Uterine fibroids: గర్భాశయంలో గడ్డలుంటే ఈ లక్షణాలు కనిపిస్తాయి.. గమనిస్తే ముప్పు తప్పినట్లే..-know symptoms of uterine fibroids and about asymptomatic uterine fibroids ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Uterine Fibroids: గర్భాశయంలో గడ్డలుంటే ఈ లక్షణాలు కనిపిస్తాయి.. గమనిస్తే ముప్పు తప్పినట్లే..

Uterine fibroids: గర్భాశయంలో గడ్డలుంటే ఈ లక్షణాలు కనిపిస్తాయి.. గమనిస్తే ముప్పు తప్పినట్లే..

Koutik Pranaya Sree HT Telugu
Jul 06, 2024 01:30 PM IST

Uterine fibroids: గర్భాశయంలో గడ్డలు చాలా మంది ఎదుర్కొనే సమస్య. అయితే ప్రతిసారీ దీని లక్షణాలు తొందరగా బయటికి కనిపించవు. కొన్ని విషయాల గురించి అవగాహన ఉండాల్సిందే.

గర్భాశయ ఫైబ్రాయిడ్లు
గర్భాశయ ఫైబ్రాయిడ్లు (freepik)

గర్భాశయ ఫైబ్రాయిడ్లు.. వాడుక భాషలో చెప్పాలంటే గర్భాశయంలో వచ్చే గడ్డలు స్త్రీ గర్భాశయాన్ని ప్రభావితం చేస్తాయి. గర్భాశయ గడ్డలను క్యాన్సర్ అనుకోకూడదు. ఇవి ఎప్పటికీ క్యాన్సర్ లాగా మారకపోవచ్చు కూడా. కొందరిలో ఈ గడ్డలు అవగానే చాలా సమస్యలు కనిపిస్తాయి. దాంతో వెంటనే వైద్యులను సంప్రదించే అవకాశం ఉంటుంది.

కొందరిలో ఈ గడ్డలు అయినా కూడా ఏ లక్షణాలూ ఉండవు. దాంతో వీటిని తొందరగా గుర్తించలేం. తీవ్రమైన బ్లీడింగ్ లేదా ఇంకేమైనా తీవ్ర సమస్య వచ్చినప్పుడు మాత్రమే వీటిని గుర్తించాల్సి వస్తుంది. కాబట్టి ఇలా లక్షణ రహితంగా ఉన్న గర్భాశయ గడ్డలు చాలా ప్రమాదకరం. వీటిని గుర్తించకపోతే ఆ ప్రభావం సంతానోత్పత్తి మీద కూడా పడుతుంది.

యాభై శాతం ఫ్రైబ్రాయిడ్లని గుర్తించలేము:

క్లినికల్ ఆబ్‌స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ జర్నల్ పరిశోధన ప్రకారం కనీసం 50 శాతం గర్భాశయ గడ్డలు ఎలాంటి లక్షణాలు లేకుండా ఉంటాయని తేలింది. ఏదైనా సమస్య కోసం పరీక్ష చేసినప్పుడు ఇవి బయటపడుతున్నాయట. అల్ట్రాసౌండ్, సర్వైకల్ స్క్రీనింగ్, పెల్విక్ పరీక్షలు చేసినప్పుడు ఫైబ్రాయిడ్లు ఉన్నట్లు తెలుస్తోంది. తప్పితే ఏ సంకేతాలు ఉండట్లేదట. ఇవి గుర్తించకపోతే, గర్భం దాల్చడం కష్టమవుతుంది.

యోనిలో నొప్పి:

క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం వల్ల వీటిని తొందరగా గుర్తించొచ్చు. వీటి సైజు, ఎన్ని ఉన్నాయి, అవి ఉన్న చోటు తెల్సుకోవచ్చు. దాంతో యోనిలో నొప్పి, హెవీ బ్లీడింగ్ రాకుండా జాగ్రత్త పడొచ్చు. చిన్న అనుమానం వచ్చిన కౌమార దశ నుంచి మోనోపాజ్ దాకా క్రమం తప్పకుండా ఈ పరీక్షలు చేయించుకోవడం అత్యావశ్యకం. అల్ట్రాసౌండ్, రెగ్యులర్ స్క్రీనింగ్ వల్ల వీటిని తొందరగా గుర్తించొచ్చు. లేదంటే గర్బాశయాన్ని తొలగించాల్సిన అవసరం వచ్చేదాకా పరిస్థితి తీవ్రత పెరుగుతుంది.

గర్భాశయ గడ్డల వల్ల వచ్చే ప్రమాదాలు:

  1. ఈ ఫ్రైబ్రాయిడ్ల వల్ల క్రమ రహితంగా పీరియడ్స్ రావచ్చు. అధిక రక్తస్రావం, దీర్ఘకాలికంగా బ్లీడింగ్ అవ్వడం వల్ల రక్త హీనత సమస్య వస్తుంది. మాటిమాటికీ ప్యాడ్, ట్యాంపన్లు మార్చాల్సి వస్తుంది. రోజూవారీ పనులకు ఆటంకం ఏర్పడుతుంది.
  2. వీటివల్ల బ్లాడర్ మీద ఒత్తిడి పెరిగి తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. ఎప్పుడూ మూత్రం వచ్చినట్లు అనిపిస్తుంటుంది. లేదంటే మలబద్దకం సమస్య కూడా ఉండొచ్చు.
  3. వీటి వల్ల గర్భాశయ ఆకారంలో మార్పు రావచ్చు. దీంతో గర్భాశయంలో పిండం నిలవదు. సంతానోత్పత్తి సమస్యలు రావచ్చు. గర్భస్రావం అవ్వొచ్చు.
  4. శ‌ృంగారం సమయంలో తరచూ ఉండే నొప్పి వ్యక్తిగత జీవితాన్ని సరిగ్గా ఆస్వాదించలేరు. దీని ప్రభావం మీ బంధం మీద పడొచ్చు.

లక్షణాలేంటి?

ఏ సంకేతాలు లేని లక్షణ రహిత ఫైబ్రాయిడ్లను గుర్తించడం కష్టమే. కానీ సాధారణంగా గర్భాశయ ఫ్రైబ్రాయిడ్లకు ఎలాంటి లక్షణాలు ఉంటాయనే అవగాహన అవసరం.

అధిక రక్తస్రావం

కటి ప్రాంతంలో నొప్పి

ఇవి ముఖ్యమైన సంకేతాలు. ఇలాంటి సమస్యలు ఎదుర్కుంటే వెంటనే వైద్యుల్ని సంప్రదించడండి. దీనికి అనేక చికిత్సలున్నాయి. ఆలస్యం చేయకపోతే మంచి ఫలితాల్ని పొందొచ్చు. భయపడి సమస్య దాచిపెడితే తీవ్ర నష్టానికి దారితీస్తుంది.

Whats_app_banner