Broccoli Recipe: బ్రోకలీ లెమన్ రైస్ రెసిపీ, పిల్లలకు బెస్ట్ హెల్తీ లంచ్ బాక్స్ వంటకం ఇది
Broccoli Recipe: బ్రోకలీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పిల్లలకు బ్రోకలీ లెమన్ రైస్ రెసిపీ పెట్టి చూడండి. వారికి ఎంతో ఆరోగ్యాన్ని అందిస్తుంది. దీన్ని చేయడం చాలా సులువు.
Broccoli Recipe: బ్రోకలీ రెసిపీలు తినడం చాలా అవసరం. కానీ వీటిని తినేవారి సంఖ్య తక్కువే. ఒకసారి బ్రోకలీ లెమన్ రైస్ రెసిపీ ప్రయత్నించి చూడండి. ఇది మీ పిల్లలకు నచ్చడం ఖాయం. నిమ్మ పులిహోర, వెజ్ రైస్, ఎగ్ రైస్ వంటివి తరచూ చేస్తూ ఉంటారు. వీటితో పాలూ బ్రోకలీ లెమన్ రైస్ కూడా వండుతూ ఉండండి. మిగతా రైస్ లతో పోలిస్తే బ్రోకలీ నిమ్మ రైస్ ఎంతో హెల్తీ.
బ్రోకలీ లెమన్ రైస్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
వండిన అన్నం - మూడు కప్పులు
బ్రోకలీ ముక్కలు - ఒక కప్పు
జీలకర్ర - ఒక స్పూను
వెల్లుల్లి రెబ్బలు - ఎనిమిది
పసుపు - అర స్పూను
నిమ్మరసం - మూడు స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
ఎండు మిర్చి - నాలుగు
ఉల్లిపాయ - ఒకటి
నూనె - రెండు స్పూన్లు
బ్రోకలీ లెమన్ రైస్ రెసిపీ
1. ముందుగానే అన్నాన్ని వండుకుని ఒక ప్లేటులో వేసి చల్లార్చుకోవాలి. అది పొడి పొడిలా ఉండేలా చేసుకోవాలి.
2. బ్రోకలీ ముక్కలను శుభ్రంగా నీటిలో కడిగి పక్కన పెట్టుకోవాలి. వాటిని చిన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
3. ఉల్లిపాయలు నిలువుగా తరిగి పక్కన పెట్టాలి. వెల్లుల్లిరెబ్బలు సన్నగా తరిగాలి.
4. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వెయ్యాలి. ఆ నూనె వేడెక్కాక జీలకర్ర వేసి వేయించాలి.
5. అందులో తరిగిన ఉల్లిపాయలు, వెల్లుల్లి వేసి వేయించాలి. ఎండు మిర్చి ముక్కలు వేసి వేయించాలి.
6. పసుపు పొడి, ఉప్పు వేసి కలుపుకోవాలి. బ్రోకలీ ముక్కలను కూడా వేసి వేయించుకోవాలి.
7. మూత పెట్టి చిన్న మంట మీద ఉడికించాలి. అవసరం అయితే రెండు మూడు స్పూన్ల నీళ్లు చల్లుకోవచ్చు.
8. బ్రోకలీ బాగా ఉడికాక స్టవ్ కట్టేయాలి. అందులోనే ముందుగా వండిన అన్నం వేసుకుని కలుపుకోవాలి. నిమ్మరసం చల్లుకుని మరోసారి కలుసుకోవాలి.
9. అంతే బ్రోకలీ లెమన్ రైస్ రెడీ అయినట్టే. ఇది హెల్తీ రెసిపీ.
బ్రోకలీ ఆరోగ్యానికి మంచిది. పిల్లలు తినిపించడం చాలా అవసరం. బ్రోకలీలో విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ ఎ, ఫాస్పరస్, కాల్షియం, జింక్ వంటివి ఉంటాయి. బ్రోకలీలో సల్ఫోరాఫేన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది అందరికీ అవసరం. ముఖ్యంగా కీళ్ల నొప్పులు ఉన్నవారు బ్రోకలీని తినడం చాలా అవసరం. నిమ్మరసంలో కూడా ఎన్నో ఆరోగ్య పోషకాలు ఉంటాయి. నిమ్మరసం తాగడం వల్ల బరువు త్వరగా తగ్గుతారు. మొటిమలు, చుండ్రు వంటివి కూడా రాకుండా ఉంటాయి. బరువు పెరగకుండా ఉంచడంలో నిమ్మరసం ఎంతో మేలు చేస్తుంది.