సాధారణంగా ఎవరైనా మంచి మసాలా టీ లేదా ఫిల్టర్ కాఫీ తాగాలనుకుంటే ఎక్కడికెళ్తారు? కేఫ్- కాఫీడే, బరిస్టా కాఫీ, కోస్టా కాఫీ, స్టార్‌బక్స్ లాంటివి కాకుండా ఏదైనా చిన్న కాకా హోటల్లోనో లేదా రోడ్డు పక్కన ఉండే టీ స్టాల్స్‌లోనో తాగేస్తారు. ఎందుకంటే అలాంటివి దొరికేవి అక్కడే కాబట్టి. కానీ ఇంటర్నేషనల్ బ్రాండ్ ముద్ర కలిగిన ప్రముఖ రెస్టారెంట్ స్టార్‌బక్స్‌లో కూడా ఇప్పుడు మన మసాలా చాయ్, ఫిల్టర్ కాఫీ లభిస్తుంది.
భారతీయ కస్టమర్లను ఆకర్షించడానికి ప్రపంచంలోనే అతిపెద్ద కాఫీ చైన్ అయిన స్టార్‌బక్స్ తన మెనూలో ‘మసాలా చాయ్’ అలాగే ‘ఫిల్టర్ కాఫీ’ని అప్ డేట్ చేయనుంది.
సీజన్‌ను బట్టి, డిమాండ్‌ను బట్టి రెస్టారెంట్ మెనూల్లో మార్పులు చేర్పులు చేయడం మార్కెటింగ్ ట్రిక్. మన ఇండియన్స్‌కి క్యాపచ్చినో, లాట్టే ఫ్లేవర్ల కంటే కూడా మసాలా చాయ్, ఇరానీ చాయ్, సాధారణ ఫిల్టర్ కాఫీలే ఇష్టం. ఈ ఇష్టాన్ని చాలా ఆలస్యంగా గ్రహించిన స్టార్‌బక్స్ ఎట్టకేలకు వీటిని తమ మెనూలో చేరుస్తుంది. ఈ విషయం అందరికీ తెలిసేలా #ItStartsWithYourName అనే హ్యాష్‌టాగ్‌తో ప్రచారం కూడా ప్రారంభించింది. ఇందులో భాగంగా కాఫీ కప్పులపై వినియోగదారుల పేర్లను రాసి వారు కోరిన కాఫీ లేదా టీ ఫ్లేవర్లను అందించనున్నారు.
కొత్త మెనూలో చాక్లెట్ టీ, వెనీలా టీ, స్ట్రాబెర్రీ టీలతో పాటు క్లాసిక్ మసాలా చాయ్, ఇలైచీ చాయ్, సౌత్ ఇండియన్ ఫిల్టర్ కాఫీ ఉంటాయి. మసాలా చాయ్, ఫిల్టర్ కాఫీ ధరలు రూ. 190 నుంచి ప్రారంభమవుతుండగా, మిల్క్‌షేక్‌ల ధరలు రూ. 275 నుంచి ప్రారంభమవుతున్నాయి.
అయితే స్టార్‌బక్స్ కొత్త మెనూపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. మసాలా చాయ్, ఫిల్టర్ కాఫీ వంటి ఫ్లేవర్స్ పరిచయం చేయటాన్ని స్వాగతిస్తూనే.. 'మసాలా చాయ్.. కేవలం ఉన్నత వర్గానికి మాత్రమే' అంటూ ట్రోల్ కూడా చేస్తున్నారు. ఏదైతేనేం ఇప్పుడు స్టార్‌బక్స్ రెస్టారెంటుకు వెళ్లి 'ఏక్ మసాలా చాయ్ లావ్' అంటూ హైదరాబాదీ స్టైల్లో ఆర్డర్ ఇచ్చేయవచ్చు.
సంబంధిత కథనం