Tea Biscuits Recipe । చాయ్‌లో కరాచీ బిస్కెట్స్ అద్దుకొని తినండి, ఎంజాయ్ చేయండి!
ఉదయం అయినా, సాయంత్రం అయినా ఒక కప్ టీ ఉండాల్సిందే. ఇందులో అద్దుకోవటానికి బిస్కెట్లు కూడా ఉండే ఇంకా తృప్తి. చాయ్ కోసం అద్భుతమైన కరాచీ బిస్కెట్లను ఇంట్లోనే చేసుకోవచ్చు, రెసిపీ ఇక్కడ ఉంది.
ప్రతిరోజూ ఉదయం పూట, అలాగే సాయంత్రం అవగానే మనకు గుర్తుకొచ్చేది ఏదంటే, అది మరేదో కాదు చాయ్. ఒక్కరోజు టీ తాగకపోయినా ఏదో మిస్ అయినట్లు ఉంటుంది. 'ఇంతవరకు చాయ్ కూడా తాగలేదు' అంటూ భావోద్వేగపూరితంగా చెప్తారు. మరి మనకు చాయ్ అంటే కేవలం ఒక పానీయం కాదు, అదొక ఎమోషన్. అదే విధంగా చాయ్‌తో పాటు బిస్కెట్స్ ఉంటే అదొక తృప్తి. వేడివేడి కప్పు టీలో బిస్కెట్ ముంచి మెత్తగా నోట్లో నములుకుంటూ తినడం సరదాగా ఉంటుంది.
చిక్కటి చక్కటి చాయ్‌లో ఉస్మానియా లేదా కరాచీ బిస్కెట్లు చాలా రుచికరంగా ఉంటాయి. హైదరాబాదీలకు వీటి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ బిస్కెట్ల కోసం అక్కడి వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. రుచికరమైన కరాచీ స్టైల్ బిక్సెట్లను మీకు మీరుగా ఇంట్లో సులభంగా చేసుకోవచ్చు. అందుకు కావాల్సిన పదార్థాలేమి, ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ ఇచ్చాం.
ఇది చూసి ఈజీగా చాయ్ చేసుకున్నట్లే, బిస్కెట్లనూ బేక్ చేసుకోండి. ఈ రెసిపీని ఫుడ్ బ్లాగర్ కీర్తి లాబ్రా అందించారు.
Karachi Tea Biscuits Recipe -కావలసిన పదార్థాలు
- 70 గ్రాముల మైదా పిండి
- 35 గ్రాముల ఐసింగ్ షుగర్
- 75 గ్రాముల వెన్న
- 70 గ్రాముల కస్టర్డ్ పౌడర్
- 50 గ్రాముల టుట్టి ఫ్రూటీ
- 1 టీస్పూన్ మిక్స్డ్ ఫ్రూట్ ఎసెన్స్
- 1/4 స్పూన్ ఉప్పు
- 1 టేబుల్ స్పూన్ పాలు
- కొన్ని తరిగిన జీడిపప్పు
తయారీ విధానం
- ముందుగా ఒక పెద్ద గిన్నెలో మైదా పిండి, కస్టర్డ్ పౌడర్, ఐసింగ్ షుగర్, ఉప్పును వేసి బాగా కలపండి లేదా కిచెన్ ఎయిడ్ మిక్సర్‌తో మిక్స్ చేయండి. ఇందులోనే చల్లటి వెన్నను కూడా వేసి మిక్స్ చేయండి.
- ఈ మిశ్రమం కొద్దిగా రవ్వగా మారినపుడు ఇందులో టుట్టీ ఫ్రూటీ, జీడిపప్పు ముక్కలు వేసి కలపండి.
- చివరగా మిక్స్ ఫ్రూట్ ఎసెన్స్, పాలు వేసి వేసి కలిపితే మెత్తని పిండి ముద్దలగా మారుతుంది.
- ఈ పిండి ముద్దను కింద అంటుకోకుండా బటర్ పేపర్‌పై తీసుకొని 1సెం.మీ మందం వరకు రొట్టెలు చేసినట్లుగా రోల్ చేయండి.
- దీనిని ఒక 15-20 నిమిషాల పాటు ఫ్రీజ్ చేయండి, ఆ తరువాత కుకీ కట్టర్ ఉపయోగించి బిస్కెట్ల ఆకృతిలో కత్తిరించండి.
- అనంతరం వీటిని బేకింగ్ ట్రే లోకి బదిలీ చేసి, 180°c వద్ద 10-12 నిమిషాల పాటు బేక్ చేయండి.
బయటకు తీసి చూస్తే, రుచికరమైన తాజా కరాచీ బిస్కెట్లు సిద్ధమవుతాయి. ఇంకేం కావాలి? బిస్కెట్స్ తినండి, ఎంజాయ్ చేయండి.
సంబంధిత కథనం