Potato Facemask: చర్మానికి ఇలా బంగాళదుంపలను అప్లై చేస్తే మొటిమలు, మచ్చలు తగ్గడం ఖాయం
Potato Facemask: బంగాళా దుంపలను కేవలం ఆహారానికే పరిమితం చేస్తారు. నిజానికి ఇది అందాన్ని కూడా పెంచుతుంది. బంగాళదుంపలతో అందాన్ని ఎలా పెంచుకోవాలో తెలుసుకోండి.
Potato Facemask: ప్రకృతిలో ఉండే ఎన్నో కూరగాయలు మన చర్మకాంతిని పెంచుతాయి. అలాంటి వాటిలో ఆలుగడ్డలు ఒకటి. ఈ బంగాళదుంపలతో కేవలం కూరలు, వేపుళ్ళు, బిర్యానీలు మాత్రమే కాదు ఫేస్ మాస్కులు తయారు చేసుకోవచ్చు. బంగాళదుంపలతో చేసే ఫేస్ మాస్క్ వల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది. ముఖాన్ని మెరిసేలా చేయడంలో బంగాళదుంపలు ముందుంటాయి. వీటి ధర తక్కువే కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఫేస్ మాస్కులను ప్రయత్నించవచ్చు. ముఖంపై ఉండే మచ్చలు, మొటిమలను తగ్గించే శక్తి కూడా బంగాళదుంపలకి ఉంది.
ఇలా ఫేస్ మాస్క్ చేసుకోండి
బంగాళదుంపలను చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి పేస్టులా చేసుకోవాలి. ఆ పేస్టును ఒక క్లాత్ లో వేసి రౌండ్ గా చుట్టి గట్టిగా పిండాలి. ఇలా పిండితే రసం వస్తుంది. ఆ రసాన్ని తీసి ముఖానికి మెడకు పట్టించాలి. ఒక ఐదు నిమిషాల పాటు వదిలేస్తే అది ఆరిపోతుంది. అలా ఆరిపోయాక ముఖాన్ని నీటితో కడుక్కొని చూడండి. మంచి కాంతివంతంగా ఉంటుంది.
మొటిమలు, మచ్చలతో బాధపడేవారు బంగాళదుంపలతో ఓ చిట్కాను పాటించండి. ఇది చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. బంగాళదుంప రసాన్ని తీసి అందులో కొన్ని చుక్కల గ్లిజరిన్ వెయ్యండి. అలాగే ఒక స్పూన్ పాలను కలపండి. ఈ మొత్తం మిశ్రమాన్ని బాగా కలిపి దూదిలో ముంచి ఆ దూదితో ముఖాన్ని, మెడకు రాసుకోండి. ఓ పావుగంట సేపు అలా వదిలేయండి. వారానికి రెండు నుంచి మూడుసార్లు ఇలా చేయడం వల్ల ముఖంపై ఉన్న మచ్చలు, మొటిమలు త్వరగా తగ్గుతాయి.
బంగాళాదుంపల రసంలో తేనె, శెనగపిండి, నిమ్మరసం వేసి ముఖానికి పట్టించినా కూడా మచ్చలు, మొటిమలు త్వరగానే తొలగిపోతాయి. బంగాళదుంప రసాన్ని వారానికి కచ్చితంగా రెండుసార్లు ముఖానికి రాసుకొని చూడండి. మంచి ఫలితం మీరు గుర్తిస్తారు.