Vitiligo Causes: బొల్లి మచ్చలు ఎందుకు వస్తాయి? ఎవరికి వస్తాయి? వీటికి చికిత్స లేదా?-why does vitiligo occur who gets it is there no cure for vitiligo ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Vitiligo Causes: బొల్లి మచ్చలు ఎందుకు వస్తాయి? ఎవరికి వస్తాయి? వీటికి చికిత్స లేదా?

Vitiligo Causes: బొల్లి మచ్చలు ఎందుకు వస్తాయి? ఎవరికి వస్తాయి? వీటికి చికిత్స లేదా?

Haritha Chappa HT Telugu
May 22, 2024 09:30 AM IST

Vitiligo Causes: బొల్లి మచ్చలు ముఖంపైన రావడం వల్ల అందవిహీనంగా కనిపిస్తారు. ఆ మచ్చలు ఎందుకు వస్తాయో, వాటికి చికిత్స ఉందో లేదో తెలుసుకోండి.

బొల్లి మచ్చలు ఎందుకు వస్తాయి?
బొల్లి మచ్చలు ఎందుకు వస్తాయి? (Pexels)

Vitiligo Causes: కొంతమంది ముఖాలపై తెల్లటి మచ్చలు కనిపిస్తాయి. వాటిని కొన్ని ప్రాంతాల్లో బొల్లి అంటే, మరికొన్ని ప్రాంతాల్లో శోభి అంటారు. ఆంగ్లంలో దీన్ని విటిలిగో (Vitiligo) అని పిలుస్తారు. ఎక్కువగా ఇది ముఖం పైనే వస్తుంది. ముఖం నుంచి శరీరం అంతా కూడా వ్యాపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది సమస్యతో బాధపడుతున్నారు.

ముఖ్యంగా మన దేశంలోనే బొల్లితో బాధపడుతున్న వారి సంఖ్య అధికంగా ఉంది. ప్రతి 100 మందిలో ఐదు నుంచి ఎనిమిది మంది వరకు ఈ సమస్య ఉంటోంది. అదే ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మాత్రం 100 మందిలో ఒకరికి మాత్రమే ఈ సమస్య ఉంది. అంటే మిగతా దేశాలతో పోలిస్తే మన దేశంలో బొల్లి సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉందని అర్థం.

ఒక వ్యక్తికి బొల్లి వచ్చే అవకాశం ఉంటే ఆ మచ్చలు ఇరవైల వయసులోనే మొదలైపోతాయి. ఇవి వంశపారంపర్యంగా, జన్యుపరంగా వచ్చే అవకాశం కూడా ఉంది. బొల్లి మచ్చల సమస్య ఎప్పుడు? ఎవరికి వస్తుందో అంచనా వేసి చెప్పడం కష్టం. అయితే కుటుంబంలో ఎవరికైనా ఉంటే మాత్రం అది వారసత్వంగా వచ్చే అవకాశం ఎక్కువ.

బొల్లి ఎందుకు వస్తుంది?

చర్మంలో మెలనోసైట్లు ఉంటాయి. ఈ కణాలు నిత్యం మెలనిన్ అనే హార్మోన్ ను ఉత్పత్తి చేస్తాయి. ఇవే మన చర్మం రంగును నిర్ణయిస్తుంది. ఈ హార్మోన్ ఎప్పుడైతే అవసరం కన్నా తక్కువగా ఉత్పత్తి అవుతుందో అప్పుడు బొల్లి మచ్చలు రావడం మొదలవుతుంది. కొన్నిచోట్ల వీటి ఉత్పత్తి సాధారణంగా ఉండడం, మరికొన్నిచోట్ల తక్కువగా ఉండడం వల్ల ఇలా తెల్ల మచ్చలు ఏర్పడతాయి. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ గా చెప్పుకుంటారు. శరీరంలో ఎక్కడైతే మెలనోసైట్ల సంఖ్య తగ్గుతుందో.. అక్కడ ఈ తెల్ల మచ్చలు వస్తాయి. అయితే ఇది అంత ప్రాణాంతక వ్యాధి మాత్రం కాదు. వారిని ముట్టుకున్నంత మాత్రాన బొల్లి మచ్చలు వచ్చే అవకాశం లేదు.

బొల్లి మచ్చలు రెండు రకాలు ఉన్నాయి. ఒకటి సెగ్మెంటల్, రెండోది నాన్ సెగ్మెంటల్. సెగ్మెంటల్ అంటే కేవలం శరీరంలోని ఒక భాగంలో మాత్రమే వస్తుంది. ఇతర ప్రాంతాలకు వ్యాపించదు. కానీ నాన్ సెగ్మెంటల్ మాత్రం శరీరంలో ఏ చోటకైనా వ్యాపించే అవకాశం ఉంది. చేతులు, కాళ్లు, పెదవులు, వీపు, నోరు, జననేంద్రియాలు ఇలా ఎక్కడైనా బొల్లి మచ్చలు రావచ్చు.

వీరికి వచ్చే అవకాశం?

బొల్లి మచ్చలు అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్‌గా చెప్పుకున్నాం. ఇదే కాదు థైరాయిడ్, అలోపేసియా అరియేటా, మధుమేహం, బి12 విటమిన్ లోపించడం వల్ల వచ్చే అనీమియా, సొరియాసిస్ వీటిని కూడా ఆటో ఇమ్యూన్ డిజార్డర్లుగానే చెప్పుకుంటారు. వీటితో బాధపడుతున్న వారికి కూడా విటిలిగో వచ్చే అవకాశం ఎక్కువగానే ఉంది.

చికిత్స ఉందా?

విటిలిగో అంటే బొల్లి సమస్యతో బాధపడేవారు మానసికంగా బలహీనంగా మారిపోతారు. తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతారు. తమ ముఖాన్ని, శరీరాన్ని చూసి ఆత్మన్యూనతతో బాధపడతారు. అలాంటి వారికి మానసిక ధైర్యాన్ని ఇవ్వాలి. మీరు దీర్ఘకాలంగా చికిత్స తీసుకోవాల్సి వస్తుంది. వైద్యులు రోగి పరిస్థితిని బట్టి మందులను సూచిస్తారు. మందులు దీర్ఘకాలంగా వాడడం వల్ల ముఖము, ఛాతీ మీద వచ్చే మచ్చలు త్వరగా తగ్గే అవకాశం ఉంది. కానీ మిగతా చోట్ల మాత్రం తగ్గడానికి చాలా సమయం పడుతుంది. వైద్యులు ఇచ్చిన మందులు వారిపై పనిచేస్తున్నాయో లేదో తెలియడానికి రెండు మూడు నెలల వరకు పట్టే అవకాశం ఉంటుంది. కొన్ని రకాల క్రీములు, ఫోటో కీమోథెరపీ, లేజర్ చికిత్సలు, శస్త్ర చికిత్సలు వంటివి సమస్యకు ఉపయోగించే వైద్య విధానాలు.

బొల్లి సమస్య రావడం వల్ల ప్రాణాలు పోయే ప్రమాదం ఏమీ లేదు. మానసిక ఒత్తిడికి మాత్రం గురికాకుండా దీన్ని ఎదుర్కొంటూ ఉండాలి. ఇది పూర్తిగా నయం కాదు. కానీ ఆరోగ్యంగా జీవించే అవకాశాన్ని మాత్రం ఇస్తుంది. దీనికి మనం మీరు చేయాల్సిందల్లా మందులు వాడుతూ మానసికంగా ధైర్యంగా ఉండటమే.

WhatsApp channel

టాపిక్