Cervical cancer: సర్వైకల్ క్యాన్సర్ మహిళల్లో ఎందుకు వస్తుంది? ఇది రాకుండా జాగ్రత్త పడడం ఎలా?-cervical cancer why does cervical cancer occur in women how to avoid this ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Cervical Cancer: సర్వైకల్ క్యాన్సర్ మహిళల్లో ఎందుకు వస్తుంది? ఇది రాకుండా జాగ్రత్త పడడం ఎలా?

Cervical cancer: సర్వైకల్ క్యాన్సర్ మహిళల్లో ఎందుకు వస్తుంది? ఇది రాకుండా జాగ్రత్త పడడం ఎలా?

Haritha Chappa HT Telugu
Feb 05, 2024 09:49 AM IST

Cervical cancer: గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ బారిన పడి బాలీవుడ్ నటి పూనమ్ పాండే మరణించింది. ఇప్పుడు మళ్లీ సర్వైకల్ క్యాన్సర్ గురించి చర్చలు మొదలయ్యాయి. ఇది మహిళల్లో ఎందుకు వస్తుంది? రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఒకసారి తెలుసుకుందాం.

సర్వైకల్ క్యాన్సర్ తో మరణించిన పూనమ్ పాండే
సర్వైకల్ క్యాన్సర్ తో మరణించిన పూనమ్ పాండే

Cervical cancer: బాలీవుడ్ నటి పూనమ్ పాండే సర్వైకల్ క్యాన్సర్ తో మరణించినట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏమిటో, మహిళలకు ఎందుకు వస్తుంది? దీన్ని రాకుండా అడ్డుకోవడం ఎలా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వంటి అంశాలను ప్రతి ఒక్క స్త్రీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సర్వైకల్ క్యాన్సర్ ను... గర్భవయ ముఖద్వార క్యాన్సర్ అని కూడా పిలుస్తారు. ఇది మహిళలకు మాత్రమే వస్తుంది. ఎందుకంటే గర్భాశయం కేవలం మహిళలకు మాత్రమే ఉంటుంది కాబట్టి. మొదట గర్భాశయం ఉపరితలంపై క్యాన్సర్ కణాల పెరుగుదల ప్రారంభమవుతుంది. తర్వాత గర్భాశయం ముఖ ద్వారంలోని కణాలు అసాధారణంగా పెరుగుతాయి. అక్కడ కణితుల్లా ఏర్పడి అవి క్యాన్సర్ గా మారుతాయి. క్యాన్సర్ రావడానికి ముఖ్యమైన కారణం ‘హ్యూమన్ పాపిల్లోమా వైరస్’. ఇది రాకుండా అడ్డుకోవాలంటే HPV టీకాను వేసుకోవాలి. గర్భశయ్య ముఖద్వార క్యాన్సర్ చాలా నెమ్మదిగా పెరిగి, ఎన్నో ఏళ్ల తర్వాత బయట పడుతుంది. అందుకే ఈ క్యాన్సర్ ముదిరిపోయాక గాని ఎవరూ గుర్తించలేరు. కొన్ని రకాల పరీక్షలు ముందుగానే చేయించుకుంటే ఈ క్యాన్సర్ ను ప్రాథమిక దశలోనే గుర్తించవచ్చు. దీని వల్ల చికిత్స సులభతరం అవుతుంది.

yearly horoscope entry point

సర్వైకల్ క్యాన్సర్ ఎవరికి వస్తుంది?

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ మహిళల్లో 35 ఏళ్ల నుంచి 44 ఏళ్ల మధ్య ఉన్న మహిళల్లో కనిపిస్తుంది. ఇప్పుడు 65 ఏళ్ల పైబడిన మహిళల్లో కూడా కొన్ని కేసులు బయటపడుతున్నాయి. వీటిలో రెండు రకాల క్యాన్సర్లు ఉన్నాయి. అడెనోకార్సినోమా, పొలుసుల కణ క్యాన్సర్ (Squamous cell carcinoma).

ఈ లక్షణాలు కనిపిస్తే...

లైంగిక ప్రక్రియలో పాల్గొన్న తర్వాత అసాధారణంగా రక్తస్రావం కనిపిస్తే జాగ్రత్తపడాలి. అలాగే మెనోపాజ్ దశ దాటిన వారిలో కూడా రక్తస్రావం కనిపించినా తేలిగ్గా తీసుకోకూడదు. నెలసరి అయిపోయాక మధ్యలో ఎప్పుడైనా అసాధారణంగా రక్తస్రావం అయితే వెంటనే వైద్యులను సంప్రదించాలి. మహిళల యోని నుంచి సాధారణం కంటే ఎక్కువగా స్రావాలు వెలువడుతున్నా, ఆ స్రావాలు దుర్గంధం వేస్తున్నా కూడా వెంటనే జాగ్రత్తపడాలి. తరచూ మూత్ర విసర్జనకు వెళ్లడం సర్వైకల్ క్యాన్సర్ లక్షణంగానే చెప్పుకుంటారు. మూత్ర విసర్జన చేస్తున్న సమయంలో నొప్పి కూడా వీరికి వస్తుంది. పొత్తికడుపు భాగంలో ఇబ్బందిగా అసౌకర్యంగా అనిపిస్తున్నా, ఒకసారి వైద్యుల్ని సంప్రదించి టెస్టులు చేయించుకోవడం చాలా అవసరం.

క్యాన్సర్ కొన్ని రకాల జన్యుపరమైన మార్పుల వల్ల కూడా అభివృద్ధి చెందుతుంది. డిఎన్ఏ మ్యుటేషన్ చెందడం వల్ల కణాలు అనియంత్రితంగా పెరిగిపోతాయి. ఆ కణాలు పోగు పడి పుండ్లుగా మరి క్యాన్సర్ కు దారితీస్తాయి. ఈ క్యాన్సర్ కణాలు పక్క అవయవాలకు సోకి అక్కడ పెరుగుతాయి.

బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ ఉన్నవారిలో త్వరగా గర్భాశయ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ధూమపానం చేస్తున్న వారికి క్యాన్సర్లు వచ్చే అవకాశం ఎక్కువ. గర్భనిరోధక మాత్రలు ఎక్కువ కాలం వినియోగించినా ఈ సమస్య రావచ్చు. అలాగే లైంగికంగా సంక్రమించే వ్యాధులైన క్లామిడియా, గోనేరియా, సిఫిలిస్ వంటివన్నీ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని పెంచుతాయి. మీ కుటుంబంలో ఎవరికైనా ఈ క్యాన్సర్ ఉంటే వారి వారసులకు వచ్చే అవకాశం ఎక్కువ. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

క్యాన్సర్ వచ్చాక శాస్త్ర చికిత్స ద్వారా క్యాన్సర్ సోకిన ప్రాంతాన్ని వైద్యులు తొలగిస్తారు. అలాగే రేడియేషన్ థెరపీని, కీమోథెరపీని కూడా అందిస్తారు. రేడియేషన్ థెరపీలో క్యాన్సర్ కణాలను నాశనం చేయడానికి వీలవుతుంది. అధిక శక్తి ఉండే ఎక్స్ కిరణాలు లేదా రేడియేషన్ కిరణాలను ఉపయోగించి ఆ క్యాన్సర్ కణాలను నశించేలా చేస్తారు. అలాగే కీమోథెరపీలో కూడా క్యాన్సర్ కణాలను నిర్మూలిస్తారు.

ప్రపంచంలో మహిళల్లో వస్తున్న క్యాన్సర్లలో గర్భాశయ క్యాన్సర్ రెండో స్థానంలో ఉంది. ఏటా ఈ క్యాన్సర్ వల్ల రెండు లక్షల మంది మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రస్తుతం మన దేశంలో 36 కోట్ల మంది 15 ఏళ్లు వయసు దాటిన మహిళలు ఉన్నారు. వీరికి గర్భాశయ క్యాన్సర్ ఎప్పుడైనా రావచ్చు. ప్రస్తుతం మన దేశంలో దాదాపు ఏటా లక్షా ముప్పై రెండు వేల కొత్త గర్భాశయ కాన్సర్ కేసులు నిర్ధారణ అవుతున్నాయి. వీరిలో 74,000 మంది మరణిస్తున్నారు. ఆడపిల్లలకు 9 సంవత్సరాలు నిండిన తర్వాత 12 సంవత్సరాల లోపు గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ రాకుండా అడ్డుకునే HPV టీకాను వేయించడం చాలా మంచిది.

Whats_app_banner