Game Changer Second Song: గేమ్ ఛేంజర్ రెండో పాటపై అప్‍డేట్.. ‘రా మచ్చా’ అంటూ మాస్ సాంగ్.. ఆ విషయంపై ఫ్యాన్స్ అసంతృప్తి!
Game Changer Second Song: గేమ్ ఛేంజర్ రెండో పాటపై ఎట్టకేలకు అప్‍డేట్ వచ్చింది. పాట పేరుతో మూవీ టీమ్ అనౌన్స్‌మెంట్ తీసుకొచ్చింది. అయితే, ఇదేం అప్‍డేట్ అంటూ కొందరు నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ సినిమా అప్‍డేట్ల కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే, ఈ మూవీ ఆలస్యమవుతూ వస్తోంది. అయితే, ఈ సినిమా నుంచి రెండో పాటపై నేడు (సెప్టెంబర్ 25) అధికారికంగా అప్‍డేట్ ఇచ్చింది మూవీ టీమ్.
రా మచ్చా.. మచ్చా
గేమ్ ఛేంజర్ సినిమా నుంచి రెండో పాటపై మూవీ టీమ్ నేడు అనౌన్స్‌మెంట్ తీసుకొచ్చింది. ‘రా మచ్చా మచ్చా’ అంటూ ఈ పాట ఉంటుందని ఓ పోస్టర్ తీసుకొచ్చింది. త్వరలో బ్లాస్ట్‌కు రెడీ అవండి అంటూ పేర్కొంది. “రా మచ్చా మచ్చా రెండో పాటతో సెలెబ్రేషన్స్ చేసుకునేందుకు టైమ్ వచ్చింది. త్వరలో బ్లాస్ట్ కోసం సిద్ధంగా ఉండండి” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
డేట్ లేకుండానే.. ఎప్పుడు రావొచ్చంటే..
గేమ్ ఛేంజర్ నుంచి రెండో పాటపై అప్‍డేట్ ఇచ్చినా.. డేట్‍ను మాత్రం మూవీ టీమ్ వెల్లడించలేదు. పాట పేరుతోనే పోస్టర్ తీసుకొచ్చింది. దానిపై సాంగ్ రిలీజ్ డేట్ లేదు. అయితే, ఈ సాంగ్‍ను సోమవారం (సెప్టెంబర్ 30) విడుదల చేసేందుకు మూవీ టీమ్ రెడీ అవుతోందని తెలుస్తోంది. రెండు రోజుల్లో డేట్‍పై ప్రకటన వచ్చింది.
ఇదేం అప్‍డేట్.. ఫ్యాన్స్ అసంతృప్తి
ఈ రెండో పాటపై వచ్చిన అప్‍డేట్‍పై కొందరు ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కనీసం సాంగ్ రిలీజ్ డేట్ కూడా లేకుండా ఇదేం అనౌన్స్‌మెంట్ అంటూ పెదవి విరుస్తున్నారు. పాటకు సంబంధించి రామ్‍చరణ్ పోస్టర్ ఇవ్వకుండా.. సాంగ్ పేరు మాత్రమే తీసుకురావడంపై కూడా కొందరు విమర్శిస్తున్నారు. అప్‍డేట్ ఆలస్యంగా తీసుకొచ్చి ఇలా అరకొరగా చేయడం ఏంటని అంటున్నారు.
గేమ్ ఛేంజర్ సినిమ రిలీజ్ డేట్‍తో సెకండ్ సాంగ్ అనౌన్స్‌మెంట్ వస్తుందని ఆశించిన వారికి నిరాశే ఎదురైంది. ఇంక మారరా అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. డిసెంబర్ 20వ తేదీన గేమ్ ఛేంజర్ విడుదల అవుతుందని మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ట్వీట్స్ చేశారు. కానీ ప్రొడక్షన్ హౌస్ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ నుంచి మాత్రం అఫీషియల్ డేట్ రాలేదు. రెండో పాటతో అయినా సినిమా విడుదల తేదీ వస్తుందనే ఆశతో ఫ్యాన్స్ ఉన్నారు.
గేమ్ ఛేంజర్ సినిమా నుంచి రానున్న ఈ రెండో పాట పక్కా మాస్ సాంగ్‍గా ఉండనుంది. వినాయక చవితి సందర్భంగా తీసుకొచ్చిన పోస్టర్‌తో ఈ విషయాన్ని మూవీ టీమ్ స్పష్టం చేసింది. మాస్ ఫెస్టివల్‍కు రెడీ ఉండాలని చెప్పింది.
గేమ్ ఛేంజర్ సినిమాలో పాటలు గ్రాండ్‍గా ఉంటాయని నిర్మాత దిల్‍రాజు కూడా ఇటీవలే చెప్పారు. ఈ చిత్రంలో రామ్‍చరణ్‍కు జోడీగా కియారా అడ్వానీ కనిపించనున్నారు. ఎస్‍జే సూర్య, అంజలి, శ్రీకాంత్ కీలకపాత్రలు చేశారు. ఎన్నికల ప్రక్రియ ఆధారంగా రాజకీయ అంశంతో ఈ మూవీని డైరెక్టర్ శంకర్ రూపొందించారు. ఐఏఎస్ ఆఫీసర్ పాత్రను రామ్‍చరణ్ పోషించారు.