మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ ఛేంజర్ మూవీపై ఆకాశమంత అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని చెర్రీ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులందరూ నిరీక్షిస్తున్నారు. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ పొలిటికల్ యాక్షన్ చిత్రం ఎప్పటికప్పుడు ఆలస్యమవుతూ వస్తోంది. దీంతో ఈ ఏడాదైనా వస్తుందా అనే టెన్షన్ పెరుగుతోంది. ఈ తరుణంలో గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్‍పై నిర్మాత దిల్‍రాజు అప్‍డేట్ ఇచ్చారు. ఎప్పుడు రిలీజ్ చేయాలనుకున్నది వెల్లడించారు.
తమిళ స్టార్ ధనుష్ స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన రాయన్ చిత్రం జూలై 26న రిలీజ్ కానుంది. ఈ తరుణంలో ప్రీ-రిలీజ్ ఈవెంట్ నేడు (జూలై 21) హైదరాబాద్‍లో జరిగింది. ఈ ఈవెంట్‍కు నిర్మాత దిల్‍రాజు హాజరయ్యారు. ఆయన స్పీచ్ ముగిస్తుండగా.. ప్రేక్షకులు గేమ్ ఛేంజర్ గురించి చెప్పాలంటూ అరిచారు. దీంతో దిల్‍రాజు స్పందించారు. “గేమ్ ఛేంజరా.. క్రిస్మస్‍కు కలుద్దాం” అని దిల్‍రాజు అన్నారు.
గేమ్ ఛేంజర్ సినిమా క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ కానుందంటూ దిల్‍రాజు అప్‍డేట్ ఇచ్చేశారు. దీంతో ఈ చిత్రం డిసెంబర్ 19 లేకపోతే డిసెంబర్ 20న రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. క్రిస్మస్ వీక్‍లో వస్తే న్యూఇయర్ కూడా కలిసి కలిసివస్తుంది. దీంతో క్రిస్మస్ వీక్‍లోనే గేమ్ ఛేంజర్ చిత్రాన్ని తీసుకొచ్చేందుకు మేకర్స్ రెడీ అయ్యారు.
గేమ్ ఛేంజర్ సినిమా కోసం హీరో రామ్‍చరణ్ తన షూటింగ్ పార్ట్ పూర్తి చేసేసుకున్నాడు. ఇంకా 10 రోజుల షూటింగ్ ఉందని డైరెక్టర్ శంకర్ ఇటీవలే చెప్పారు. త్వరలోనే గేమ్ ఛేంజర్ మూవీకి మిగిలిన ఉన్న షూటింగ్‍ను పూర్తి చేసేయనున్నారు. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఇప్పటికే జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ తరుణంలో డిసెంబర్ కల్లా గేమ్ ఛేంజర్ రెడీ అవుతుందని మేకర్స్ నమ్మకంతో ఉన్నారు. ఈ తరుణంలో క్రిస్మస్‍కే ఈ మూవీని తీసుకురానున్నట్టు నిర్మాత దిల్‍రాజు చెప్పేశారు.
డిసెంబర్ 20వ తేదీని నితిన్ హీరోగా నటిస్తున్న రాబిన్‍హుడ్ ఇప్పటికే లాక్ చేసుకుంది. నాగ చైతన్య ‘తండేల్’ మేకర్స్ కూడా ఆ డేట్‍ను అనుకుంటున్నట్టు టాక్ వచ్చింది. అయితే, గేమ్ ఛేంజర్ సినిమా వస్తే ఈ రెండు వాయిదా వేసుకోక తప్పదు. మరోవైపు కన్నప్ప చిత్రాన్ని కూడా డిసెంబర్‌లో రిలీజ్ చేస్తామని మంచు విష్ణు చెప్పారు.
అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం పుష్ప 2: ది రూల్ కూడా డిసెంబర్‌లోనే రిలీజ్ కానుంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 6వ తేదీన విడుదల కానుంది. గేమ్ ఛేంజర్ చిత్రం క్రిస్మస్‍కు రిలీజ్ అయితే.. డిసెంబర్‌లో బాక్సాఫీస్ ధమాకా జరగనుంది. ఈ రెండు భారీ పాన్ ఇండియా సినిమాలు భారీ వసూళ్లను దక్కించుకుంటాయనే అంచనాలు ఉన్నాయి.
గేమ్ ఛేంజర్ చిత్రంలో రామ్‍చరణ్‍కు జోడీగా కియారా అడ్వానీ నటించారు. అంజలి, ఎస్‍జే సూర్య, శ్రీకాంత్, జయరాం, ప్రకాశ్ రాజ్ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని దిల్‍రాజు, శిరీష్ నిర్మిస్తుండగా.. థమన్ సంగీతం అందిస్తున్నారు.
టాపిక్