Sour Curd: వేసవిలో పెరుగు పులిసిపోతోందా? ఈ చిట్కాలు పాటించండి పెరుగు పులియకుండా టేస్టీగా ఉంటుంది
Sour Curd: వేసవిలో పెరుగు త్వరగా పులిసిపోతుంది. కొందరికి పులిసిన పెరుగు నచ్చదు. పెరుగు త్వరగా పులియకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకోండి.
Sour Curd: ప్రతిరోజూ తినాల్సిన ఆరోగ్యకరమైన ఆహారాల్లో పెరుగు ఒకటి. పెరుగు జీర్ణవ్యవస్థకు అత్యవసరం. జీర్ణవ్యవస్థను, శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. వేసవిలో కచ్చితంగా తినాల్సిన ఆహారాలలో పెరుగు కూడా ఒకటి. చల్లని పెరుగును అన్నంలో కలుపుకుని తింటే శరీరానికి హాయిగా అనిపిస్తుంది. అయితే వేసవిలో ఒక సమస్య ఎక్కువ మంది ఎదుర్కొంటూ ఉంటారు. పెరుగు తక్కువ కాలంలోనే పులియడం వల్ల దాని రుచి మారిపోతుంది. అందుకే ఎక్కువ మంది తినడానికి ఇష్టపడరు. పెరుగు పులియకుండా ఉండాలంటే చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే సరిపోతుంది.

పులిసిన పెరుగుతో ఆరోగ్యం
నిజానికి పులిసిన పెరుగు ఆరోగ్యానికి ఎంతో మంచిది. అందులో ప్రోబయోటిక్స్ అధికంగా ఉంటాయి. వాటిని తినడం వల్ల పొట్టలోని మంచి బ్యాక్టీరియా మరింతగా పెరుగుతుంది. అయితే రుచికి మాత్రం పులిసిన పెరుగు అంతగా నచ్చదు. ఆ పెరుగు వాసన మారిపోతుంది. అందుకే పెరుగును పులియకుండా చూసుకుంటే మంచిది.
పెరుగు పులియకుండా చిట్కాలు
పెరుగు త్వరగా పులియకుండా ఉండాలంటే నాణ్యమైన పాలతోనే పెరుగును చేయాలి. పెరుగును తాజా పాశ్చరైజ్డ్ పాలతో తయారు చేయడం వల్ల పెరుగు త్వరగా పులియదు. అలాగే ఎక్స్పైరీ తేదీకి దగ్గరగా ఉన్న పాల ప్యాకెట్‌ను ఉపయోగించకపోవడమే మంచిది. ఎక్స్పైరీ డేట్ కి దగ్గరగా ఉన్న పాలు అప్పటికే బ్యాక్టీరియాను ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. దీనితో పెరుగు చేస్తే పులుపుని తెచ్చే బ్యాక్టీరియాను ఎక్కువగా ఉంటుంది.
పెరుగును తోడుబెట్టేముందు గిన్నెలు పరిశుభ్రంగా ఉన్నాయో లేదో చూసుకోండి. అందులో ఉండే సూక్ష్మ బ్యాక్టీరియా ల వల్ల పెరుగు త్వరగా పులిసే అవకాశం ఉంది. పెరుగు గిన్నెను శుభ్రం చేసేందుకు వేడి నీరును ఉపయోగించడం చాలా ముఖ్యం.
వేసవిలో పెరుగు తోడుబెట్టడానికి సరైన వాతావరణాన్ని కూడా ఎంచుకోవాలి. పెరుగును తోడుపెట్టడానికి వంట గదిలో చల్లని ప్రదేశాన్ని ఎంచుకుంటే మంచిది. అలా అని ఫ్రిజ్లో పెడితే పెరుగు తోడుకోదు. వేడిగా ఉండే ప్రదేశంలో పెరుగును తోడుపెట్టిన గిన్నె పెడితే అది త్వరగా పులిసిపోయే అవకాశం ఉంది. వంటగది చాలా వెచ్చగా ఉన్నట్లయితే ఇంటిలో ఏ భాగంలో చల్లగా ఉంటుందో అక్కడ పెరుగు తోడు పెట్టిన గిన్నెను పెట్టండి. పులిసే ప్రక్రియ మందగిస్తుంది.
అలాగే పాలల్లో ఒక స్పూను చక్కెర వేసి బాగా కలిపి ఆ తర్వాత పెరుగును తోడు పెడితే పులిసే అవకాశం తక్కువగా ఉంటుంది. పెరుగు తయారయ్యాక అది తాజాగా ఎక్కువ కాలం ఉండేలా చేసేందుకు గాలి చొరబడని గిన్నెను ఎంచుకోవడం మంచిది. మూత తీసి ఉంచడం వల్ల త్వరగా పులిసిపోతుంది. బిగుతుగా మూత పెట్టి రిఫ్రిజిరేటర్ లో పెట్టేస్తే పెరుగు పులిసే ప్రక్రియ మందగిస్తుంది. చల్లగా ఉండే ప్రదేశంలో బ్యాక్టీరియా పెరుగుదల నెమ్మదిస్తుంది. దీనివల్ల ఎక్కువ కాలం పాటు పెరుగు పులియకుండా ఉంటుంది.
సాధారణ పెరుగు కన్నా కాస్త పులిసిన పెరుగును తింటేనే మంచిది. మరీ పులిస్తే వాసన భిన్నంగా వస్తుంది. కాబట్టి కాస్త పులిసిన పెరుగున తినడానికే ప్రయత్నించండి. ఆరోగ్యకరంగా ఉంటుంది. ఇక పులిసిన పెరుగు నచ్చని వారు తాజా పెరుగును తినడమే మంచిది.