Bigg Boss 7 Telugu: కార్తీక దీపం మోనితలా మారిన శోభా శెట్టి.. నీ నాన్న కింగా అంటూ
Bigg Boss 7 Telugu Promo: బిగ్ బాస్ తెలుగు 7వ సీజన్ మొదటి రోజు నుంచే రసవత్తరంగా సాగనుందని ఇంటి సభ్యులు ప్రవర్తనను బట్టి చెప్పేయొచ్చు. నామినేషన్స్ ద్వారా రాజుకున్న నిప్పు మరింతగా దహించేలా ఉంది. తాజాగా బిగ్ బాస్ తెలుగు 7 సెప్టెంబర్ 5 ప్రోమోను రిలీజ్ చేశారు.
Bigg Boss Telugu 7 Day 2 Promo: బిగ్ బాస్ తెలుగు 7 సీజన్లో తొలి రోజు అయిన సోమవారం నాడు నలుగురు కంటెస్టెంట్స్ నామినేషన్స్ లోకి వెళ్లారు. నరకం వంటి తరహాలో ఏర్పాటు చేసిన గదిలో ఎవరిని ఇంటి నుంచి పంపించాలనుకుంటున్నారో కారణాలు చెప్పి నామినేట్ చేయాల్సిందిగా బిగ్ బాస్ తెలిపాడు. ఒక్కో కంటెస్టెంట్ ఇద్దరి ఇంటి సభ్యుల ఫొటోలను ముక్కలు చేసి నరకం అగ్నిపర్వతంలో పడేయాలని ఆదేశించాడు. దీంతో ఇప్పటికే హీరో, డాక్టర్ గౌతమ్ కృష్ణ, సింగర్ దామిని భట్లను నటుడు శివాజీ నామినేట్ చేశాడు.
అలాగే రతిక, రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌లను సీరియల్ హీరోయిన్ ప్రియాంక జైన్ నామినేట్ చేసింది. అయితే కంటెస్టెంట్స్ చేప్పే కారణాలను కన్ఫెషన్ రూమ్ ద్వారా నామినేట్ అయ్యే సభ్యులు వినేలా చేసి బిగ్ బాస్ చిచ్చు పెట్టేందుకు ప్రయత్నించాడు. తాజాగా విడుదల చేసిన బిగ్ బాస్ తెలుగు 7 సెప్టెంబర్ 5వ రోజు ఎపిసోడ్ ప్రోమోలో నామినేషన్స్, వాటి ద్వారా వచ్చిన గొడవలను ఆసక్తికరంగా చూపించారు మేకర్స్. ముందుగా నటి కిరణ్ రాథోడ్‌ను భాష కారణంగా నామినేట్ చేస్తున్నట్లు కార్తీక దీపం శోభా శెట్టి చెప్పింది.
తర్వాత వచ్చిన దామిని హౌజ్‌లో నాకు చివర అంటే శోభా శెట్టి అని చెప్పి నామినేట్ చేసింది. అనంతరం నీ పేరు ప్రిన్సా, మీ నాన్న కింగా (ఎంట్రీ రోజు షకీల అన్న మాటలు) అని అన్న టోన్ నాకు నచ్చలేదని చెబుతూ షకీలను ప్రిన్స్ యావర్ నామినేట్ చేశాడు. నేను ఊరికనే అడిగాను మీ నాన్న కింగా అని షకీల చెబుతూ యావర్‌ను తిరిగి నామినేట్ చేసింది. నామినేషన్స్ గురించి దామిని, శోభా శెట్టి ఇద్దరూ వాదించుకున్నారు. నీ కారణం నాకు నచ్చలేదు. నిజంగా నీ తప్పే అంటూ శోభా శెట్టి మాట్లాడింది.
అనంతరం నువ్ నాకు చెప్పకు. నెక్ట్స్ వీక్ ఎవరిని నామినేట్ చేయలో నాకు తెలుసు. నీలా నేను సిల్లీ రీజన్ చెప్పను అని శోభా శెట్టి అంది. మరోవైపు ఆట సందీప్, రతిక ఇద్దరూ ఏదో అడగడం విషయంలో గొడవపడుతూ కనిపించారు. నేను వచ్చాకా మీరు చెప్పిన పనల్లా చేసినా అని పల్లవి ప్రశాంత్ అన్నాడు. శోభా గారు అని గౌతమ్ అంటే.. అంత గౌరవం అక్కర్లేదు లేండి. మీరు చెబుతుంటే వినడానికే లేదు. నీకు ఇష్టం లేదంటే నేను చెప్పడానికి కూడా రెడీగా లేను అంటూ కార్తీక దీపంలో మోనితను గుర్తు చేసింది శోభా శెట్టి. ఇలా ఆసక్తికరంగా ప్రోమోను కట్ చేశారు బిగ్ బాస్ నిర్వాహకులు.