Tips for Skin Burns: చర్మంపై కాలిన గాయాలు త్వరగా తగ్గాలంటే ఈ చిట్కాలు ఫాలో అయిపోండి
Tips for Skin Burns: ఇంట్లో చిన్న చిన్న కాలిన గాయాలు తగులుతూనే ఉంటాయి. అలాంటప్పుడు ఇంటి చిట్కాలతోనే వాటిని తగ్గించుకోవచ్చు. అలాంటి చిట్కాలు ఇవిగో.
Tips for Skin Burns: వంట చేస్తున్నప్పుడు ఎంతోమంది మహిళలకు చేయి కాలడం అనేది సహజంగా జరుగుతూనే ఉంటుంది. పూజ చేస్తున్నప్పుడు కూడా అగరబత్తి అంటుకోవడం, దీపం వల్ల చెయ్యి కాలడం వంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటి సమయంలో వైద్యుల వద్దకు పరిగెట్టాల్సిన అవసరం లేదు. ఇంటి చిట్కాల ద్వారానే ఈ కాలిన గాయాలు పెరగకుండా అదుపులో ఉంచుకొని తగ్గేలా చూడవచ్చు. కొన్నిసార్లు కాలిన గాయాలు బొబ్బలు ఎక్కుతాయి. వాటిని చిదమడం వంటివి చేయకూడదు. కాలిన గాయాలు త్వరగా తగ్గాలంటే ఈ చిట్కాలు పాటించండి.
నీళ్లతో కడగవద్దు
గాయం తగిలిన వెంటనే ఎంతోమంది నీళ్లతో కడిగేస్తూ ఉంటారు. ఇలా చేయకూడదు. నీళ్లతో కడగడం వల్ల నొప్పి పెరుగుతుంది. అలాగే బొబ్బలు కూడా ఎక్కువగా ఎక్కుతాయి. గాయం తగిలిన వెంటనే ఒక మెత్తటి వస్త్రాన్ని నీటిలో తడిపి దాన్ని బాగా పిండి ఆ గాయం పై చుట్టాలి. మెల్లగా గాయం పై నొక్కి పట్టి ఉంచితే బొబ్బలు ఎక్కకుండా ఉంటాయి. ఇలా చేస్తే ఆ గాయం త్వరగా మానిపోతుంది. బొబ్బలు వచ్చాయంటే ఆ గాయం తగ్గడానికి కాస్త ఎక్కువ సమయం పడుతుంది.
ఇంట్లో వైట్ వెనిగర్ ఉంటే కాలిన గాయం పై వెంటనే పూయండి. అదే సాధారణ వెనిగర్ ఉంటే దాన్ని కాస్త నీటిలో కలిపి గాయంపై పూయండి. ఇలా చేయడం వల్ల మంట తగ్గుతుంది. వాపు కూడా రాదు. గాయం త్వరగా మానిపోయే అవకాశం ఉంది.
టూత్ పేస్టుతో...
ప్రతి ఇంట్లో టూత్ పేస్ట్ ఉండడం సాధారణం. కాలిన వెంటనే కొంతమంది టూత్ పేస్టును రాసేస్తారు. ఇలా చేయడం మంచిదే అయినా వెంటనే రాయకూడదు. వెంటనే టూత్ పేస్ట్ ను రాయడం వల్ల నొప్పి పెరిగిపోతుంది. ముందుగా గాయం పై నీటిలో తడిపి పిండిన క్లాత్ ని వేయాలి. ఆ తర్వాత ఆ క్లాత్ ని తీసేసాక టూత్ పేస్ట్ ను అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల మంట పోతుంది. గాయం కూడా చల్లగా అనిపిస్తుంది. ఇది త్వరగా తగ్గే అవకాశం ఉంటుంది.
ఇంట్లో పసుపు, పెరుగు వంటివి ఉండడం సహజమే. కాలిన గాయం పై పెరుగు, పసుపు కలిపిన మిశ్రమాన్ని పెడితే ఎంతో మంచిది. అక్కడ నొప్పి, మంట వంటివి త్వరగా తగ్గుతాయి. గాయం కూడా త్వరగా తగ్గే అవకాశం ఉంది. పసుపులో ఉండే యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు అక్కడ బ్యాక్టీరియా, వైరస్‌లు చేరకుండా అడ్డుకుంటాయి. దీనివల్ల ఈ గాయం త్వరగా మానిపోతుంది. గాయం చిన్నదే అయితే ఎలాంటి ఆహారపు అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం లేదు. గాయం కాస్త పెద్దది అయితే చీము పట్టే పప్పులు వంటివి తినకూడదు. పెసరపప్పు, శనగపప్పు తినడం వల్ల ఆ ప్రాంతంలో త్వరగా చీము పట్టే అవకాశం ఉంది. ఆ రెండింటినీ మాని మిగతా వాటిని తినటం వల్ల గాయం త్వరగా తగ్గుతుంది.
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ముఖ్యంగా ఆకుకూరలు, చికెన్, కోడిగుడ్లు వంటివి తిని చూడండి. కాలిన గాయాలు త్వరగా మానిపోతాయి. నొప్పి కూడా తగ్గిపోతుంది. అక్కడ మచ్చలు మాత్రం ఏర్పడే అవకాశం ఉంది. మచ్చలు రాకుండా ఉండాలంటే ప్రతి పూట తేనెను రాస్తూ ఉండండి. ఇలా చేయడం వల్ల తక్కువ కాలంలోనే అది సరైన శరీరపు రంగులో కలిసిపోయే అవకాశం ఉంది. ఈ చిట్కాలు చర్మంపై చిన్నగా కాలితేనే పాటించాలి. మరీ ఎక్కువగా కాలినా, లోతుగా గాయమైనట్టు అనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఇంటి చిట్కాలు వల్ల ఎలాంటి ఫలితం ఉండదు. కేవలం వంట చేసేటప్పుడు కుక్కర్ అంటుకోవడం వల్ల చర్మం కమిలిపోవడం, అగరబత్తీలు అంటుకొని చర్మం కాలిపోవడం వంటి వాటికే ఈ చిట్కాలు పనిచేస్తాయి. గాయం మరీ పెద్దదిగా అనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.