China preparing for war, says Rahul Gandhi: ఒకవైపు, లద్దాఖ్, అరుణాచల్ ప్రదేశ్ ల వైపు నుంచి భారత్ పై యుద్ధానికి చైనా సిద్ధమవుతోంటే, మరోవైపు భారత ప్రభుత్వం ఘాడ నిద్రలో ఉందని రాహుల్ గాంధీ విమర్శించారు. చైనా నుంచి వస్తున్న ముప్పును గుర్తించలేనంత నిద్రావస్థలో భారత ప్రభుత్వం ఉందన్నారు.
చైనా నుంచి ముప్పు పొంచి ఉందని, ఆ దేశం యుద్ధానికి సిద్ధమవుతోందని తాను గత మూడేళ్లుగా చెబుతూనే ఉన్నానని రాహుల్ చెప్పారు. చైనా యుద్ధ సన్నద్ధత విషయం భారత ప్రభుత్వం గుర్తించినా, గుర్తించనట్లుగా వ్యవహరిస్తోందని, ముప్పును దాచిపెడుతోందని ఆరోపించారు. ఇప్పటికైనా నిద్రలేచి, సరైన చర్యలు చేపట్టనట్లైతే, దారుణ పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని రాహుల్ గాంధీ హెచ్చరించారు. భారత్ జోడో యాత్రలో భాగంగా ప్రస్తుతం రాహుల్ గాంధీ రాజస్తాన్ లో పాద యాత్ర చేస్తున్నారు.
‘‘చైనా ఆయుధ వ్యవస్థలను సిద్ధం చేసుకుంటున్న విధానాన్ని పరిశీలించండి. అది ఏదో ఆక్రమణ కోసమో, లేక స్వీయ రక్షణ కోసమో కాదు. ఆ దేశం భారత్ పై యుద్ధానికి సిద్ధమవుతోంది. అది యుద్ధ సన్నద్ధత. ఈ విషయాన్ని బహుశా భారత ప్రభుత్వం అంగీకరించదనుకుంటా’’ అని రాహుల్ వివరించారు. భారత ప్రభుత్వం సమయానుకూలంగా, కార్యక్రమాలను నిర్వహించే విధానాలను మాత్రమే అవలంబిస్తోందని, వ్యూహాత్మక ప్రణాళికలను రూపొందించడం లేదని రాహుల్ ఆరోపించారు.
ప్రభుత్వంలోని పెద్దలు ప్రసంగాలు మాత్రం చేస్తారని, సమర్ధవంతమైన ఆచరణ మాత్రం ఉండదని రాహుల్ గాంధీ ఆరోపించారు. అరుణాచల్ ప్రదేశ్ లో చైనా సరిహద్దుల్లోని తవాంగ్ ప్రాంతంలో డిసెంబర్ 9న భారత్, చైనా సైనికుల మధ్య తీవ్రస్థాయి ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఇరు దేశాల సైనికులు గాయపడ్డారు. భారతీయ సైనికులు సాహసోపేతంగా వ్యవహరించి, భారత భూభాగం నుంచి చైనా సైనికులను తరిమికొట్టారు.