Nara Lokesh Phone Tapping : నారా లోకేశ్ కు ఫోన్ ట్యాపింగ్ అలర్ట్ - నోటిఫికేషన్ పంపిన ఆపిల్ సంస్థ, ఈసీకి టీడీపీ ఫిర్యాదు
Nara Lokesh Phone Tapping : నారా లోకేశ్ ఫోన్ కు ఆపిస్ సంస్థ అలర్ట్ పంపింది. ఫోన్‍కు ట్యాపింగ్(Phone Tapping), హ్యాకింగ్ అలెర్ట్ నోటిఫికేషన్ ఇచ్చింది. జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అయితే లోకేశ్ ఫోన్ ను ట్యాపింగ్ చేశారంటూ ఈసీకి టీడీపీ ఫిర్యాదు చేసింది.
Nara Lokesh Phone Tapping : కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) వ్వవహారం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో పలువురు ఉన్నతాధికారులు కూడా ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. దర్యాప్తు కొనసాగుతుండగా…. డొంక కదులుతోంది. ట్యాపింగ్ వ్యవహారం వెనక ఎవరు ఉన్నారనే దానిపై సిట్ లోతుగా దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే…. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారంటూ ఈసీని ఆశ్రయించింది తెలుగుదేశం పార్టీ. ఆపిస్ సంస్థ పంపిన సెక్యూరిటీ అలెర్ట్ విషయాన్ని ఇందులో ప్రస్తావించింది.
లోకేశ్ ఫోన్ కు సెక్యూరిటీ అలెర్ట్….
నారా లోకేశ్ (Nara Lokesh)కు సెక్యూరిటీ అలెర్ట్ పంపింది ఆపిల్ సంస్థ. ఫోన్ ట్యాపింగ్, హ్యాకింగ్ సంబంధించి నోటిఫికేషన్ ను ఇచ్చింది. ఫోన్ హ్యాకింగ్, ట్యాపింగ్ ప్రయత్నం జరుగుతుందని ఆపిల్ నుంచి ఈమెయిల్ అందింది. ట్యాపింగ్, హ్యాకింగ్ కు అవకాశం ఇవ్వకుండా… జాగ్రత్తలు తీసుకోవాలని లోకేశ్ కు సూచించింది. దీంతో ఏపీలో ఎన్నికల వేళ ఫోన్ ట్యాపింగ్ అంశం చర్చనీయాంశంగా మారింది.
ఈసీకి ఫిర్యాదు…
నారా లోకేశ్(Nara Lokesh) ఫోన్‌ను ట్యాప్ చేశారంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి(EC) లేఖ రాశారు ఆ పార్టీ మాజీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంధ్ర కుమార్. గుర్తుతెలియని ఏజెన్సీల ద్వారా పెగాసస్ సాప్ట్‌వేర్ సాయంతో లోకేశ్ ఫోన్‌ను ట్యాప్ చేసినట్లు ఐ పోన్ సందేశాలు వచ్చాయని తెలిపారు. ఇలాంటి సందేశాలే లోకేశ్ కు 2024 మార్చి నెలలో కూడా వచ్చాయని పేర్కొన్నారు. రాష్ట్ర డీజీపీ రాజేంధ్రనాధ్ రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్‌ఆర్ ఆంజనేయులు అధికార పార్టీ తొత్తులుగా వ్యవహరిస్తూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని అనేకమార్లు ఫిర్యాదు చేశామని గుర్తు చేశారు. రాష్ట్ర డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్ లు ఎన్డీఏ కూటమిలోని సభ్యులపై వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని లేఖలో ప్రస్తావించారు. గత రెండేళ్లుగా ఇంఛార్జ్‌గా విధులు నిర్వర్తిస్తున్న డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి నియామకం ప్రకాష్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధమన్నారు. పి.ఎస్.ఆర్ ఆంజనేయులు అధికారపార్టీకి తొత్తుగా పనిచేస్తున్నారని ఆయనపై అనేక ఆరోపణలు ఉన్నాయని వివరించారు. సాధారణ ఎన్నికల నేపథ్యంలో అధికారపార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న వీరిపై తగు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. వారి స్థానాల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించే అధికారులను నియమించాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు.