India-China Troops Clashed: భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ.. డ్రాగన్ సేనలను తిప్పికొట్టిన మన దళాలు!
India-China Troops Clashed: భారత్, చైనా దళాల మధ్య అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు వద్ద ఘర్షణ జరిగిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
India-China Troops Clashed: అరుణాచల్ ప్రదేశ్‍లోని వాస్తవ నియంత్రణ రేఖ (LAC) వద్ద భారత్, చైనా దేశాల సైనికులు మరోసారి ఘర్షణ పడ్డారు. ఈనెల 9వ తేదీన అరుణాచల్‍లోని తవాంగ్ సెక్టార్ (Tawang Sector)లో ఈ ఘటన జరిగినట్టు భారత కేంద్ర ప్రభుత్వ వర్గాలు సోమవారం (డిసెంబర్ 12) వెల్లడించాయి. ఇరు దేశాల దళాలు కాసేపు ఘర్షణ పడ్డాయని, ఆ తర్వాత విరమించాయని పేర్కొన్నాయి.
ఈ ఘర్షణలో ఇరు దేశాలకు చెందిన కొందరు సైనికులకు స్వల్ప గాయాలయ్యాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
గీతదాటిన చైనా దళాలకు వాత!
India-China Troops Clashed: అరుణాచల్ ప్రదేశ్‍లోని తవాంగ్ సెక్టార్ వద్ద వాస్తవ నియంత్రణ రేఖను దాటేందుకు చైనా దళాలు ప్రయత్నించాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. సుమారు 300 మంది చైనీస్ సైనికులు బోర్డర్ దాటగా.. భారత జవాన్లు నిలువరించారని చెప్పాయి. చైనా బలగాలను భారత సైనికులు.. సమర్థంగా దృఢమైన పద్ధతిలో అడ్డుకున్నారని పేర్కొన్నాయి. ఈ ఘర్షణలో ఇరు దేశాల సైనికులకు స్వల్ప గాయాలయ్యాయని వెల్లడించాయి. భారత్ కంటే చైనాకు చెందిన ఎక్కువ మంది సైనికులకే ఈ ఘటనలో గాయాలయ్యాయని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి.
గల్వాన్ ఘర్షణ తర్వాత..
Galwan Clash: 2020 జూన్‍లో భారత్, చైనా దళాల మధ్య గల్వాన్ లోయలో తీవ్రమైన ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో 20 మంది భారత సైనికులు మృతి చెందారు. 40 మందికి పైగా చైనా సైనికులను మన దళాలు మట్టుబెట్టాయి. అప్పుడు కూడా గీతదాటేందుకు ప్రయత్నించిన డ్రాగన్ సేనలను మన దళాలు తిప్పికొట్టాయి. ఆ ఘటన తర్వాత మరోసారి ఇప్పుడు ఘర్షణ జరిగింది. ఇప్పుడు కూడా చైనా సైన్యం సరిహద్దు దాటేందుకు ప్రయత్నాలు చేయగా.. భారత దళాలు సమర్థంగా తిప్పికొట్టాయి.
2020 గల్వాన్ ఘటన తర్వాత భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. అనంతరం మిలటరీ కమాండర్స్ మధ్య కొన్ని సమావేశాల తర్వాత, లద్దాఖ్‍లోని గోగ్రా-హాట్ స్ప్రింగ్స్ తో పాటు కీలకమైన ప్రాంతాల నుంచి ఇరు దేశాల దళాలు వెనుదిరిగాయి. అయితే చైనా మాత్రం సరిహద్దుల వెంబటి కుట్రలు పన్నుతూ గీత దాటేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే తాజా ఘటన కూడా జరిగింది. అయితే సరిహద్దులో శాంతియుత పరిస్థితిని పునరుద్ధరించేందుకు చైనీస్ కమాండర్లతో సమావేశమయ్యేందుకు భారత కమాండర్లు సిద్ధమయ్యారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.