Biscuit Puri Recipe । వీకెండ్ బ్రేక్ ఫాస్ట్‌లో బిస్కెట్ పూరీ, దీని రుచి చూడాల్సిందే ఒకసారి!-eat something special this weekend here s biscuit puri recipe for you ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Biscuit Puri Recipe । వీకెండ్ బ్రేక్ ఫాస్ట్‌లో బిస్కెట్ పూరీ, దీని రుచి చూడాల్సిందే ఒకసారి!

Biscuit Puri Recipe । వీకెండ్ బ్రేక్ ఫాస్ట్‌లో బిస్కెట్ పూరీ, దీని రుచి చూడాల్సిందే ఒకసారి!

HT Telugu Desk HT Telugu
Oct 30, 2022 08:01 AM IST

ఈ వారాంతంలో సరికొత్తగా ఏదైనా రెసిపీని ప్రయత్నించాలనుకుంటున్నారా? అయితే ఇదిగో బిస్కెట్ పూరీ రెసిపీ (Biscuit Puri Recipe) ని ప్రయత్నించండి, టీ తాగుతూ తినొచ్చు, టీలోకి తింటూ తాగొచ్చు.

Biscuit Puri Recipe
Biscuit Puri Recipe (Unsplash)

వీకెండ్ వచ్చేసింది కాబట్టి, ఎప్పుడూ ఒకేలా కాకుండా కొంచెం ప్రత్యేకంగా ఉండేలా రుచులను ఆస్వాదించాలి. మీరు బ్రేక్‌ఫాస్ట్‌లో పూరీని చాలాసార్లు తిని ఉంటారు. కానీ, ఈ రకంగా ఎప్పుడూ తిని ఉండరు. మనకు తెలిసిన పూరీ ఒకటి పెద్దగా అల్పాహారంగా తినేది అయితే, ఇంకొకటి పానీపూరీ సాయంత్రం వేళ స్నాక్స్ లాగా తినేది. అయితే ఉదయం టిఫిన్ లాగా, సాయంత్రం స్నాక్స్ లాగా తినగలిగే ఒక పూరీ వెరైటీని మీకు ఇప్పుడు పరిచయం చేస్తున్నాం. దీనిని బిస్కెట్ పూరీ (Biscuit Puri) అంటారు లేదా బిస్కెట్ రొట్టి, బిస్కెట్ రోటీ (Biscuit Roti) పేర్లతోనూ పిలుస్తారు.

బిస్కెట్ పూరీ అనేది ఒక కొంకణి కిచెన్ రెసిపీ, దక్షణ కర్ణాటక మంగళూర్ ప్రాంతంలో ఈ బిస్కెట్ పూరీ రెసిపీ చాలా పాపులర్. ఇది క్రిస్పీగా, క్రంచీగా ఉంటుంది. చూడటానికి మనం అప్పుడప్పుడూ తినే కచోరీలాగా ఉంటుంది. అయితే ఇందులో ఫిల్లింగ్, తయారీ విధానం కొద్దిగా వేరేలా ఉంటుంది.

ఈ బిస్కెట్ పూరీని ఏ పదార్థంతో స్టఫ్ చేయకుండా ఉంటే చాయ్ బిస్కెట్‌లా తినేయొచ్చు, లేదా చాయ్ తాగుతూ స్టఫ్ చేసిన పూరీ బిస్కెట్‌ను అల్పాహారంగా తీసుకోవచ్చు. మరి ఈ 2 ఇన్ 1 అల్పాహారం అయిన బిస్కెట్ పూరీ రెసిపీని ఇక్కడ తెలుసుకోండి. ఏం పదార్థాలు కావాలి, ఎలా తయారు చేసుకోవాలో ఈ కింద చూడండి.

Biscuit Puri Recipe కావలసినవి

  • 1 కప్పు మైదా పిండి
  • 2 టీస్పూన్లు రవ్వ
  • 1/2 స్పూన్ ఉప్పు
  • 1 టేబుల్ స్పూన్ నెయ్యి లేదా నూనె
  • 1/4 కప్పు నీరు

ఫిల్లింగ్ కోసం కావలసినవి:

  • 3 స్పూన్ నూనె
  • 1/2 టీస్పూన్ ఆవాలు
  • 1/2 స్పూన్ మినపపప్పు
  • 4- 5 కరివేపాకులు
  • 1/4 టీస్పూన్ ఇంగువ
  • 1 ఎండు మిర్చి
  • 2 పచ్చిమిర్చి
  • 1/2 అంగుళాల అల్లం
  • 1 టేబుల్ స్పూన్ రవ్వ
  • 1 టేబుల్ స్పూన్ శనగ పిండి
  • 1/2 కొబ్బరి తురుము
  • 1/2 స్పూన్ ఉప్పు

బిస్కెట్ పూరీ రెసిపీ- తయారీ విధానం

  1. ముందుగా ఒక గిన్నెలో మైదాపిండి, రవ్వ, ఉప్పు వేసి కలపండి.
  2. ఆపై నుంచి వేడివేడి నెయ్యి లేదా నూనె వేసి పదార్థం దగ్గరికి అయ్యే వరకు కలపండి.
  3. ఇప్పుడు అరకప్పు నీరు పోసి కలపండి, గట్టి పిండి ముద్ద అయ్యేందుకు అవసరం మేరకు మరి కొద్దిగా నీరు కలపండి.
  4. ఇప్పుడు ఈ గిన్నెకు మూత పెట్టి, కొద్దిసేపు పక్కన పెట్టండి. ఈలోపు లోపల స్టఫ్ చేసేందుకు ఫిల్లింగ్ తయారు చేసుకోండి.
  5. ఇందుకోసం, ఒక పాన్‌లో నూనె వేడి చేసి, ఆవాలు, మినపపప్పు, కరివేపాకులను వరకు వేయించాలి.
  6. అనంతరం ఇంగువ, ఎండు మిర్చి, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, మెత్తగా నూరిన అల్లం వేసి, మీడియం వేడి మీద 2 నిమిషాలు వేయించాలి.
  7. ఇప్పుడు రవ్వ, శనగపిండి సుగంధంగా మారే వరకు వేయించాలి. ఇది సుమారు 3 నుండి 4 నిమిషాలు పడుతుంది.
  8. ఆపైన తురిమిన కొబ్బరి, ఉప్పు వేసి 2 నిమిషాలు వేయించాలి. ఫిల్లింగ్ తయారైంది, ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి మార్చండి.
  9. ఇప్పుడు పిండి మిశ్రమాన్ని తీసుకొని పిండి ముద్దను చిన్నగా, సమాన భాగాలుగా విభజించండి
  10. వీటిని కొద్దిగా రోల్ చేసి అందులో ఫిల్లింగ్ మిశ్రమాన్ని స్టఫ్ చేయండి. ఒక్కొక్క దానిలో రెండు 2 టీస్పూన్ల ఫిల్లింగ్ కలపండి.
  11. కొంచెం మందమైన పూరీల లాగా చేసుకొని నూనెలో డీప్ ఫ్రై చేయండి, రెండు వైపులా బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి.
  12. వేయించిన వాటిని ఒక గిన్నెలోకి తీసుకొని అదనపు నూనెను కిచెన్ టవల్ లేదా టిష్యూ పేపర్ తో వడకట్టండి.

అంతే బిస్కెట్ రొట్టీ లేదా బిస్కెట్ పూరీ రెడీ అయినట్లే. వేడి వేడి బిస్కెట్ పూరీని టీ లేదా కాఫీతో సర్వ్ చేసుకోండి, రుచిని ఆస్వాదించండి.

Whats_app_banner

సంబంధిత కథనం