Betel Leaves Rice Recipe | తమలపాకు అన్నం.. నములుకుంటూ తింటే సులభంగా అవుతుంది జీర్ణం!
Betel Leaves Rice Recipe: తమలపాకు అన్నం తమలపాకులతో తయారు చేసే ఒక సులభమైన, సువాసనగల వెరైటీ అన్నం. తమలపాకు రైస్ రెసిపీని ఈ కింద చూడండి.
Healthy Recipes: తమలపాకు అన్నం, ఇది వినడానికి మీకు కొత్తగా ఉన్నా, తినడానికి మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఇది తమలపాకులతో తయారు చేసే ఒక సులభమైన, సువాసనగల వెరైటీ అన్నం. మీ వద్ద వండిన అన్నం సిద్ధంగా ఉంటే ఈ రెసిపీ చేయడానికి 15 నిమిషాలు కూడా పట్టదు. దీన్ని తయారుచేసే విధానం దాదాపు లెమన్ రైస్‌ని పోలి ఉంటుంది. కానీ ఇది పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఈ రెసిపీలో వాడే తమలపాకులు వంటకానికి ప్రత్యేకమైన సువాసన, రుచిని అందిస్తాయి. కొద్దిమందికి మొదటి ముద్ద తిన్న వెంటనే నచ్చకపోవచ్చు, కానీ తింటూపోతే దీని కమ్మదనాన్ని ఆస్వాదిస్తారు.
తమలపాకు తినడం చాలా ఆరోగ్యకరం. తమలపాకులో విటమిన్ సి, థయామిన్, నియాసిన్, రిబోఫ్లావిన్, కెరోటిన్, కాల్షియం వంటి పోషకాలు నిండుగా ఉంటాయి. తమలపాకు తినడం ద్వారా జీర్ణసమస్యలు ఉండవు, ప్రేగు కదలికలు సులభతరం అవుతాయి, కడుపు శుభ్రం అవుతుందని ఆయుర్వేదం పేర్కొంది. ఇంకా కిడ్నీలో రాళ్లను నివారిస్తుంది, నోటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది, శ్వాస సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది, రక్తంలో చక్కెర స్థాయిలను కూడా తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉందని కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి.
తమలపాకు రైస్ ఎలా చేయాలో ఈ కింద ఇచ్చిన సూచనలను అనుసరించండి.
Betel Leaves Rice Recipe కోసం కావలసినవి
- 1 కప్పు అన్నం
- 4-5 తమలపాకులు
- 3-4 పచ్చి మిర్చి
- 1/2 టీస్పూన్ పసుపు
- 2-3 స్పూన్ తాజా కొబ్బరి
- 2 టీస్పూన్ నిమ్మరసం
- రుచికి తగినంత ఉప్పు
- 2-3 టేబుల్ స్పూన్లు నూనె
- 1 టీస్పూన్ ఆవాలు
- 1 టీస్పూన్ మినపపప్పు
- 1/2 టీస్పూన్ శనగపప్పు
- 1/4 tsp జీలకర్ర
- 1 ఎండు మిర్చి మిరపకాయ
- కొన్ని వేరుశనగలు
- 1 కరివేపాకు రెమ్మ
- కొత్తిమీర
తమలపాకు అన్నం తయారీ విధానం
- ముందుగా తాజా తమలపాకులు, పచ్చి మిరపకాయలను శుభ్రంగా కడిగి, ఆపై మిక్సీ జార్ లో వేసి మెత్తని పేస్టుగా రుబ్బుకోవాలి.
- ఇప్పుడు ఒక బాణాలిలో నూనె వేడి చేయండి. నూనె వేడయ్యాక ఆవాలు, మినపపప్పు, శనగపప్పు, వేరుశనగలను వేసి వేయించండి.
- ఆవాలు బాగా చిమ్మినప్పుడు, ఎర్ర మిరపకాయ, కరివేపాకు వేసి వేగించండి. ఆపై పసుపు, ఉప్పు వేసి కలపండి.
- ఇప్పుడు రుబ్బిన తమలపాకులు, పచ్చిమిర్చి పేస్ట్ వేసి, పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
- ఇప్పుడు ఈ పాన్‌లో ఉడికించిన అన్నం వేసి, అవసరం మేరకు నిమ్మరసం పిండి బాగా కలపండి.
- చివరగా తురిమిన కొబ్బరి, తరిగిన కొత్తిమీర వేసి కలపాలి.
అంతే, తమలపాకు అన్నం రెడీ. దీనిని పాపడ్‌తో వేడివేడిగా తింటూ ఆనందించండి.
సంబంధిత కథనం