టీఆర్ఎస్ ప్రభుత్వం(TRS Govt)పై గవర్నర్ తమిళిసై(Governor Tamilisai) కీలక వ్యాఖ్యలు చేశారు. తన ప్రైవసీకి భంగం కలుగుతుందని వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. తాను ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నానని చెప్పడం ఆశ్చర్యంగా ఉందని చెప్పారు. తనకు ఎలాంటి భేషజాలు లేవని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి రాసిన లేఖపై స్పందిస్తూ.. సీఎంవో(CMO) నుంచి మంత్రికి లేక రావడానికి జాప్యమైతే సమస్యలు ప్రగతి భవన్ కు ఎలా చేరుతాయని ప్రశ్నించారు. తన పర్యటనల సందర్భంగా ప్రొటోకాల్ పాటించని కలెక్టర్, ఎస్పీలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని అడిగారు.
'రాజ్‌భవన్(Raj Bhavan) ప్రతిష్ట తగ్గించాలని చూస్తున్నారు. రాజ్‌భవన్ ముందు ధర్నా చేస్తారని విద్యార్థుల జేఏసీ(JAC) పేరిట వార్తలు వస్తున్నాయి. రాజ్‌భవన్ తలుపులు ఎప్పటికీ తెరిచే ఉంటాయి. బాసర విద్యార్థులు(Basara Students) వచ్చారు. మిగతా విద్యార్థులు కలుసుకునేందుకు వచ్చారు. రాజ్‌భవన్ తలుపులు ఎప్పటికీ తెరుచుకుని ఉంటాయి. ప్రగతిభవన్ మాదిరిగా కాదు. తెలంగాణ(Telangana)లో అప్రజాస్వామిక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రజా సమస్యల విషయంలో సానుకూలంగా స్పందిస్తాను. ఫాంహౌస్ కేసులో నన్ను లాగే ప్రయత్నం చేశారు. మాజీ ఏడీసీ తుషార్‌ను ఈ కేసులోకి తీసుకువచ్చిన కారణం అదే.' అని గవర్నర్ తమిళిసై అన్నారు.
ప్రభుత్వం వద్ద నుంచి తన వద్దకు బిల్లులు వచ్చిన విషయాన్ని గవర్నర్ తమిళిసై చెప్పారు. ప్రభుత్వ బిల్లుల విషయమై పరిశీలిస్తున్నామన్నారు. వర్సిటీలో ఉమ్మడి నియామక బోర్డుపై ప్రక్రియ కొనసాగుతోందన్నారు. బిల్లుపై సందేహాలు నివృత్తి చేసుకోవాల్సిన అవసరం ఉందని, అది మంచిదన్నారు. ఇతర బిల్లులపైనా.. సందేహాలు నివృత్తి చేసుకోవాలన్నారు. అన్ని బిల్లులపై సమగ్రంగా పరిశీలన కోసం సమయం తీసుకున్నానని తెలిపారు. ఖాళీగా ఉన్న టీచింగ్(Teaching), నాన్ టీచింగ్ పోస్టు(Non Teaching Jobs)లను భర్తీ చేయాలని చెప్పినట్టుగా గుర్తు చేశారు. యూనివర్సిటీల వీసీలతోనూ మాట్లాడానని, అన్ని అంశాలపై సమగ్ర నివేదిక రూపొందించినట్టుగా చెప్పారు.
'ఖాళీల విషయమై ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇచ్చాను. పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాను. వీసీ పోస్టులు(VC Posts) కూడా చాలా రోజులుగా ఖాళీగా ఉన్నాయి. డిమాండ్ చేశాక వీసీలను నియమించారు. కొత్త విధానంపై నాకు సందేహాలు ఉన్నాయి. న్యాయపరంగా చెల్లుబాటు అవుతుందా? కేంద్రీకృత విధానంతో సమస్యలు ఏం రావా? నియామకాలు పారదర్శకంగా జరగాలి. అర్హులకు మాత్రమే పోస్టులు దక్కాలి. నేను ఎలాంటి బిల్లులు ఆపలేదు. బిల్లులను తొక్కి పెట్టాననడం సరికాదు. కొత్తగా నియామక బోర్డు ఎందుకు అనిని అడిగాను. బిల్లులను ఒకదాని వెంట ఒకటి పరిశీలిస్తున్నా. నియామకాల బిల్లుకే మొదటి ప్రాధాన్యం ఇచ్చా.' అని గవర్నర్ తమిళిసై అన్నారు.