NDA Alliance in AP Elections 2024 : ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ గెలుపే లక్ష్యంగా పావులు కదిపే పనిలో పడింది ఏపీలోని ఎన్డీయే(NDA) కూటమి. ఇప్పటికే అన్ని స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయగా… కొన్నిచోట్ల మార్పులు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ తరపున టికెట్ ఆశించి భంగపడ్డ పలువురు నేతలు…. ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై(Chandrababu) తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ క్రమంలోనే…. ఒకటి రెండు చోట్ల సర్దుబాట్లు చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే టీడీపీ కండువా కప్పుకున్న రఘురామకృష్ణరాజుకు (RRR) టికెట్ ఇచ్చే అంశంపై తెలుగుదేశం మల్లగుల్లాలు పడుతోంది.
తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి(Anaparthi) అసెంబ్లీ సీటుపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఫస్ట్ జాబితాలోనే టీడీపీ అభ్యర్థిగా రామకృష్ణారెడ్డి పేరు ఖరారైంది. కానీ సర్దుబాట్ల తర్వాత… ఈ సీటు బీజేపీ ఖాతాలోకి వెళ్లింది. దీంతో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పోరాటానికి దిగారు. ఆయన అనుచరులు కూడా వెనక్కి తగ్గకుండా…. తప్పకుండా పోటీలో ఉంటామనే విధంగా ముందుకు సాగుతున్నారు. రామకృష్ణారెడ్డి కూడా పోటీ నుంచి తప్పుకునే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ పర్యటన అంటూ ప్రజల్లోకి వెళ్లే పనిలో పడ్డారు రామకృష్ణారెడ్డి. ఇందుకు జనాల నుంచి కూడా మంచి స్పందన వచ్చింది. అయితే టీడీపీని వీడుతారనే ప్రచారం జరిగినప్పటికీ… అలాంటిందేమి లేదన్నారు రామకృష్ణారెడ్డి.
అనపర్తిలోని రాజకీయ సమీకరణాలపై(Anaparthy Assembly constituency) ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటున్న చంద్రబాబు…. రామకృష్ణారెడ్డికి టికెట్ ఇప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఎన్జీయే కూటమిలోని ముఖ్య నేతల భేటీలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారని తెలిసింది. అయితే అనపర్తి సీటును టీడీపీకి ఇస్తే… అన్నమయ్య జిల్లా పరిధిలో ఉన్న తంబళ్లపల్లె సీటును బీజేపీకి ఇచ్చేలా ప్రతిపాదన పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై బీజేపీ నాయకత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పార్టీలోని నేతలంతా చర్చించి….ఈ ప్రతిపాదనపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందుకు కాషాయదళం ఒకే అంటే…. అనపర్తి సీటు రామకృష్ణారెడ్డికే దక్కనుంది.
మరోవైపు ఇటీవలే టీడీపీ(TDP) కండువా కప్పుకున్నారు రఘురామ కృష్ణరాజు. అయితే ఆయన బీజేపీ తరపున టికెట్ ఆశించినప్పటికీ…. ఆయనకు ఛాన్స్ దక్కలేదు. అ తర్వాత టీడీపీలో చేరిన రఘురామ(Raghu Rama Krishna Raju)…. ప్రస్తుతం టికెట్ ఆశిస్తున్నారు. నర్సాపురం నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు. ఈ సీటు ఇప్పటికే బీజేపీకి ఖరారైంది. భూపతిరాజు శ్రీనివాసవర్మ పేరును ప్రకటించారు. ఇప్పటికే ఆయన ప్రచారం మొదలుపెట్టారు. అయితే కూటమిలో భాగంగా…. తనకు నర్సాపురం(Narasapuram Lok Sabha constituency) సీటును కేటాయించాలని రఘురామ.. చంద్రబాబుపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ సీటును టీడీపీకి కేటాయించాలని బీజేపీ నేతల వద్ద ప్రతిపాదన పెట్టినట్లు తెలుస్తోంది. ఇందుకు ప్రతిఫలంగా ఉండి అసెంబ్లీ స్థానాన్ని శ్రీనివాసవర్మకు ఇవ్వాలని సూచించినట్లు సమాచారం. ఈ విషయంపై కూడా బీజేపీ నేతలు… హైకమాండ్ పెద్దలతో చర్చించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. నర్సాపురం సీటును వదలుకునేందుకు బీజేపీ సిద్ధపడుతుందా..? లేదా..? అనేది తేలాల్సి ఉంది…!