Stomach Cancer: ఇళయరాజా కూతురు భవతారిణి కొన్నేళ్లుగా పొట్ట క్యాన్సర్ తో ఇబ్బంది పడుతున్నారు. ఆమె శ్రీలంకలో చికిత్స తీసుకోవడానికి వెళ్లి అక్కడే హఠాత్తుగా మరణించారు. ఆమె అకాల మరణం తమిళ సంగీత ప్రపంచంలో తీరని లోటుగా మారింది. ఆమె ఎన్నో సంవత్సరాలుగా పొట్ట క్యాన్సర్ తో బాధపడుతున్నట్టు అక్కడ మీడియా కథనాలు చెబుతున్నాయి. అసలు ఈ పొట్ట క్యాన్సర్ ఎందుకు వస్తుంది? ఎలాంటి లక్షణాలను చూపిస్తోంది? అనే విషయాలను వైద్యులు వివరిస్తున్నారు.
పొట్ట క్యాన్సర్‌ను గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అని కూడా పిలుస్తారు. ఇది పొట్టలోని ఏ భాగాన్ని అయినా ప్రభావితం చేయొచ్చు. అంటే అర్థం.. పొట్టలోని ఏ భాగానికైనా రావచ్చు. పొట్ట లైనింగ్లో క్యాన్సర్ కణాలు ఏర్పడి కణితులుగా మారుతాయి. ఇవి నియంత్రణ లేకుండా పెరిగి పక్క అవయవాలకు కూడా సోకుతాయి. పొట్ట క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తించకపోతే కాలేయం, ఊపిరితిత్తులు, ఎముకలు వంటి శరీరంలోని ఇతర వాటికి వ్యాపించి ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంది.
పొట్ట క్యాన్సర్‌ను గుర్తించడానికి ముందే కొన్ని సంవత్సరాల ముందు కణాలు నెమ్మదిగా పెరుగుతూ ఉంటాయి. ఇవి చాలా తక్కువ లక్షణాలను చూపిస్తాయి. అందుకే ఎక్కువ మంది గుర్తించలేక పోతారు. పొట్టలో క్యాన్సర్ కణితులు పెరిగాక కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి .
గుండెల్లో మంటగా అనిపించడం, ఆకలి వేయకపోవడం, తిన్నా కూడా అరగకపోవడం, పొట్ట నొప్పి తరచూ రావడం, మలంలో రక్తం కనిపించడం, బరువు హఠాత్తుగా తగ్గిపోవడం, ఏదైనా ఆహారం మింగినప్పుడు ఇబ్బందిగా అనిపించడం, పొట్ట ప్రాంతంలో వాపు రావడం, చర్మం, కళ్ళు పసుపు రంగులోకి మారడం, వాంతులు కావడం వంటివన్నీ పొట్ట క్యాన్సర్ లక్షణాలుగా చెబుతున్నారు. వైద్యులు ఈ లక్షణాలు కనిపిస్తే తేలిగ్గా తీసుకోకూడదని వివరిస్తున్నారు.
పొట్ట క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచే కొన్ని పనులు ఉన్నాయి. వాటిని మానుకోవడం చాలా ముఖ్యంగా బరువు అధికంగా పెరిగితే పొట్ట క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగుతుంది. అలాగే ఇది వారసత్వంగా వచ్చే అవకాశం ఉంది. ఉప్పు అధికంగా ఉన్న ఆహారాన్ని తినడం, మంటపై కాల్చిన ఆహారాన్ని తినడం వల్ల పొట్ట క్యాన్సర్ రావచ్చు. పండ్లు, తాజా కూరగాయలు చాలా తక్కువగా తినేవారిలో కూడా ఇది వచ్చే అవకాశం ఉంది. అలాగే కొన్ని అంటువ్యాధుల వల్ల కూడా ఇది వస్తుంది. ధూమపానం ప్రతిరోజే చేసే వారిలో పొట్ట క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది టైప్ ఏ బ్లడ్ గ్రూప్ కలిగి ఉన్నవారికి ఎక్కువగా రావచ్చని పరిశోధనలు చెబుతున్నాయి.
క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే బరువు పెరగకుండా చూసుకోవాలి. అలాగే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలి. ఉప్పు తక్కువగా తినాలి. ధూమపానం వంటివి వదిలేయాలి. తాజా పండ్లు, ఆకుకూరలని అధికంగా తినాలి. పొట్ట క్యాన్సర్ నాలుగో దశకు చేరుకుంటే చికిత్స చేయడం చాలా కష్టం. కానీ ఒకటి, రెండు, మూడు దశల్లో కొంతవరకు చికిత్స చేసి రోగి ప్రాణాన్ని కొన్ని ఏళ్లపాటు నిలబెట్టవచ్చు.
టాపిక్