Karthika deepam season 1: కార్తీకదీపం సీరియల్ సీజన్ 1 రివ్యూ.. డాక్టర్ బాబు ప్రేమ కోసం తపించిన వంటలక్క-star maa famous serial karthika deepam season 1 overall review with one click ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Star Maa Famous Serial Karthika Deepam Season 1 Overall Review With One Click

Karthika deepam season 1: కార్తీకదీపం సీరియల్ సీజన్ 1 రివ్యూ.. డాక్టర్ బాబు ప్రేమ కోసం తపించిన వంటలక్క

Gunti Soundarya HT Telugu
Mar 23, 2024 04:39 PM IST

Karthika deepam season 1 review: సుమారు ఆరు సంవత్సరాల పాటు కొనసాగిన సీరియల్ కార్తీకదీపం. స్టార్ మాలో ప్రసారమైన ఈ సీరియల్ ఎన్నో రికార్డులను సృష్టించింది. సోమవారం నుంచి ఈ సీరియల్ సీజన్ 2 ప్రారంభం కాబోతుంది.

కార్తీకదీపం సీరియల్ సీజన్ 1 రివ్యూ
కార్తీకదీపం సీరియల్ సీజన్ 1 రివ్యూ

Karthika deepam serial season 1 review: ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం… అంటూ ఎన్నో రికార్డులు సృష్టించింది కార్తీకదీపం సీరియల్. స్టార్ మాలో సుమారు ఆరు సంవత్సరాల పాటు ప్రసారమైంది. సాయంత్రం 7.30 అయ్యింది అంటే చాలు ఏ ఇంట్లో చూసినా కార్తీకదీపం సీరియల్ వినిపిస్తుంది.

ఆడవాళ్లే కాదు మగవాళ్ళు కూడా ఈ సీరియల్ కి అభిమానులు అయిపోయారు. అప్పట్లో అత్యధిక టీఆర్పీ రేటింగ్ తో ఈ సీరియల్ దూసుకుపోయింది. కార్తీక్, దీప ఎప్పుడు కలుస్తారా? అని అందరూ ఆశగా ఎదురుచూశారు. అంతగా అందరినీ మెప్పించిన ఏ సీరియల్ రెండో సీజన్ మార్చి 25, సోమవారం నుంచి ప్రారంభం కాబోతోంది.

సరికొత్త కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సీరియల్ కి సంబంధించిన రెండు ప్రోమోలు విడుదల అయ్యాయి. సినిమా రిలీజ్ కి ముందు నిర్వహించినట్టు సీరియల్ కి కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. అంతగా ఈ సీరియల్ కోసం ఎదురుచూసేందుకు అసలు దీని కథ కమామీషు ఏంటో తెలుసుకుందాం. కొత్తగా వస్తున్న కార్తీకదీపం చూసే వారికి పాత కార్తీకదీపంలో ఏం జరిగిందో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందా? అయితే ఈ రివ్యూ చదివేయండి.

కార్తీక్ అంటే తెలియదేమో కానీ డాక్టర్ బాబు అంటే మాత్రం ప్రతిఒక్కరికీ తెలుస్తుంది. ఒకానొక సమయంలో డాక్టర్ బాబు, వంటలక్క అనేవి సోషల్ మీడియాని షేక్ చేశాయి. ఈ రెండు పేర్లు అప్పట్లో సోషల్ మీడియాలో విపరీతమైన ట్రెండింగ్ గా నిలిచాయి. ప్రేమి విశ్వనాథ్ అంటే ఎవరికీ తెలియదు కానీ వంతలక్క అంటే మాత్రం గుర్తు పట్టేస్తారు. దీప అలియాస్ వంటలక్కగా పేరు సంపాదించి ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది ప్రేమి విశ్వనాథ్.

కార్తీకదీపం రివ్యూ..

దీప తండ్రిది మధ్య తరగతి కుటుంబం. తల్లి చనిపోవడంతో ఆమె తండ్రి మరో వివాహం చేసుకుంటాడు. సవతి తల్లి దీపని కష్టాలు పెడుతూ ఉంటుంది. నల్లగా ఉండటం వల్ల అందవిహీనంగా ఉన్నావంటూ అవమానించేది. తన కూతురు పరిస్థితి చూసి చెల్లించిపోవడం తప్ప భార్యకు ఎదురుచెప్పలేని నిస్సహాయ తండ్రిగా మిగిలిపోయాడు.

కార్తీక్ కార్డియాలజిస్ట్. సంపన్న కుటుంబానికి చెందిన సౌందర్య పెద్ద కుమారుడు. తన స్టేటస్ కి తగినట్టుగా అందమైన, డబ్బున్న కోడలిని తీసుకొచ్చుకోవాలని అనుకుంటుంది. అందంగా లేకపోతే వారి వైపు కన్నెత్తి కూడా చూడదు. కార్తీక్ స్నేహితురాలు మోనిత. కార్తీక్ అంటే పిచ్చి ప్రేమతో తను ప్రేమించిన అమ్మాయి హిమని యాక్సిడెంట్ చేయించి చంపేస్తుంది. ఆ యాక్సిడెంట్లో కార్తీక్ కూడా గాయపడతాడు. అయితే దీని పావుగా వాడుకొని కార్తీక్ కి దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తుంది. యాక్సిడెంట్ వల్ల కార్తీక్ పిల్లలు పుట్టే అవకాశం లేదని డాక్టర్స్ తో అబద్ధం చెప్పిస్తుంది. అది నిజమేనని కార్తీక్ నమ్ముతాడు. తన వల్ల ఏ అమ్మాయి నష్టపోకూడదని భావించి జీవితంలో పెళ్లి చేసుకోకూడదని అనుకుంటాడు.

దీపని తొలిసారి చూసిన కార్తీక్

దీప నల్లగా ఉండటం వల్ల ఎవరు పెళ్లి చేసుకునేందుకు ముందుకు రారు. ఒకసారి దీపని కార్తీక్ చూస్తాడు. దీప తండ్రి తన కూతురికి పెళ్లి కావడం లేదని నల్లగా ఉందని తన బాధని మొత్తం కార్తీక్ కి చెప్పుకుని బాధపడతాడు. అది విన్న కార్తీక్ తన కూతుర్ని పెళ్లి చేసుకుంటానని చెప్తాడు. అయితే తనకి ఈ జన్మలో పిల్లలు పుట్టే అవకాశం లేదని ఈ విషయం దీపకి చెప్పిన తర్వాత ఆమె ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానని అంటాడు. తన కూతురు జీవితం బాగుపడుతుందని కష్టాలు లేకుండా ఉంటుందని ఆశతో దీప తండ్రి ఆమె దగ్గర నిజం దాచి కార్తీక్ తో పెళ్లి చేస్తాడు.

అందవిహీనురాలైన కోడల్ని ఇంటికి తీసుకొచ్చినందుకు సౌందర్య దీపని దూరం పెడుతుంది. తనని నానా మాటలు అంటూ చీదరించుకుంటుంది. తనను పెళ్లి చేసుకోవాలనుకున్న కార్తీక్ మరొకరిని పెళ్లి చేసుకోవడం చూసి దీప చెల్లెలు శ్రావణి అసూయ పెంచుకుంటుంది. ఎలాగైనా సౌందర్య ఇంటి కోడలు అయి కార్తీక్ ని సొంతం చేసుకోవాలని అనుకుంటుంది. అందులో భాగంగా కార్తీక్ తమ్ముడిని పెళ్లి చేసుకుంటుంది.

కార్తీక మనసులో అనుమానం  

దీపని ఇంట్లో నుంచి పంపించేసి తను కార్తీక్ కి దగ్గర అవాలని ప్లాన్స్ వేస్తుంది. మోనిత కూడా రంగంలోకి దిగుతుంది. కానీ శ్రావణిని కార్తీక్ తమ్ముడు ప్రాణంగా ప్రేమిస్తాడు. తప్పు తెలుసుకున్న శ్రావణి బుద్ధిగా మారిపోతుంది. కానీ మోనిత మాత్రం దీప మీద పగ పెంచుకుని ఎలాగైనా కార్తీక్ కి దూరం చేయాలని చూస్తుంది.

దీపకు కవితలు అంటే చాలా ఇష్టం. ఒకసారి కార్తీక్, దీప హనీమూన్ కి వేరే ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక కవి పరిచయం అవుతాడు. వాళ్ళని మోనిత ఫాలో అవుతుంది. కవిని అన్నయ్య అని పిలుస్తూ దీప మాట్లాడుతుంది. కవితో నవ్వుతూ దీప మాట్లాడటం చూసి కార్తీక్ ఆర్థిక అపార్థం చేసుకుంటాడు. అది గమనించిన మోనిత కుట్ర పన్నుతుంది. దీప, కవికి ఆక్రమ సంబంధం అంటగట్టి వారి మధ్య చిచ్చు పెడుతుంది.

కార్తీక్ మనసులో మోనిత దీప గురించి లేనిపోనివి చెప్పి విషబీజాన్ని నాటుతుంది. తన మాటలు నమ్మిన కార్తీక్ దీపని దూరం పెడుతూ ఉంటాడు. దీప మంచితనం తెలుసుకుని సౌందర్య కూడా తన పట్ల ఉన్న అభిప్రాయాన్ని మార్చుకుని కోడలిగా అంగీకరిస్తుంది. సరిగ్గా ఒకరోజు దీప గర్భవతి అని తెలుస్తుంది. ఆ విషయం సంతోషంగా కార్తీక్ కి చెప్తుంది. తనకి పిల్లలు పుట్టే అవకాశం లేనప్పుడు దీప గర్భవతి ఎలా అయ్యిందని మోనితతో తన బాధని పంచుకుంటాడు. కవి వల్ల దీప కడుపు తెచ్చుకుందని మనసులో అనుమానం నింపుతుంది. అది నిజమని కార్తీక్ నమ్ముతాడు.

దీప కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రిని నేను కాదు 

దీప కడుపులో పెరుగుతున్న బిడ్డకు తను తండ్రిని కాదని గట్టిగా అరిచి అందరి ముందు చెప్తాడు. దీప మంచితనాన్ని అర్థం చేసుకున్న సౌందర్య మాత్రం దీప అటువంటిది కాదని తనని అపార్థం చేసుకోవద్దని చెప్తుంది. ఆత్మగౌరవం, నమ్మకం లేని ఇంట్లో తాను ఉండలేనని చెప్పి దీప అత్తింటి నుంచి అడుగు బయట పెడుతుంది. అప్పటి నుంచి తనకు కష్టాలు మొదలవుతాయి.

జీవనం సాగించడం కోసం తనకు వచ్చిన వంటతోనే పనులు చేసుకుంటూ బతుకుతుంది. అలా దీప కాస్త వంటలక్కగా మారిపోతుంది. నెలలు నిండిన దీప ఇద్దరు పండంటి ఆడపిల్లలకు జన్మనిస్తుంది. అయితే ఆ విషయం సౌందర్యకి తెలియడంతో బిడ్డలు ద్వారా అయినా గాని కార్తీక్, దీపలను కలపాలని భావిస్తుంది. దీపకి పుట్టిన కవల పిల్లల్లో ఒకరు అందంగా పుడితే మరొకరు నల్లగా పుడతారు. నల్లగా ఉందని దీపని ద్వేషించుకున్నాను అందుకు పశ్చాత్తాపంగా నలుపుగా ఉన్న బిడ్డని తీసుకెళ్ళి కార్తీక్ దగ్గర పెంచాలని సౌందర్య పురిట్లో బిడ్డని తీసుకెళ్లిపోతుంది. ఆ విషయం దీపకు తెలియదు.

కార్తీక్ దగ్గరకి చేరిన దీప బిడ్డ 

తండ్రి దగ్గర ఒకరు, తల్లి దగ్గర మరొకరు పెరుగుతారు. ఆ బిడ్డతోనే దీప, కార్తీక్ ని ఒక్కటి చేయాలని అనుకుంటుంది. అనాథ పిల్లని దత్తత తీసుకొచ్చానని చెప్పి బిడ్డని కార్తీక్ చేతిలో పెడుతుంది. తనకి కార్తీక్ హిమ అని పేరు పెడతాడు. కార్తీక్ తన దగ్గర ఉన్న పాపని చాలా ప్రేమగా పెంచుకుంటాడు. దీప మీద అనుమానం కలిగించిన కూడా కార్తీక్ ని తన సొంతం చేసుకోలేకపోతున్నాను అని మోనిత రగిలిపోతూ ఉంటుంది. ఎలాగైనా తనను పెళ్లి చేసుకోవాలని ప్లాన్స్ వేస్తోంది. అటు దీప కార్తీక్ కి దగ్గర కాకుండా అబద్ధాలు చెప్తుంది. దీపని దూరం చేసినా కూడా కార్తీక్ ని పెళ్లి చేసుకోలేకపోతున్నానని రగిలిపోతుంది.

హిమ చదువుతున్న స్కూల్లోనే దీప దగ్గర పెరుగుతున్న శౌర్య కూడా చదువుతుంది. అలా హిమ, శౌర్య కూడా కలుస్తారు. శౌర్య కార్తీక్ కి దగ్గర అవుతుంది. తనలో తండ్రిని చూసుకుంటుంది. రౌడీ బేబీ అని కార్తీక్ శౌర్యని ముద్దుగా పిలుచుకుంటాడు. హిమ చదువుతున్న స్కూల్ లో దీప టీచర్స్ కి వంట చేసి బాక్స్ అందిస్తుంది. అలా దీపకు హిమ పరిచయం అవుతుంది. తన పేరు వంటలక్కగా పరిచయం చేసుకుంటుంది. ఒకరోజు కార్తీక్ దగ్గర పెరుగుతున్న హిమ దీప కూతురనే నిజం కార్తీక్ తెలిసిపోతుంది. అటు దీపకు కూడా ఇదే నిజం తెలియజేయడంతో సౌందర్యం నిలదీస్తుంది. మీ ఇద్దరినీ కలపడం కోసమే ఈ పని చేశానని చెప్పడంతో దీప వెంటనే తన కూతురిని దగ్గరికి తీసుకొని హత్తుకుంటుంది.

మోనిత కుట్రలు తెలుసుకున్న దీప 

హిమ పుట్టినరోజు నాడు తనకి ఇష్టమైన వంట చేయాలని చెప్పి సౌందర్య దీపని ఇంటికి తీసుకొస్తుంది. అప్పుడే దీప కార్తీక్ కంట పడుతుంది. కార్తీక్ కూడా హిమ దీప కూతురు అనే నిజం తెలిసిపోతుంది. కానీ తను పెంచుకున్న ప్రేమ వల్ల హిమని వదులుకోలేకపోతాడు. ఆ ఇద్దరు పిల్లలు కవి వల్ల పుట్టిన వాళ్లేనని తనకి పుట్టిన వాళ్ళు కాదని కార్తీక్ నమ్ముతాడు. ఈ సమయంలో మోనిత దీప గురించి మరిన్నికట్టు కథలు కల్పించి కార్తీక్ ని నమ్మించేలా చేస్తుంది. దీంతో కార్తీక్ దీప మీద పూర్తిగా ద్వేషం పెంచుకుంటాడు. తాము విడిపోవడానికి కారణం మోనిత అని తెలుసుకున్న దీప ఎలాగైనా తనకి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంటుంది. తన తప్పు లేదని హిమని చంపింది కూడా మోనిత అనే విషయాలు కార్తీక్ తెలిసేలా చేయాలని ప్రయత్నిస్తుంది.

దీప మళ్ళీ నీ జీవితంలోకి రాకుండా ఉండాలంటే తనని పెళ్లి చేసుకోవాలని మోనిత కార్తీక్ మనసు మారుస్తుంది. సరిగ్గా తాళి కట్టే సమయానికి సౌందర్య వచ్చి పెళ్లి ఆపుతుంది. కార్తీక్ ని తనతో పాటు తీసుకెళ్తుంది. మొదటి నుంచి సౌందర్యకు మోనిత అంటే ఇష్టం ఉండదు. తన నిజస్వరూపం గురించి సౌందర్య ఎన్ని సార్లు చెప్పినా కార్తీక్ నమ్మడు. అత్తగా కాకుండా అమ్మగా మారి దీపకు అండగా నిలుస్తుంది. ఎలాగైనా కొడుకు కోడల్ని ఒకటి చేయాలని తాపత్రయపడుతూ ఉంటారు. శౌర్యకి కూడా తన తండ్రి కార్తీక్ అనే విషయం తెలిసిపోతుంది.

కార్తీక్ ని బ్లాక్ మెయిల్ చేసిన మోనిత 

కార్తీక్, దీపని విడగొట్టేందుకు మోనిత ఎత్తులు వేస్తుంటే వాటిని దీప తిప్పికొడుతూ ఉంటుంది. ఒకరోజు కార్తీక్ కి బాగా తాగించి తన గదిలో పడుకోబెడుతుంది. తాగిన మైకంలో కార్తీక్ తనని పాడు చేశాడని అందరినీ నమ్మిస్తుంది. తన జీవితం నాశనం చేసినందుకు పెళ్లి చేసుకోవాలని బ్లాక్ మెయిల్ చేస్తుంది. అప్పుడే మోనిత నిజస్వరూపం కార్తీక్ కి తెలుస్తుంది. కార్తీక్ మీద నిందలు పడేలా అబద్ధపు సాక్ష్యాలు సృష్టిస్తుంది. రంగంలోకి దిగిన దీప కార్తీక్ ఏ తప్పు చేయలేదని నిరూపిస్తుంది. దీంతో పోలీసులు మోనితను అరెస్ట్ చేస్తారు.

మోనిత చెప్పుడు మాటలు విని నిప్పు లాంటి భార్యని దూరం పెట్టానని కార్తీక్ తప్పు తెలుసుకుని తనని దగ్గరకు తీసుకుంటాడు. పిల్లలని దగ్గరకు తీసుకుంటాడు. నలుగురు సంతోషంగా పిక్నిక్ కి వెళతారు. అక్కడ సరదాగా హిమ కారు డ్రైవ్ చేస్తానని చెప్తుంది. దీప వద్దని చెప్పినా కూడా వినకుండా కారు స్టార్ట్ అవుతుంది. కారు బ్రేకులు ఫెయిల్ అవడంతో కార్తీక్ వాళ్ళని కాపాడటం కోసం వెళతాడు. కారులో ఉన్న హిమని తప్పించేస్తాడు. కార్తీక్, దీప ఉన్న కారు లోయలో పడిపోతుంది. ప్రమాదంలో కార్తీక్ దీప చనిపోయారని అందరూ అనుకుంటారు. హిమ వల్లే తనకి తల్లిదండ్రులు దూరం అయ్యారని శౌర్య చెల్లెలి మీద పగ పెంచుకుంటుంది. తనతో కలిసి ఉండలేనని శౌర్య ఇల్లు విడిచి వెళ్ళిపోతుంది. అలా శౌర్య ఒక భార్యాభర్తల ఇంటికి చేరుతుంది. వాళ్ళకి పిల్లలు లేకపోవడంతో శౌర్యని దత్తత తీసుకుని పెంచుకుంటారు.

పెద్దవాళ్ళైన హిమ, శౌర్య 

హిమ సౌందర్య దగ్గరికి చేరుతుంది. తన తల్లిదండ్రులు చనిపోలేదని శౌర్య నమ్ముతుంది. వారి కోసం వెతుకుతుంది. కారు ప్రమాదం వల్ల దీప, కార్తీక్ మళ్ళీ విడిపోతారు. కార్తీక్ చనిపోయాడని దీప అనుకుంటుంది. పిల్లలు దూరం అయ్యారని బాధపడుతుంది. కట్ చేస్తే హిమ, శౌర్య పెరిగి పెద్దవాళ్ళు అవుతారు. హిమ డాక్టర్ అయితే శౌర్య రౌడీ బేబీగా ఆటో నడుపుతుంది. హిమ బావని శౌర్య ప్రేమిస్తుంది. ఈ విషయం హిమకి తెలియడంతో అక్క కోసం తన ప్రేమని త్యాగం చేయాలని అనుకుంటుంది. సరిగ్గా అప్పుడే దీప హాస్పిటల్ లో కళ్ళు తెరుస్తుంది. డాక్టర్ బాబు అంటూ అంతా వెతుకుతుంది. దీపకి ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ తనకి అండగా నిలుస్తాడు.

మళ్ళీ తెరమీదకు వచ్చిన డాక్టర్ బాబు, దీప 

సరిగ్గా పెళ్లి జరిగే సమయంలో దీప దగ్గర ఉండే వారణాసి వచ్చి దీప బతికే ఉందని చెప్తాడు. అలా దీప, కార్తీక్ మళ్ళీ కొన్నేళ్ళ తర్వాత కనిపిస్తారు. అక్కడి నుంచి చిన్నప్పటి శౌర్య, హిమ క్యారెక్టర్లు చూపిస్తారు. ప్రమాదంలో గాయపడిన దీపని డాక్టర్ సేవ్ చేసి తనకి అండగా ఉంటాడు. అయితే దీప ఉంటున్న ఊరిలోనే శౌర్య కూడా ఉంటుంది. అటు కార్తీక్ ని మోనిత కాపాడుతుంది. కార్తీక్ బతికే ఉన్న విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడుతుంది. తన భార్యగా కార్తీక్ ని నమ్మిస్తుంది. మనకి ఒక బిడ్డ కూడా ఉన్నాడని చెప్పి కార్తీక్ కి గతం గుర్తు రాకుండా చూసుకుంటుంది.

కార్తీక్, మోనిత ఉంటున్న ఊర్లోనే దీప కూడా ఉంటుంది. ఒకరోజు కార్తీక్ దీప కంటపడుతుంది. డాక్టర్ బాబు మీరు బతికే ఉన్నారా అని దీప సంతోషంగా ఉంటుంది. కానీ గతం మర్చిపోవడంతో దీపని కార్తీక్ గుర్తుపట్టలేక పోతాడు. మోనిత చెర నుంచి ఎలాగైనా కార్తీక్ ని కాపాడాలని, తనకి గతం గుర్తుకు వచ్చేలా చేయాలని దీప ప్రయత్నిస్తుంది. ఎట్టకేలకు ఒకరోజు కార్తీక్ కి గతం గుర్తుకు వస్తుంది కానీ మోనిత వల్ల దీపకి హాని జరుగుతుందని భయపడి నిజం దాస్తాడు.

మోనిత మళ్ళీ అరెస్ట్.. ప్రమాదంలో దీప 

కార్తీక్ ప్రవర్తనతో అనుమానించిన మోనితకి విషయం అర్థం అయిపోతుంది. అదే టైమ్ కి దీప ఆరోగ్యం చెడిపోతుంది. ఆపరేషన్ చేస్తే కానీ దీప బతకదని నిజం తెలిసి కార్తీక్ గుండె పగిలిపోతుంది. దీప ఎప్పటికీ పొగ దగ్గర ఉండకూడదని వంట చేయకూడదని డాక్టర్ చెప్పడంతో కార్తీక్ తనని జాగ్రత్తగా చూసుకుంటాడు. అప్పుడే తనకి గతం గుర్తుకు వచ్చిందని కార్తీక్ నిజం బయట పెడతాడు. మోనిత చేసిన కుట్రలను బయట పెట్టి పోలీసులుతో అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తారు. సౌందర్య వచ్చి దీప వాళ్ళని కలిసి ఇంటికి తీసుకెళ్తుంది. 

కొత్త జీవితం ప్రారంభించాలని దీప, కార్తీక్ అనుకుంటారు. దీప ఆరోగ్య పరిస్థితి బాగోలేదని తెలుసుకున్న కార్తీక్ కుమిలిపోతాడు. ఇన్నాళ్ళూ దూరంగా ఉన్న దీపని కొన్ని రోజులైనా సంతోషంగా ఉంచాలని తాపత్రయ పడతాడు. మళ్ళీ అందరూ కలుసుకుంటారు. సౌందర్య ఇంటికి చేరుకుంటారు. దీప ఆరోగ్య పరిస్థితి గురించి ఇంట్లో అందరికీ తెలిసిపోతుంది. జైలు నుంచి బయటకి వచ్చిన మోనిత కార్తీక్ వెంట పడుతుంది. దీప ఆరోగ్య పరిస్థితిని అడ్డం పెట్టుకుని హిమని తనవైపుకు తిప్పుకుంటుంది.

హిమని గుప్పిట్లో పెట్టుకున్న మోనిత 

దీప ప్రాణాపాయ స్థితిలో ఉందని తనని బతికించుకోవడం కోసం కార్తీక్ ప్రయత్నించడం లేదని హిమకు లేనిపోని మాటలు చెప్తుంది. అవన్నీ నిజమని నమ్మిన హిమ ఇంట్లో నుంచి వెళ్ళిపోయి మోనిత ఇంటికి చేరుతుంది. తనని అడ్డం పెట్టుకుని కార్తీక్ ని సొంతం చేసుకోవాలని అనుకుంటుంది. దీప ఎన్ని చెప్పినా కూడా హిమ మాత్రం మోనిత మాటలు నమ్ముతుంది.

మోనిత ఇంట్లో హిమ ఉందని తెలుసుకున్న దీప ఎలాగైనా కూతురిని కాపాడుకోవాలని అనుకుంటుంది. తనకి దక్కని కార్తీక్ ఎవరికి దక్కడానికి వీల్లేదని మోనిత బాంబ్ తెచ్చి ఇంట్లో పెట్టుకుంది. కార్తీక్, దీప వస్తే గన్ తో దీపని షూట్ చేసి చంపేయాలని అనుకుంటుంది. కానీ దీప మోనిత చేతిలోని గన్ లాగేసుకుని తనకే ఎక్కుపెడుతుంది. దీప పిల్లలని సౌందర్యకు ఇచ్చి పంపించేసి డాక్టర్ బాబుని కూడా వెళ్లిపొమ్మని చెప్తుంది. కానీ కార్తీక్ మాత్రం సౌందర్య వాళ్ళని పంపించి దీపని మోనిత ఏమైనా చేస్తుందని భయపడి ఆగిపోతాడు. సరిగా ఇంట్లోకి వెళ్ళే టైమ్ కి గన్ షూట్ అయిన సౌండ్ వినిపిస్తుంది.

మోనిత డెడ్.. సీరియల్ కి ఎండ్ కార్డ్ 

దీపా అని అరుస్తూ కార్తీక్ ఇంట్లోకి పరుగులు పెడతాడు. అప్పుడే మోనిత ఫిక్స్ చేసిన టైమ్ బాంబ్ పేలిపోతుంది. అందరూ ఈ ప్రమాదంలో దీప, కార్తీక్, మోనిత చనిపోయారని అనుకుంటారు. కానీ కార్తీక్ దీప క్షేమంగా బయటపడతారు. ఇద్దరూ ప్రశాంతమైన జీవితం గడపాలి అనుకుని చీకట్లో నడుచుకుంటూ వెళ్లిపోతారు. అలా కార్తీకదీపం సీరియల్ ముగిసింది. త్వరలోనే మళ్ళీ కలుద్దాం అంటూ శుభం కార్డు వేశారు.

సీజన్ 2 ఎప్పుడంటే..

సరికొత్త కథాంశంతో కార్తీకదీపం సీజన్ 2 మొదలు కాబోతుంది. సోమవారం మార్చి 25 నుంచి రాత్రి 8 గంటలకు స్టార్ మా,లో ప్రసారం కాబోతుంది. దీప మళ్ళీ వంటలక్క అవతారం ఎత్తింది. విచిత్రం ఏమిటంటే శౌర్య మళ్ళీ చిన్న పిల్లగా చూపించారు. తన తండ్రి ఎవరో తెలియక శౌర్య బాధపడుతుంది. కార్తీక్, దీప పరిచయం లేనివాళ్ళగా చూపిస్తారు.

IPL_Entry_Point