Green Peas Upma । పచ్చిబఠానీలతో పసందైన ఉప్మా.. రుచికరం, ఆరోగ్యకరమైన అల్పాహారం!
ఉదయం అల్పాహారంగా ఉప్మాను మనం అనేక రకాలుగా సిద్ధం చేసుకోవచ్చు. పచ్చిబఠానీలతో Green Peas Upma చేసుకుంటే ఇంకా రుచికరంగా ఉంటుంది, ఇలా తింటే ఆరోగ్యకరం కూడా. రెసిపీని ఇక్కడ చూడండి.
ఉదయం బ్రేక్‌ఫాస్ట్ కోసం మనకు అనేక రకాల వంటకాలు ఉన్నాయి. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రతిరోజూ ఉదయం ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకోవాలి. ఉప్మా మనందరికీ చాలా సుపరిచితమైన అల్పాహారం. ఇది ఎంతో ఆరోగ్యకరమైన అల్పాహారం కూడా. ఈ ఉప్మా అనేది మీరు రోజులో ఏ సమయంలోనైనా తీసుకోవచ్చు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ కోసం ఎంచుకోవచ్చు, రాత్రికి తేలికైన భోజనంగానూ ఉంటుంది.
ఉప్మాను మరింతగా రుచికరంగా పచ్చి బఠానీలతో తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీ చాలా రుచికరంగా ఉంటుంది, దీనిని తయారు చేసుకోవటం కూడా సులభమే. ఆకుపచ్చ బఠానీలలో అనేక పోషకాలు ఉంటాయి. ఇందులోని ఒమేగా 3 ఫ్యాట్స్, యాంటీ యాక్సిడెంట్, యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు చర్మంపై ముడతలను దూరం చేస్తాయి, ఎముకలను బలోపేతం చేస్తాయి, రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఫైబర్ తగినంత ఉంటుంది కాబట్టి బరువును అదుపులో ఉంచుకోవచ్చు.
మరి, ఆలస్యం చేయకుండా ఈ గ్రీన్ పీస్ ఉప్మా కోసం కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ తెలుసుకోండి.
Green Peas Upma Recipe కోసం కావలసినవి
- పచ్చి బఠానీ ఉప్మా కావలసినవి
- 1 కప్పు రవ్వ (దోరగా ఎంచినది)
- 1/4 కప్పు పచ్చి బఠానీలు
- 1 ఉల్లిపాయ
- 2 పచ్చిమిర్చి
- 1 టేబుల్ స్పూన్ నూనె
- 3/4 స్పూన్ ఆవాలు
- 1 రెమ్మ కరివేపాకు
- అల్లం చిన్న ముక్క
- రుచికి తగినంత ఉప్పు
- తాజా కొత్తిమీర
- 2 కప్పుల వేడి నీరు
గ్రీన్ పీస్ ఉప్మా తయారీ విధానం
- ముందుగా ఒక పాన్‌లో నూనె వేడి చేసి, ఆ తర్వాత ఆవాలు వేసి వాటిని చిటపటలాడనివ్వండి.
- అనంతరం కరివేపాకులు, చిన్నగా తురిమిన అల్లం వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
- ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసి, అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసి 2 నిమిషాలు వేయించాలి.
- ఇప్పుడు ఇందులో తేలికగా రోస్ట్ చేసుకున్న రవ్వ వేయాలి, ఆపై పచ్చి బఠానీలు వేసి 2 నిమిషాలు వేయించాలి, అనంతరం ఇందులో వేడి నీటిని కలపండి.
- ఈ దశలో ఉప్పు వేయండి. రవ్వ ముద్దలాగా ఏర్పడకుండా గరిటెతో తిప్పుతూ ఉండాలి.
- ఇప్పుడు మూతపెట్టి చిన్న మంట మీద ఉడికించాలి. రవ్వ నీరంతా పీల్చుకొని, పచ్చి బఠానీలు ఉడికినంత వరకు ఉడికించాలి.
అంతే ఘుమఘుమలాడే గ్రీన్ పీస్ ఉప్మా రెడీ అయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పైనుంచి కొన్ని కొత్తిమీర ఆకులతో గార్నిష్ చేసుకొని, సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని పచ్చి బఠానీ ఉప్మా రుచిని ఆస్వాదించండి.
సంబంధిత కథనం