Periods: పీరియడ్స్ సమయంలో పొట్టనొప్పి, అసౌకర్యం అధికంగా ఉందా? ఈ టీ తాగితే ఆ నొప్పులు తగ్గుతాయి
Periods: నెలసరి సమయంలో కొంతమంది మహిళలకు విపరీతమైన పొట్టనొప్పి వస్తుంది. పొట్ట అసౌకర్యంగా అనిపిస్తుంది. ఇలాంటివారు పీరియడ్స్ వస్తుంటేనే భయపడిపోతారు. అలాంటి వారికి రోజ్ టీ ఎంతో మేలు చేస్తుంది.
Periods: మహిళ ఆరోగ్యానికీ, పీరియడ్స్ కు ఎంతో అనుబంధం ఉంది. ప్రతినెలా క్రమం తప్పకుండా మహిళకు నెలసరి వస్తుంటే ఆమె ఆరోగ్యం చక్కగా ఉన్నట్టు. ముఖ్యంగా పునరుత్పత్తి వ్యవస్థ ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. అయితే నెలసరి సమయంలో కొంతమంది స్త్రీలకు విపరీతమైన పొట్టనొప్పి, ఒళ్ళు నొప్పులు వస్తుంటాయి. ముఖ్యంగా పొట్ట దిగువ భాగంలో అంటే పొత్తికడుపులో నొప్పి వస్తూ ఉంటుంది. ఆ నొప్పి వీపు, తొడలకు కూడా ప్రవహిస్తుంది. కొంతమందికి సూదితో గుచ్చినట్టు తీవ్రమైన నొప్పి కూడా వస్తుంది. అలాంటి వారికి రోజ్ టీ వల్ల మేలు జరుగుతుంది. ఇదొక ఇంటి చిట్కా అనుకోవాలి. గులాబీ రేకులతో చేసే ఈ రోజ్ టీ తాగడం వల్ల పీరియడ్స్ నొప్పుల నుంచి బయట పడవచ్చని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.
పీరియడ్స్ నొప్పులు ఎందుకు వస్తాయి?
పీరియడ్స్ సమయంలో వచ్చే పొట్టనొప్పిని డిస్మెనోరియా అని పిలుస్తారు. ఈ నొప్పులు పొత్తికడుపు భాగంలో, తొడల దిగువ భాగంలో, వీపు వెనుక భాగంలో వస్తాయి. ఋతుస్రావం అవుతున్నంతకాలం ఈ నొప్పులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మొదటి రెండు రోజుల్లో ఈ నొప్పులు తీవ్రంగా ఉంటాయి. గర్భాశయం నెలసరి సమయంలో సంకోచిస్తుంది. దానివల్లే ఈ నొప్పి వస్తుంది. అలాగే రుతుస్రావ సమయంలో గర్భాశయం తన లైనింగ్‌ను బయటికి పంపించేందుకు ప్రయత్నిస్తుంది. అందుకే నొప్పి తీవ్రంగా ఉంటుంది.
రోజ్ టీతో ఆరోగ్యం
పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పుల నుండి బయట పడేసే సమర్థత రోజ్ టీ కు ఉందని ఒక అధ్యయనం చెబుతోంది. 2005లో చేసిన ఒక అధ్యయనం ప్రకారం రోజ్ టీ ని ప్రతిరోజు తాగడం వల్ల పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పులను తగ్గించుకోవచ్చు. అంతేకాదు రోజ్ టీ తాగడం వల్ల మరెన్నో లాభాలు కూడా మహిళలకు కలుగుతాయి.
రోజ్ టీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇవి గర్భాశయంతో సహా శరీరంలోని ఇన్ఫ్లమేషన్ ను తగ్గించడానికి సహాయపడతాయి. అలాగే పీరియడ్స్ క్రాంప్స్ కూడా తగ్గుతాయి.
గులాబీ రేకులతో తయారు చేసే రోజ్ టీలో సహజ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి గర్భాశయ కండరాలను విశ్రాంతి పరుస్తాయి. దీనివల్ల పీరియడ్ నొప్పులు రాకుండా తగ్గుతాయి. జర్నల్ ఆఫ్ ఫుడ్ సైన్స్ లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం రోజ్ టీలో గాలిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. ఇది యాంటీ మైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కూడా ఎక్కువే. ఇది ఆక్సీకరణ ఒత్తిడిని తట్టుకునే శక్తిని శరీరానికి ఇస్తుంది. కాబట్టి శరీరం నెలసరి నొప్పిని తట్టుకునే శక్తిని పొందుతుంది.
రోజ్ టీ తాగడం వల్ల శరీరం తేమవంతంగా ఉంటుంది. శరీరం హైడ్రేటెడ్ గా ఉంటే నెలసరి నొప్పులు తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కడుపు ఉబ్బరం వంటివి రాకుండా ఉంటాయి. గులాబీ టీలోని సువాసన, సహజ సమ్మేళనాలు మానసికంగా ప్రశాంతతను అందిస్తాయి. ఒత్తిడిని తగ్గించి మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి. ఒత్తిడి అధికంగా ఉన్నా పీరియడ్స్ సమయంలో పొట్టనొప్పి అధికంగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రోజ్ టీను ప్రతి రోజూ తాగితే నెలసరి సమయంలో వచ్చే నొప్పులను తగ్గించుకోవచ్చు.
గర్భంతో ఉన్న మహిళలు, పిల్లలకు పాలు పెడుతున్న తల్లులు మాత్రం రోజ్ టీని వైద్యుల సలహాతోనే తాగడం మంచిది. దీన్ని తయారు చేయడం చాలా సులువు. తాజా గులాబీ పువ్వు రేకులను సేకరించి వాటిని శుభ్రంగా కడగాలి. గ్లాసు నీటిలో ఆ గులాబీ పూల రేకలను వేసి స్టవ్ మీద పెట్టి చిన్న మంట మీద మరిగించాలి. ఆ నీటిని వడకట్టి తాగాలి.