Heavy bleeding: పీరియడ్స్ సమయంలో హెవీ బ్లీడింగ్ అవుతోందా? ఈ చిట్కాలతో ఉపశమనం..-know remedies to control heavy bleeding during periods ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Heavy Bleeding: పీరియడ్స్ సమయంలో హెవీ బ్లీడింగ్ అవుతోందా? ఈ చిట్కాలతో ఉపశమనం..

Heavy bleeding: పీరియడ్స్ సమయంలో హెవీ బ్లీడింగ్ అవుతోందా? ఈ చిట్కాలతో ఉపశమనం..

Koutik Pranaya Sree HT Telugu
Jun 30, 2024 10:15 AM IST

Heavy bleeding: పీరియడ్స్ సమయంలో రక్తస్రావం వల్ల అలసట, ఇతర ఆరోగ్య సమస్యలు రావచ్చు. వాటి నుంచి ఉపశమనం ఇచ్చే కొన్ని చిట్కాలు తెల్సుకోండి.

అధిక రక్తస్రావం
అధిక రక్తస్రావం (Pexels)

పీరియడ్స్ సమయంలో అధిక రక్తస్రావం కొందరికి కొన్నిసార్లు, కొందరిలో ఎప్పుడూ అవుతుంది. దానివల్ల రోజూవారీ పనులు కూడా చేసుకోలేనంత అలసటగా ఉంటుంది. ఇది ఎక్కువ రోజులు అలాగే కొనసాగితే రక్తహీనత, అలసట, బలహీనత, శ్వాస సమస్య, మూడ్ స్వింగ్స, ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఈ సమస్య ఎక్కువైతే వైద్యుల్ని సంప్రదించడం మంచి మార్గం. కానీ మీకు కాస్త ఉపశమనం ఇచ్చే చిట్కాలు తెల్సుకోండి.

1. ఐరన్ ఉన్న ఆహారాలు:

అధిక రుతుస్రావం వల్ల రక్తహీనత, ఐరన్ లోపం ఏర్పడుతుంది. రోజువారీ ఆహారంలో ఇనుము అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చుకోవడం ద్వారా అధిక రక్తస్రావాన్ని నియంత్రించవచ్చు. ఆప్రికాట్, ఎండుద్రాక్ష, గుడ్లు, బీన్స్, వండిన పాలకూర, బ్రోకలీ, గింజలు, డ్రై ఫ్రూట్స్, టోఫు మొదలైన వాటిలో ఇనుము పుష్కలంగా ఉంటుంది.

2. ఆయుర్వేద చిట్కాలు:

అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీస్పాస్మోడిక్ గుణాలు ఉన్నాయి. ఇది నొప్పిని తగ్గిస్తుంది. సమయంలో రక్తం ఎక్కువ కోల్పోకుండా చూస్తుంది. తాజా అల్లం ముక్కను తురిమి ఐదు నుండి పది నిమిషాలు నీటిలో ఉడికించి అల్లం టీని తయారు చేయండి. దీన్ని వడకట్టుకుని మీ పీరియడ్స్ సమయంలో రోజుకు రెండు లేదా మూడు సార్లు తాగండి.

● దాల్చిన చెక్క, ధనియాలలో ఒక కప్పు నీటిని పోసి ఉడికించి అరకప్పు అయ్యే వరకు మరిగించాలి. కొద్దిగా పంచదార కలిపి, ఈ మిశ్రమాన్ని రోజుకు రెండుసార్లు తీసుకోవాలి.

● ఒక స్పూన్ తేనెలో చిటికెడు కుంకుమపువ్వు వేసుకుని తీసుకోవడం కూడా మంచి మార్గం.

● చింతపండు, తేనె, నీటితో పేస్ట్ తయారు చేసి తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. చింతపండులోని యాంటీఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి, తీవ్రమైన రక్తస్రావాన్ని తగ్గిస్తాయి.

● ఆపిల్ సైడర్ వెనిగర్ (ఎసివి) అనేది చాలా మంది మెచ్చే ఇంటి చికిత్స. అధిక రక్తస్రావం అవుతుంటే ఇది మంచి మందులా పనిచేస్తుంది. ఈ చిట్కాకు మీ శరీరాన్ని శుభ్రపరిచే, రక్త ప్రవాహాన్ని నియంత్రించే, అధిక రక్త స్రావాన్ని తగ్గించే సామర్థ్యం ఉంటుంది. అధిక రక్త స్రావంతో పాటూ ఇతర రుతుస్రావ లక్షణాల వల్ల వచ్చే అసౌకర్యాన్ని తగ్గించడానికి, రెండు టేబుల్ స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ ను నీటిలో కలిపి రోజుకు రెండు నుండి మూడు సార్లు త్రాగాలి.

3. హీటింగ్ ప్యాడ్:

హీటింగ్ ప్యాడ్స్ లేదా వేడినీటి వాటర్ బాటిల్స్ వల్ల పీరియడ్స్ సమయంలో పొత్తికడుపులో వచ్చే నొప్పి తగ్గించుకోవచ్చు. నొప్పి ఉన్న చోట హీటింగ్ ప్యాడ్ పెట్టడం వల్ల నొప్పి తగ్గుతుంది. అధిక రక్త స్రావం కాకుండానూ కాపాడుతుంది. గర్భాశయ కండరాలకు రక్త ప్రవాహాన్ని పెంచడంతో వేడి వల్ల నొప్పి తగ్గుతుంది. గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది.

4. నిద్ర:

రక్తస్రావం ఎక్కువగా అవుతుంటే పీరియడ్స్ సమయంలో తగినంత నిద్ర అవసరం. నిద్ర వల్ల హార్మోన్ల స్థాయులు నియంత్రణలోకి వస్తాయి. క్రమంగా బ్లీడింగ్ తగ్గుతుంది. సరిగ్గా నిద్ర పోవడం వల్ల మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈ సమయంలో వచ్చే నొప్పి, అలసటను భరించగలుగుతారు.

Whats_app_banner