Sleep Early Tips : త్వరగా నిద్రపోయేందుకు 9 చిట్కాలు.. వెంటనే ఫాలో అవ్వండి-follow these 9 tips to sleep as soon as possible ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sleep Early Tips : త్వరగా నిద్రపోయేందుకు 9 చిట్కాలు.. వెంటనే ఫాలో అవ్వండి

Sleep Early Tips : త్వరగా నిద్రపోయేందుకు 9 చిట్కాలు.. వెంటనే ఫాలో అవ్వండి

Anand Sai HT Telugu
Jan 09, 2024 07:45 PM IST

Early Sleeping Tips : త్వరగా నిద్రపోయేందుకు కొన్ని చిట్కాలు పాటించాలి. నిద్ర సరిగా లేకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే రోజూ 8 గంటల నిద్ర కచ్చితంగా ఉండాలి.

నిద్ర చిట్కాలు
నిద్ర చిట్కాలు ( Free)

రోజంతా పని చేసి అలసిపోతాం.. ఇంటికి తిరిగి వచ్చి.. డిన్నర్ చేస్తాం. ఇక పడుకోవాలి అనుకుంటాం.. కానీ అస్సలు నిద్రరాదు. కనురెప్పలు తెరిచి సగం రాత్రి గడిచిపోతుంది. చాలా మందికి ఇలాంటి సమస్య ఉంటుంది. ఇలా నిద్రలేమితో బాధపడుతున్నారు అనేక మంది. రోజూ నిద్రమాత్రలు వేసుకోవడంలాంటివి చేయకూడదు. నిద్రపోవడం అంత కష్టం కాదు. కొన్ని చిట్కాలు తెలుసుకోవాలి.

నిద్రిస్తున్నప్పుడు శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. గదిలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే, అది నిద్ర సమస్యలను కలిగిస్తుంది. ఉష్ణోగ్రత 15-19 డిగ్రీలు ఉంటే, నిద్ర త్వరగా వస్తుంది. నిద్రకు ముందు వేడి నీటితో స్నానం చేస్తే ఉపయోగం ఉంటుంది. పడుకునే ముందు వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల త్వరగా నిద్ర పడుతుంది.

మీకు నిర్దిష్ట నిద్ర షెడ్యూల్ ఉంటే త్వరగా నిద్రపోతారు. శరీరం నియంత్రణ వ్యవస్థలను కలిగి ఉంటుంది. ఎప్పుడు ఏం చేయాలో శరీరాన్ని హెచ్చరిస్తుంది. రోజూ ఒకే సమయంలో నిద్రపోతే, శరీరం మెదడును నిద్రపోయేలా హెచ్చరిస్తుంది. ప్రతిరోజూ 7-9 గంటల నిద్ర అవసరం. నిద్రకు ముందు శరీరాన్ని రిలాక్స్ చేయాలి. ఎక్కువ పని చేసిన వెంటనే మీకు నిద్ర పట్టదు.

శరీరంలో అంతర్గత గడియారం సెట్ అయ్యేలా చూసుకోవాలి. ఇది నిద్రకు ముందు మెదడును అప్రమత్తం చేస్తుంది. పగటిపూట మితిమీరిన వెలుతురు మెదడుకు నిద్రను రానివ్వదు. అదేవిధంగా రాత్రిపూట చీకటి పడటం వల్ల నిద్రకు అవసరమైన మెలటోనిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. రాత్రి సమయంలో బ్లాక్ కర్టెన్లతో గదిలోకి వెలుతురు రాకుండా చూసుకోండి. ఇది మీకు వేగంగా నిద్రపోవడానికి సహాయపడుతుంది.

ఆందోళన, కంగారుతో నిద్రరాదు. మంచి నిద్ర కోసం ఒత్తిడి లేకుండా ఉండాలి. యోగా, ధ్యానం మీ ఒత్తిడిని తగ్గించవచ్చు. యోగా అనేది నిద్ర నాణ్యత, నిద్ర వ్యవధిని ప్రభావితం చేస్తుంది. ధ్యానం మెలటోనిన్ స్థాయిలను పెంచుతుంది.

చాలా మంది అర్ధరాత్రి నిద్ర లేస్తారు. అప్పుడు నిద్ర పట్టదు సరిగా. గడియరం వైపు చూస్తారు. నిద్ర లేస్తే గడియారం వైపు చూడకండి అంటున్నారు పరిశోధకులు. గడియారం వైపు చూస్తే ఆందోళన పెరుగుతుంది. నిద్రరావడం లేదని అటువైపే చూస్తుంటారు. అలాంటి ఆలోచనలు రాకుండా ఉండాలంటే పడకగదిలో గడియారాన్ని పెట్టకపోవడమే మంచిది.

రాత్రిపూట నిద్రకు ఇబ్బంది ఉన్నవారు పగటిపూట నిద్రపోకుండా ప్రయత్నించండి. పగటిపూట 2 గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయం నిద్రపోవడం వల్ల రాత్రి సరైన నిద్ర పట్టదని అధ్యయనాలు చెబుతున్నాయి.

రాత్రి నిద్రపోయే ముందు ఏమి తింటారో కూడా చూసుకోవాలి. అది మీ నిద్రను ప్రభావితం చేస్తుంది. రాత్రిపూట ఫాస్ట్ ఫుడ్స్ తినకూడదు. చక్కెర పదార్థాలను తీసుకోవద్దు. వేయించిన ఆహారాల జోలికి పోకూడదు.

మంచి నిద్ర కోసం సంగీతం అద్భుతంగా పని చేస్తుంది. నిద్ర సమస్యలతో బాధపడేవారు నిద్రపోయే ముందు మంచి సంగీతాన్ని వినవచ్చు. ఇలా చేస్తే నిద్ర వచ్చేస్తుంది.

రోజంతా యాక్టివ్‌గా ఉంటే బాగా నిద్రపోతారు. పగటిపూట వ్యాయామం చేయడం వల్ల రోజంతా యాక్టివ్‌గా ఉండవచ్చు. వ్యాయామం ఒత్తిడి హార్మోన్ల విడుదలను తగ్గించడం ద్వారా సెరోటోనిన్ ఉత్పత్తిని పెంచుతుంది. రన్నింగ్, సైక్లింగ్, టెన్నిస్ ఆడటంలాంటి వ్యాయామాలు చేయాలి.

Whats_app_banner