Game Changer: గేమ్ ఛేంజర్ మూవీ 2025కు వాయిదా పడుతుందా? నిర్మాత దిల్‍రాజు ఏం చెప్పారంటే..-game changer will release during christmas producer dir raju give clarity amid postpone rumours ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Game Changer: గేమ్ ఛేంజర్ మూవీ 2025కు వాయిదా పడుతుందా? నిర్మాత దిల్‍రాజు ఏం చెప్పారంటే..

Game Changer: గేమ్ ఛేంజర్ మూవీ 2025కు వాయిదా పడుతుందా? నిర్మాత దిల్‍రాజు ఏం చెప్పారంటే..

Game Changer: గేమ్ ఛేంజర్ సినిమా ఇంకా ఆలస్యమవుతుందని కొంతకాలంగా రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. రామ్‍చరణ్ హీరోగా నటించిన ఈ చిత్రం 2025కు వాయిదా పడుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో ఈ మూవీ విడుదలపై నిర్మాత దిల్‍రాజు తాజాగా స్పందించారు.

Game Changer: గేమ్ ఛేంజర్ మూవీ 2025కు వాయిదా పడుతుందా? నిర్మాత దిల్‍రాజు ఏం చెప్పారంటే..

సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ముందు వరుసలో ఉంది ‘గేమ్ ఛేంజర్’. మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ హీరోగా నటించిన ఈ పొటిలికల్ యాక్షన్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అనే ఉత్కంఠ సాగుతోంది. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కోసం తన షూటింగ్‍ను ఇటీవలే పూర్తి చేసుకున్నారు చరణ్. అయితే, ఈ మూవీ ఇంకా ఆలస్యమవుతుందని, 2025కి వాయిదా పడుతుందనే రూమర్లు ఇటీవల చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయంపై నిర్మాత దిల్‍రాజు తాజాగా స్పందించారు.

క్రిస్మస్‍కే..

గేమ్ ఛేంజర్ సినిమాను ఈ ఏడాది క్రిస్మస్ సమయంలోనే రిలీజ్ చేస్తామని నిర్మాత దిల్‍రాజు మరోసారి స్పష్టం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ వీక్ ఈవెంట్‍లో దిల్‍రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ మీడియాతో మాట్లాడుతూ గేమ్ ఛేంజర్ చిత్రంపై స్పందించారు. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్‌లోనే రిలీజ్ చేస్తామని తెలిపారు. క్రిస్మస్‍కే విడుదల చేస్తామని గతంలోనూ ఓ సందర్భంలో ఆయన చెప్పారు.

భారత రాజకీయాల్లోని ఓ అంశంపై..

భారత రాజకీయాల్లోని ఓ అంశాన్ని గేమ్ ఛేంజర్ సినిమా టచ్ చేస్తుందని దిల్‍రాజు తెలిపారు. ఈ మూవీ బిగ్ సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉందని చెప్పారు. “షూటింగ్ పూర్తయింది. ఈ ఏడాది క్రిస్మస్ సమయంలో సినిమాను రిలీజ్ చేస్తాం. శంకర్, రామ్‍చరణ్ ఇమేజ్‍లను ఈ సినిమా మారుస్తుంది. భారతీయ రాజకీయాల్లోని ఓ అంశాన్ని ఈ చిత్రం స్పృశిస్తుంది. సామాజిక విషయాలను చూపిస్తుంది. ఇది ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని, పెద్ద విజయం సాధిస్తుందని ఆశిస్తున్నా” అని దిల్‍రాజు చెప్పారు. ఈ చిత్రం ఎన్నికల వ్యవస్థపై ప్రధానంగా ఉంటుందనే అంచనాలు ఉన్నాయి.

పక్కా కమర్షియల్ సినిమా

గేమ్ ఛేంజర్ పక్కా కమర్షియల్ సినిమా అని దిల్‍రాజు తెలిపారు. మళ్లీ అప్పటి డైరెక్టర్ శంకర్‌ గుర్తుకు వస్తారని చెప్పారు. హీరో - విలన్ చిత్రంగానే ఉంటుందని అన్నారు. “ఇలాంటి సినిమాలను శంకర్ ఒకప్పుడు తెరకెక్కించారు. కానీ రోబో తర్వాత ఆయన స్టోరీ టెల్లింగ్ స్టైల్ మారింది. అయితే, శంకర్ దేనికి పేరుగాంచారో గేమ్ ఛేంజర్‌తో మళ్లీ అది గుర్తువస్తుంది. ఈ చిత్రంలోని ఐదు పాటలు ప్రేక్షకులకు విజువల్ ట్రీట్‍గా ఉంటాయి. ఇది హీరో - విలన్ మూవీగా ఉంటుంది” అని దిల్‍రాజు చెప్పారు.

గేమ్ ఛేంజర్ సినిమా మంచి ఫలితాన్ని సాధిస్తుందని తాము చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నామని దిల్‍రాజు అన్నారు. ఈ మూవీలో కొన్ని సీన్లు రీ-షూట్లు జరగనున్నాయని, ఆలస్యమవుతుందని ఇటీవలే రూమర్లు వచ్చాయి. అయితే, ఈ ఏడాది క్రిస్మస్‍కే మూవీ వస్తుందని దిల్‍రాజు మరోసారి చెప్పటంతో రామ్‍చరణ్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. త్వరలో రిలీజ్ డేట్‍ను టీమ్ ప్రకటిస్తుందేమో చూడాలి.

గేమ్ ఛేంజర్ మూవీలో ఐఏఎస్ ఆఫీసర్‌గా రామ్‍చరణ్ కనిపించనున్నారు. ఆయనకు జోడీగా కియారా అడ్వానీ నటించారు. ఎస్‍జే సూర్య, అంజలి, శ్రీకాంత్, జయరాం, సునీల్, సముద్రఖని, ప్రకాశ్ రాజ్, నాజర్ కీరోల్స్ చేశారు. శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‍రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.