Chow Chow Bath Recipe । కొంచెం తీపి, కొంచెం కారం.. చౌచౌ బాత్ రెండు రుచుల అల్పాహారం!-chow chow bath add little sweet and little spice to your breakfast telugu recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Chow Chow Bath - Add Little Sweet And Little Spice To Your Breakfast, Telugu Recipe

Chow Chow Bath Recipe । కొంచెం తీపి, కొంచెం కారం.. చౌచౌ బాత్ రెండు రుచుల అల్పాహారం!

HT Telugu Desk HT Telugu
Oct 10, 2022 08:11 AM IST

Chow Chow Bath: అల్పాహారంలో రెండు రుచులు ఒకేసారి ఆస్వాదించాలనుకుంటే చౌచౌ బాత్ తినిచూడండి. చౌచౌ బాత్ చాలా తేలికైన, రుచికరమైన వంటకం రెసిపీ ఇక్కడ చూడండి.

Chow Chow Bath Recipe
Chow Chow Bath Recipe (Slurrp)

జీవితంలో కొంచెం తీపి, కొంచెం కారం ఉండాలంటారు. అందుకే తీపికారాలను ఒకేసారి రుచిచూపించే ఒక కొత్త రెసిపీని ఈరోజు మీకు పరిచయం చేస్తున్నాం. దీని పేరే చౌచౌ బాత్. ఈ పేరు చూసి ఇదేదో చైనా వంటకమో లేదా కొత్తగా సృష్టించిన వంటకమో అనుకునేరు. ఇది పూర్తిగా సాంప్రదాయ భారత వంటకం. కర్ణాటకలో ఈ అల్పాహారం చాలా ప్రసిద్ధి. ఈ చౌచౌ బాత్ అనేది ఖారా బాత్ అలాగే కేసరి బాత్ రెండింటి కలయిక. ఇది మీ నోటికి కాస్త కారాన్ని, కాస్త తీపిని అందిస్తుంది.

ఇంకా సరళంగా చెప్పాలంటే మనం తరచుగా తినే ఉప్మా, షీరానే చౌచౌ బాత్ అంటారు. అయితే కొన్ని మసాలాలు వాడటం వలన ఇది ఉప్మాకు విభిన్నమైన రుచిని అందిస్తుంది. ఇక, షీరా రుచి మీ అందరికి తెలిసే ఉంటుంది. అయితే ఈ రెండింటిని ఒకేసారి మిక్స్ చేసి వండి వడ్డిస్తారు అని అనుకోకండి. రెండు వేర్వేరుగా చేసి ఒకే ప్లేట్‌లో వడ్డిస్తారు.

మరి చౌచౌ బాత్ సులభంగా, రుచికరంగా ఎలా చేసుకోవాలో ఇక్కడ రెసిపీ అందించాం. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం చూడండి.

Chow Chow Bath Recipe కోసం కావలసిన పదార్థాలు

  • 1 కప్పు రవ్వ (ఖారా బాత్ కోసం)
  • 1 ఉల్లిపాయ
  • 1 టమోటా
  • ½ అల్లం
  • 1 క్యారెట్
  • 2-3 బీన్స్
  • 2 పచ్చిమిర్చి
  • కొన్ని జీడిపప్పులు
  • కరివేపాకు
  • 1 టీస్పూన్ ఆవాలు
  • 1 టీస్పూన్ చిక్కుళ్లు/ తెల్ల శెనగలు
  • ½ టీస్పూన్ పచ్చి బఠానీలు
  • 1 టీస్పూన్ వంగీ బాత్ పౌడర్
  • రుచికి తగినంత ఉప్పు
  • 2-3 టీస్పూన్ నూనె

చౌచౌ బాత్ (ఖారా బాత్) తయారీ విధానం

  1. ముందుగా రవ్వను పాన్‌లో ఐదు నిమిషాలు దోరగా వేయించాలి
  2. మరో భాండీలో రెండు టీస్పూన్ల నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు, తెల్ల శెనగలు, శెనగపప్పు, కరివేపాకు, తరిగిన ఉల్లిపాయలు, రెండు పచ్చిమిర్చి ముక్కలు, అల్లం తురుము వేసి వేయించాలి.
  3. ఇప్పుడు టొమాటోలు ముక్కలు, తరిగిన బీన్స్, క్యారెట్ ముక్కలు, జీడిపప్పు వేసి, ఐదు నిమిషాలు వేయించాలి.
  4. ఇప్పుడు మరొక గిన్నెలో మరిగించిన మూడు కప్పుల నీళ్లు పోసి కలపండి. ఆపై ఉప్పు, వంగీ బాత్ పౌడర్ (లేదా మీకు నచ్చిన మసాలా పొడి) వేసి రెండు మూడు నిమిషాలు బాగా కలపాలి.
  5. ఇప్పుడు వేయించిన రవ్వ వేసి బాగా కలపండి, డిష్ మూతపెట్టి రెండు నిమిషాలు ఉడికించాలి.
  6. అంతే ఖారా బాత్ రెడీ అయినట్లే, పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. దీనిని నేరుగా తినవచ్చు కేదా కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు.

Chow Chow Bath Recipe కోసం కావలసిన పదార్థాలు

  • 1 కప్పు రవ్వ (కేసరి బాత్ కోసం)
  • 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు
  • 1 టేబుల్ స్పూన్ ఎండుద్రాక్ష
  • ఏలకుల పొడి
  • 1/2 కప్పు చక్కెర
  • చిటికెడు ఫుడ్ కలరింగ్ (ఐచ్ఛికం)
  • 2 టేబుల్ స్పూన్ నెయ్యి

చౌచౌ బాత్ (కేసరి బాత్) తయారీ విధానం

  1. ముందుగా భాండీలో అర ​​టీస్పూన్ నెయ్యి వేసి, అందులో కొన్ని జీడిపప్పులు, ఎండుద్రాక్ష వేసి, రెండు నిమిషాలు వేయించాలి.
  2. మరొక భాండీలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, ఆపై రవ్వ వేసి, మీడియం మంట మీద ఐదు నిమిషాలు వేయించాలి.
  3. తర్వాత భాండీలో మూడు కప్పుల మరిగించిన నీళ్లు పోసి, చిన్న మంట మీద వేసి మూత పెట్టి రెండు నిమిషాలు ఉడికించాలి.
  4. రవ్వ నీటిని పీల్చుకున్న తర్వాత, అరకప్పు చక్కెర, కొద్దిగా యాలకుల పొడి, ఫుడ్ కలరింగ్ (మామిడి, అరటిపండు వంటి పండ్లను వేసుకోవచ్చు) వేసి బాగా కలపాలి.
  5. తర్వాత వేయించిన జీడిపప్పు, ఎండుద్రాక్ష వేసి బాగా కలపాలి. పైనుంచి ఒక టీస్పూన్ నెయ్యి వేసి, బాగా కలపాలి. కేసరి బాత్ రెడీ అయినట్లే.

ఇప్పుడు ఖారా బాత్, కేసరి బాత్ కలిపి వడ్డించండి. ఇదే చౌచౌ బాత్.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్