసార్లు కొర్ర బియ్యం తినేందుకు ప్రయత్నించండి. మధుమేహలు తినాల్సిన వాటిలో కొర్ర బియ్యం కూడా ఒకటి. తెల్ల అన్నానికి బదులుగా కొర్ర బియ్యం తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలో అదుపులో ఉంటాయి.